‘పెండింగ్‌’పై 23న భేటీ

Central and AP Coordinating Committee meeting video conference - Sakshi

ఏపీపై కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌ కార్యదర్శి నేతృత్వంలో సమీక్ష

వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర, రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశం

అజెండాలో రెవెన్యూ లోటు భర్తీ సహా ప్రత్యేక హోదా అంశం 

విశాఖలో మెట్రో రైలు, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ ఏర్పాటు తదితరాలు 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారానికి ఏర్పాటైన కేంద్ర, రాష్ట్ర సమన్వయ కమిటీ ఈ నెల 23వ తేదీన సమావేశమై సమీక్ష నిర్వహించనుంది. కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌ (సమన్వయ) కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌ డైరెక్టర్‌ ఎం.చక్రవర్తి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం పంపారు. ఈ–సమీక్ష పోర్టల్‌లో పొందుపరిచిన ఏపీకి చెందిన అంశాలపై సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. 

రెవెన్యూ లోటు, హోదా..
సమన్వయ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్న 34 అంశాలతో పాటు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల వద్ద అపరిష్కృతంగా ఉన్న 15 అంశాలను సమీక్ష అజెండాలో చేర్చారు. రాజధానిలో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన ఆర్థిక సాయం అందించడంతో పాటు రాష్ట్ర విభజన జరిగిన ఏడాది రెవెన్యూ లోటు భర్తీతో సహా ప్రత్యేక హోదా అంశాన్ని కూడా అజెండాలో పొందుపరిచారు. జాతీయ రహదారులు, రైల్వే లైన్లకు సంబంధించి పెండింగ్‌ అంశాలను అజెండాలో చేర్చారు. 

అజెండాలో ముఖ్యాంశాలు ఇవీ...
► విభజన చట్టం 13వ షెడ్యూల్‌లో పేర్కొన్న మేరకు ఆరు నెలల్లోగా కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు.
► కొత్త రాజధాని నుంచి హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ముఖ్యమైన నగరాలకు ర్యాపిడ్‌ రైలుతోపాటు రోడ్డు కనెక్టివిటీ కల్పించడం.
► విభజన చట్టం 13వ షెడ్యూల్‌ ప్రకారం వైఎస్సార్‌ జిల్లాలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు.
► 2014–15 ఆర్థిక ఏడాదిలో రెవెన్యూ లోటు భర్తీకి నిధులు అందించడం.
► 2016లో ప్రధాని ప్రకటన మేరకు విశాఖలో జాతీయ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూషన్‌ ఏర్పాటు.
► కొత్త రాజధానిలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్థిక సాయం అందించడం.
► పోలవరంలో ఆర్‌ అండ్‌ ఆర్‌తో సహా ప్రాజెక్టుకయ్యే పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరించడం. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఇతర అంశాలతో పాటు ఒడిశా, చత్తీస్‌గడ్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు చర్యలు తీసుకోవడం.
► విశాఖలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ ఏర్పాటు చేయడం.
► విశాఖలో మెట్రో రైలు ఏర్పాటుకు చర్యలు చేపట్టడం.
► వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ అందించడం.
► ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడం.
► విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పారిశ్రామిక ఆర్థిక ప్రగతికి పన్ను రాయితీలు ఇవ్వడం. హైదరాబాద్‌లో ఉన్న వివిధ శిక్షణ సంస్థలను ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పడం.
► కాకినాడ పోర్టు సమీపంలో ఎలక్ట్రానిక్‌ (హార్డ్‌వేర్‌) ఉపకరణాల తయారీ కేంద్రం ఏర్పాటు.  

16న పీపీఏ సర్వసభ్య సమావేశం 
పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ (పీపీఏ) సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 16న హైదరాబాద్‌లో జరగనుంది. సమావేశంలో ఈ సీజన్‌లో చేపట్టాల్సిన పనులు, సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌..ఆ మేరకు నిధుల మంజూరుపై చర్చించనున్నారు.

పీపీఏ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని 4 నెలల క్రితం పీపీఏ సీఈవోకు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ లేఖ రాశారు. పీపీఏ నుంచి స్పందన లేకపోవడంతో ఇటీవల అదే అంశాన్ని గుర్తు చేస్తూ మరో లేఖ రాశారు. దీనిపై స్పందించిన పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ 16న సమావేశాన్ని నిర్వహిస్తామని ఏపీకి సమాచారమిచ్చారు. కాగా, ఏడాది క్రితం పీపీఏ సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top