బుద్దా వెంకన్న అల్లుడి నుంచి ప్రాణహాని ఉంది | Buddha Venkanna Son-In-Law Victims Emotional Comments | Sakshi
Sakshi News home page

బుద్దా వెంకన్న అల్లుడి నుంచి ప్రాణహాని ఉంది

May 19 2026 4:37 AM | Updated on May 19 2026 4:37 AM

Buddha Venkanna Son-In-Law Victims Emotional Comments

విజయవాడ వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో గడ్డం రేణుకాదేవి, సుమన్‌ దంపతులు

వెంకన్న అల్లుడు కాండ్రేగుల రవితో కలిసి వ్యాపారం చేశాం 

అతడి ఇతర వ్యాపారాలు తెలిసి బయటకు వచ్చేశాం

అతడి వద్ద ఉన్న చెక్కులు, నోట్లు ఇవ్వకుండా కేసులు వేస్తున్నారు 

ఒకసారి కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు 

విజయవాడ సీపీకి సుమన్, రేణుకాదేవి దంపతుల ఫిర్యాదు

సాక్షి నెట్‌వర్క్‌: తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అల్లుడు కాండ్రేగుల రవి నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని విజయవాడకు చెందిన గడ్డం సుమన్, రేణుకాదేవి దంపతులు సోమవారం విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ (సీపీ) కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తమను పదేపదే బెదిరిస్తూ ఇబ్బందులకు గురిచేయడమేగాక తమపై కత్తితో పొడిచి హత్యాయత్నం కూడా చేసినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొ­న్నారు. ఈ ఫిర్యాదును సీపీ కార్యాలయం వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌కు పంపటంతో వారు సోమవారం సాయంత్రం వన్‌టౌన్‌ స్టేషన్‌కు వచ్చారు.

ఈ సందర్భంగా సుమన్, రేణుకాదేవి దంపతులు మీడియాతో మాట్లాడారు. కాండ్రేగుల రవితో కలిసి 2020లో వ్యాపారం ప్రారంభించినట్లు తెలిపారు. వ్యాపారం ప్రారంభంలో ఆర్థిక లావాదేవీల నిమిత్తం ఖాతా వివరాలు, ఇతర ప్రభుత్వ అనుమతుల కోసం అని చెప్పి నాలుగు చెక్కులు, రేణుకా­దేవి సంతకాలతో ప్రామిసరీ నోట్లు తీసుకున్నారని చెప్పారు. రవి అంతకుముందు కాల్‌మనీ కేసులు, క్రికెట్‌­బెట్టింగ్‌లు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు వంటి వ్యాపారాల్లో కీలకంగా ఉన్నట్లు తెలియడంతో తాము 2023లో వ్యాపారం నుంచి బయటకు వచ్చేసినట్లు తెలి­పారు. రవికి చెల్లించాల్సిన మొత్తాన్ని ఇచ్చేశామని, అతడు మాత్రం తమ చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇవ్వలేదని చెప్పారు.

వాటిగురించి ఒత్తిడి చేస్తే రవి తమపై కత్తితో దాడిచేసి పొడిచి గాయపరిచాడని, హత్యాయత్నం చేశాడని పేర్కొన్నారు. దీనిపై పోలీసులకు సమాచారమిచ్చినా.. రవి అతడి మామ అండదండలతో విచారణ లేకుండా చేశారన్నారు. ఇటీవల రవి తమ చెక్కులను అతడి అనుచరుల పేరు మీద రాసి కోర్టులో వేశాడని చెప్పారు. ఒక చెక్కు అసలు బ్యాంకుకు రాకుండానే కోర్టులో వేశారన్నారు. 

ఆ వ్యక్తులతో తమకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని తమను రవి, అతని కుటుంబం వారు బతకనివ్వరని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఏదైనా జరిగితే కాండ్రేగుల రవి, అతడి కుటుంబానిదే బాధ్యత అని పేర్కొన్నారు. పోలీసులు తమ ఫిర్యాదుపై కేసు నమోదుచేసి విచారించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement