Brain Tumor: బ్రెయిన్‌ ట్యూమర్ గుర్తించడం ఇలా.. కారణాలివే..

Brain Tumor Symptoms, Early Stage Signs, Causes, Treatment - Sakshi

జీజీహెచ్‌కు నెలకు 20 నుంచి 30 మంది బాధితులు

బాధితుల్లో చిన్నారులు, మధ్య వయస్సువారు

ఎక్కువగా రెండో దశలోనే వస్తున్న వైనం

అవసరాన్ని బట్టి మందులు, శస్త్రచికిత్సలు

అందుబాటులో అత్యాధునిక డయాగ్నోస్టిక్‌ సేవలు

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల కాలంలో బ్రెయిన్‌ ట్యూమర్‌ బాధితులు పెరుగుతున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రికే ప్రతినెలా 20 నుంచి 30 మంది వరకూ బ్రెయిన్‌ ట్యూమర్‌ బాధితులు వస్తుండగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన తలనొప్పితో వచ్చిన వారికి  బ్రెయిన్‌ స్కాన్‌ చేసి వ్యాధిని నిర్ధారించి, అవసరమైన చికిత్సలు చేస్తున్నారు. 

ఒకప్పుడు ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన వారిలో బ్రెయిన్‌ ట్యూమర్‌లు చూసేవారమని, ఇప్పుడు 15 ఏళ్ల చిన్నారులు, 30–40 ఏళ్ల మధ్య వయస్సు వారిలోనూ బ్రెయిన్‌ ట్యూమర్లు చూస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. బ్రెయిన్‌ ట్యూమర్లు రావడానికి అనేక కారణాలు ఉంటాయని, చిన్న పిల్లల్లో జన్యుపరమైన లోపాలే కారణంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చినట్లు చెపుతున్నారు.  

కారణాలివే.. 
► జన్యుపరమైన లోపాలు 
► తీసుకునే ఆహారం వలన  
► సెల్‌ఫోన్‌ రేడియేషన్‌  
► స్మోకింగ్, ఆల్కాహాల్‌ తీసుకునే వారిలోనూ రావచ్చు. 

గుర్తించడం ఇలా... 
బ్రెయిన్‌ ట్యూమర్‌కు నాలుగు దశలు ఉంటాయని వైద్యులు చెపుతున్నారు.  
మొదటి దశ : తలనొప్పి, వాంతులు, తల తిరగడం. 
రెండోదశ : తీవ్రమైన తలనొప్పి, అకారణంగా వాంతులు అవడం, తలతిరగడం ఎక్కువగా ఉంటుంది. 
మూడో దశ : బ్రెయిన్‌లోని ట్యూమర్‌ ఇతర అవయవాలకు వ్యాప్తి చెందుతుంది. ఊపిరితిత్తులు, వెన్నుపూసలకు విస్తరిస్తుంది. లక్షణాలు కూడా తీవ్రంగా ఉంటాయి.  
నాలుగోదశ : ట్యూమర్‌ కణాలు శరీరంలోని రక్తంలో కలిసి అంతా వ్యాప్తి చెందుతుంది. ఈ దశలో రోగి మరింత క్షీణిస్తాడు. 

చికిత్సలు ఇలా.. 
బ్రెయిన్‌ ట్యూమర్‌ దశను బట్టి చికిత్స అందిస్తారు. కొందరికి మందులు ఇస్తూ ట్యూమర్‌ను తగ్గిస్తారు. మరికొందరికి శస్త్ర చికిత్స ద్వారా ట్యూమర్‌ను తొలగిస్తారు. రేడియేషన్‌ థెరపీ, శస్త్ర చికిత్స తర్వాత కీమోథెరపీ వంటి చికిత్సలు అందిస్తారు. ప్రస్తుతం ఆధునిక చికిత్స, అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో బ్రెయిన్‌ ట్యూమర్‌ రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి.  

నిర్ధారణ ఇలా.. 
తలనొప్పితో వచ్చిన రోగికి సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్‌లు చేయడం ద్వారా బ్రెయిన్‌ ట్యూమర్‌ను నిర్ధారిస్తారు. ఒకప్పుడు బ్రెయిన్‌ ట్యూమర్‌ను నాలుగో దశ వచ్చే వరకూ గుర్తించే వారు కాదు. వ్యాధి నిర్ధారణ కాకముందే మరణించినవారు కూడా ఉన్నారు.  ఇప్పుడు అత్యాధునిక డయాగ్నోస్టిక్‌ సేవలు అందుబాటులోకి రావడంతో తొలిదశలోనే గుర్తించగలుగుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలో సైతం రెండు సీటీ స్కానింగ్‌ యంత్రాలతో పాటు, ఒక ఎంఆర్‌ఐ పరికరం అందుబాటులో ఉంది. ప్రైవేటులో సైతం విస్తృతంగా స్కానింగ్‌ పరికరాలు అందుబాటులోకి రావడంతో తొలిదశలో గుర్తించగలుగుతున్నారు. (క్లిక్ చేయండి: చలికాలం మెదడుకు ముప్పు.. జాగ్రత్త..!)


ఎక్కువగా రెండో దశలోనే వస్తున్నారు 

ప్రభుత్వాస్పత్రిలోని న్యూరాలజీ ఓపీకి నెలకు 20 నుంచి 30 మంది వరకూ బ్రెయిన్‌ ట్యూమర్‌ రోగులు వస్తున్నారు. ఎక్కువగా రెండో దశలోనే వస్తున్నారు. వారి పరిస్థితిని అంచనా వేసి మందులు ఇవ్వాలా, శస్త్ర చికిత్స చేయాలా అనేది నిర్ధారిస్తాం. తీవ్రమైన తలనొప్పితో వచ్చిన వారికి సీటీ, ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయడంతో ట్యూమర్‌ను నిర్ధారిస్తున్నారు. అందుకోసం ప్రభుత్వాస్పత్రిలో రెండు సీటీ స్కాన్‌లు, ఒక ఎంఆర్‌ఐ స్కానింగ్‌ పరికరం అందుబాటులో ఉంది.  
– డాక్టర్‌ దార వెంకట రమణ, న్యూరాలజీ విభాగాధిపతి, జీజీహెచ్, విజయవాడ 


కచ్చితమైన నిర్ధారణ 

బ్రెయిన్‌ ట్యూమర్లను కాంట్రాస్ట్‌ సీటీతో కచ్చితమైన నిర్ధారణ చేస్తాం. బ్రెయిన్‌లో ఏదైనా గడ్డ ఉంటే అది ట్యూమరా, ఇంకేమైనా ఉందా అనేది తెలుసుకోవచ్చు. ఏ ప్రాంతంలో ట్యూమర్‌ ఉంది అనేది చెప్పవచ్చు.  ఒకప్పుడు నాలుగో దశ వరకూ తెలుసుకునే వారు కాదు. ఇప్పుడు అడ్వాన్స్‌డ్‌ డయాగ్నోస్టిక్‌ సర్వీసెస్‌ అందుబాటులోకి రావడంతో. మొదటి, రెండో దశలోనే గుర్తించగలుగుతున్నారు. తలనొప్పితో వచ్చిన వారికి  లక్షణాలను బట్టి స్కాన్‌ చేస్తే ట్యూమర్‌ ఉంటే నిర్ధారణ చేయొచ్చు.  
– డాక్టర్‌ ఎన్‌.దీప్తిలత, రేడియాలజిస్ట్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top