‘స్మార్ట్‌’ ఉచ్చులో కౌమారం.. గంటలు గంటలు ఫోన్‌లోనే

Boys and girls in student stage are addicted to smart phones - Sakshi

13–17 ఏళ్ల వారిలో 28 శాతం మంది రోజుకు 6 గంటలకు పైగా ఫోన్‌లోనే 

సాక్షి, అమరావతి: స్మార్ట్‌ ఫోన్‌కు విద్యార్థి దశలోని బాలబాలికలు బానిసలుగా మారిపోతున్నారు. డిజిటల్‌ పరికరాలపై గంటల కొద్దీ గడుపుతూ సమయాన్ని వృథా చేసుకుంటున్నా­రు. 13–17 ఏళ్ల వారిలో 28 శాతం మంది రోజుకు 6 గంటలకు పైగా ఫోన్‌లోనే గడిపేస్తున్నారని సర్వేల్లో బహిర్గతమైంది. వీరు భౌతికంగా సమాజంతో కంటే సోషల్‌ మీడియా ప్రపం­చంలో ఎక్కువగా బతికేస్తున్నారు. ఫలితంగా తరగతుల్లో పాఠాలు వింటున్నప్పుడు, అసైన్‌మెంట్లు, ఇతర పను­లు చేస్తున్నప్పుడు ఏకాగ్రత లోపించి ఇబ్బంది పడుతున్నట్టు ఢిల్లీలోని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియాలో కమ్యూనిటీ మెడిసిన్‌ స్పెషలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిజజీవితంలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపడం కంటే సోషల్‌ మీడియాలో పరిచయస్తులనే ఎక్కువగా ఇష్టపడుతుండటాన్ని ప్రస్తావిస్తూ.. ఇది సామాజిక సంబంధాలపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు కామన్‌ సెన్స్‌ మీడియా అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఆన్‌లైన్‌ పోర్నోగ్రఫీలోకి యువత అనుకోకుండా జారిపోతున్నారని వెల్లడించింది. 1,350 మంది యుక్త వయస్కులు పాల్గొన్న సర్వేలో 58 శాతం మంది అనుకోకుండా అశ్లీల వీడియోలను వీక్షిస్తున్నట్లు వెల్లడైంది.  

సోషల్‌ మీడియా ద్వారానే.. 
ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడే టీనేజర్లకు ఆ గేమ్స్‌ ఆడే స్నేహితుల ద్వారా అశ్లీలత పరిచయం అవుతున్నట్టు సర్వేలో తేలింది. ఇందులో ఇంకా విస్తుగొలిపే విషయం ఏంటంటే.. 13 ఏళ్లలోపు వారిలో 50 శాతం మంది అలా పోర్న్‌ వీడియోలకు పరిచయం అవుతున్నట్లు సర్వే పేర్కొనడం. అయితే.. సోషల్‌ మీడియా, రీల్స్‌ ద్వారా ఎక్కువ మంది పోర్న్‌కు ఆకర్షితులు అవుతున్నారు. 44 శాతం మంది ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లు, 4 శాతం మంది యూట్యూబ్‌ స్ట్రీమింగ్, 34 శాతం మంది సబ్‌స్క్రిప్షన్‌ సైట్‌లు, లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా అశ్లీలతను చూస్తున్నారు.

ఈ క్రమంలోనే సోషల్‌ మీడియా వినియోగ ప్రారంభ వయసును 13 నుంచి 15కు పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది 10 ఏళ్ల లోపు చిన్నారులు కూడా సొంతంగా సోషల్‌ మీడియా ఖాతాలు కలిగి ఉన్నారని, నిబంధనలు ఎక్కడ అమలవుతున్నాయని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. దేశంలో కొత్త ఐటీ రూల్స్‌ 2021 ప్రకారం అనేక అశ్లీల వెబ్‌సైట్‌లపై నిషేధం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడకపోవడం కూడా యువత పెడదారి పట్టడానికి కారణం అవుతోందని విమర్శిస్తున్నారు. 

నాలుగింట ఒక వంతు.. 
కౌమార దశలో (13–17 ఏళ్ల) ఉన్న పిల్లలు నాలుగింట ఒక వంతుకు పైగా రోజుకు ఆరు గంటలు దాటి స్మార్ట్‌ ఫోన్‌కే అతుక్కుపోతున్నారు. ఈ విషయంలో 2019లో జరిగిన సర్వేలో 15 శాతం మంది పిల్లలు స్మార్ట్‌ఫోన్‌ వదలట్లేదని అప్పట్లో తల్లిదండ్రులు చెబితే.. ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పెరగడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆ స్వచ్ఛంద సంస్థ 9,633 మంది తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top