నిబంధనలకు లోబడే గవర్నర్‌ నిర్ణయం | BJP statement on Andhra Pradesh Capital bills | Sakshi
Sakshi News home page

నిబంధనలకు లోబడే గవర్నర్‌ నిర్ణయం

Aug 1 2020 3:10 AM | Updated on Aug 1 2020 3:52 AM

BJP statement on Andhra Pradesh Capital bills - Sakshi

సాక్షి, అమరావతి: గవర్నర్‌ తన రాజ్యాంగ అధికారాలకు అనుగుణంగా, నిపుణులతో చర్చించి, నిబంధనలకు లోబడి మూడు రాజధానుల విషయంలో నిర్ణయం తీసుకున్నారని బీజేపీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర శాఖ శుక్రవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఉన్నత రాజ్యాంగ వ్యవస్థలపైన ఉన్న గౌరవం కారణంగా గవర్నర్‌ నిర్ణయంపైన బీజేపీ ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయదు. ఇటువంటి ఉత్తమ ప్రమాణాలనే ఇతర పార్టీలు కూడా పాటిస్తాయని బీజేపీ ఆశించింది. కానీ, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు రాజ్యాంగ వ్యవస్థ అయిన గవర్నర్‌ను కూడా నిందించడం శోచనీయం. ఇది ఆయన అవకాశవాదానికి పరాకాష్ట’ అని వ్యాఖ్యానించింది. ఫెడరల్‌ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు వ్యవస్థలకు లోబడి ఉంటాయని, అవి అన్ని వేళలా ఒకేలా ఉంటాయని గుర్తు చేసింది.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ఇప్పుడు మరోలా..
► తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు అన్ని అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానివేనని, కేంద్రానికి, గవర్నర్‌కు ఏ అధికారాలు లేవని చెప్పిన సంగతిని రాష్ట్ర ప్రజలింకా మర్చిపోలేదు. 
► ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక సర్వాధికారాలు కేంద్రానికి, గవర్నర్‌కు ఉంటాయని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది.
► టీడీపీ, మరి కొంత మంది స్వార్ధ, రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వైఖరిని తప్పుపడుతున్నారు.
► గవర్నర్‌ వ్యవస్థ వారికి అనుకూలంగా పనిచేయాలని, రాజధాని బిల్లులపై కేంద్రం జోక్యం చేసుకోవాలని, లేకుంటే రాజ్యాంగ, విభజన చట్టానికి విరుద్ధమని వక్రభాష్యాలు చెప్పి బీజేపీని టార్గెట్‌ చేసే ప్రయత్నం చేశారు. 
► రాజధాని రైతులకు పూర్తిగా న్యాయం చేయాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది.

మా పార్టీ విధానమిదీ..
► అమరావతి రాజధానిగా కొనసాగాలని బీజేపీ రాష్ట్ర శాఖ తీర్మానం చేసింది.
► అక్కడే రాజధానిని కొనసాగించడం సమంజసమన్నది పార్టీ విధానం. 
► హైకోర్టు సీమలో ఉండాలని ప్రథమంగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించాం.
► అమరావతి నిర్మాణం విషయంలో టీడీపీ, ఇప్పుడు మూడు రాజధానుల విషయంలో వైసీపీ, తమ వ్యాపార లావాదేవీలకు సంబంధించినట్టు మార్చడం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.
► రైతులు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ చేసింది రాజకీయ తీర్మానం మాత్రమే. దానిని కేంద్ర ప్రభుత్వ విధానంగా చూసే ఆస్కారం లేదు. ఆ నిర్ణయం తీసుకున్న రోజునే బీజేపీ నాయకులు దీనిపై స్పష్టం చేశారు.
► రాష్ట్ర రాజధాని రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో అంశమని, ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదని కేంద్ర హోం శాఖ ఈ ఏడాది ఫిబ్రవరి 11న పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని రాష్ట పార్టీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహరావు, రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌చార్జి సునీల్‌ ధియోధర్, ఇతర నాయకులు అనేక సందర్భాల్లో చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement