జనావాస పరిసరాల్లోకి గొరగేదెలు.. భయపడుతున్న జనం | Bisons Coming From Forest to Populated Areas in Alluri Sitarama Raju District | Sakshi
Sakshi News home page

జనావాస పరిసరాల్లోకి గొరగేదెలు.. భయపడుతున్న జనం

May 23 2022 8:13 PM | Updated on May 23 2022 8:13 PM

Bisons Coming From Forest to Populated Areas in Alluri Sitarama Raju District - Sakshi

అటవీ ప్రాంతంలో ఉండాల్సిన గొరగేదెలు (బైసన్స్‌) గ్రామాల సమీపంలోకి వచ్చేస్తున్నాయి.

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో గొరగేదెలు జనావాస ప్రాంతాల్లోకి వచ్చేస్తుండటంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. పైడిపనుకుల, మంప, సూరేంద్రపాలెం పరిసర ప్రాంతాల్లో ఇవి సంచరిస్తున్నట్టుగా వారు చెబుతున్నారు. వేసవి తీవ్రత, అటవీప్రాంతంలో తాగునీరు అందుబాటులో లేకపోవడమే అవి బయటకు రావడానికి కారణంగా చెబుతున్నారు. 

కొయ్యూరు: అటవీ ప్రాంతంలో ఉండాల్సిన గొరగేదెలు (బైసన్స్‌) గ్రామాల సమీపంలోకి వచ్చేస్తున్నాయి. దీంతో వాటిని చూసిన గిరిజనులు భయపడుతున్నారు. వేసవి కావడంతో దాహం తీర్చుకునేందుకు, చల్లదనం కోసం కాలువల వెంబడి ఉంటున్నాయి. గత ఐదేళ్లక్రితం వరకు ఒడిశాకు చెందిన వేటగాళ్లు వీటిని వేటాడేందుకు వచ్చేవారు. నెల రోజుల పాటు కాలువల వెంబడి కాసి నాటు తుపాకులతో వాటిని వేటాడి చంపేవారు.ఆ మాంసాన్ని ఎండిబెట్టి గ్రామాలకు తరలించేవారు. 2016 ఫిబ్రవరిలో ఎం.భీమవరం పంచాయతీ పుట్టకోట సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్లో  నాటు తుపాకులు కలిగి ఉన్న ఇద్దరు ఒడిశా గిరిజనులను మావోయిస్టులుగా అనుమానించి అప్పటిలో పోలీసులు కాల్చి చంపారు. అప్పటి నుంచి ఒడిశా వేటగాళ్లు రావడం తగ్గించేశారు. ఈ ప్రాంతంలో గతంలో రెండు పులులు ఉన్నట్టు అటవీశాఖ నిర్ధారించింది. తరువాత జరిగిన జంతు గణనలో వాటి జాడ తెలియలేదు. దీంతో గొరగేదెల సంఖ్య పెరిగి ఉంటుందని భావిస్తున్నారు. 

గొరగేదెలు ఎక్కువగా గూడెం,చింతపల్లి, కొయ్యూరు సరిహద్దు గ్రామాల్లో తిరుగుతుంటాయి. మర్రిపాకల రేంజ్‌లో ఫారెస్టు చాలా దట్టంగా  ఉంటుంది. దీంతో ఈ ప్రాంతంలో వీటి మంద ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలం, శీతాకాలంలో మేత, నీరు అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఇవి అటవీ ప్రాంతాన్ని వదిలి బయటకు రావు. వేసవి వచ్చేసరికి అటవీ ప్రాంతంలో చిన్న చిన్న ఊట కాలువలు ఎండిపోతాయి. వాటి చర్మం పలుచగా ఉన్నందున వేడిని తట్టుకోలేవు. అందువల్ల ఎక్కువగా ఇవి నీటిలోనే ఉండేందుకు ఇష్టపడతాయి. పెద్ద కాలువల వద్దనే ఉంటాయి.అక్కడే నీళ్లు తాగి తిరుగుతాయి. వేటగాళ్లు కూడా కాలువల వెంబడే ఉంటారు.అవి నీరు తాగుతున్న సమయంలో తుపాకీతో వేటాడుతారు. లేదంటే సంప్రదాయ ఆయుధాలతో చంపేందుకు ప్రయత్నిస్తారు. గాయపడిన గేదెలు కనిపించిన వారిని చంపేందుకు చూస్తాయి. ఇలాంటి సమయంలోనే వీటి నుంచి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.  

మందతో ప్రమాదం లేదు 
గొరగేదెలు మందలుగా  ఉన్నప్పుడు ఎవరిని ఏమీ అనవు. ఒంటరిగా ఉన్న గేదెలు మాత్రమే దాడులు చేసేందుకు చూస్తాయి. అవి దాడులు చేస్తే ప్రాణాలతో బయటపడడం కష్టంగానే ఉంటుంది.  ఒంటరిగా ఉన్న గేదె, గాయపడిన వాటితోనే ప్రమాదం ఉంటుందని గిరిజనులు తెలిపారు. పైడిపనుకుల, మంపకు అటువైపున ఉన్న కొండ, సూరేంద్రపాలెం ప్రాంతాల్లోకి వచ్చేస్తున్నాయి. గాయపడిన గేదె ఒకటి తిరుగుతుందని తెలుసుకున్న పరిసర ప్రాంతీయులు భయపడుతున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 
దట్టమైన అడవిలోనే గొరగేదెలుంటాయి. వాటిపై ఎలాంటి లెక్కలు లేవు. అంచనాగా చెప్పడం తప్ప అవి ఎన్ని ఉంటాయో గణన చేయలేదు. వేసవి కావడంతో అవి నీటి వనరులున్న ప్రాంతాలకు వస్తాయి.అవి  ఏయే ప్రాంతాల్లో తిరుగుతున్నాయో  అటవీ సిబ్బందిని పంపించి పరిశీలన చేయిస్తాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కువగా మర్రిపాకల రేంజ్‌లోనే ఉన్నట్టుగా సమాచారం ఉంది.  
– సూర్యనారాయణ పడాల్, నర్సీపట్నం డీఎఫ్‌వో 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement