Bike Ambulance: ఇక కష్టాలు దూరమండి.. కొండ కోనల్లో ఆపద్బాంధవి

Bike Ambulance Services In West Godavari Agency Area - Sakshi

బైక్‌ అంబులెన్స్‌ల విశేష సేవలు 

అత్యవసర వైద్యానికి భరోసా

8 వాహనాల ద్వారా సాయం

మరో ఏడు అంబులెన్స్‌లకు ప్రతిపాదనలు   

బుట్టాయగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): మారుమూల కొండకోనల్లోని ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీల అత్యవసర వైద్యానికి బైక్‌ అంబులెన్స్‌లు అపర సంజీవనిలా మారాయి. 108, 104 వాహనాలు వెళ్లలేని అటవీ ప్రాంతాలకు సులభంగా చేరుకుంటూ అడవిబిడ్డలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నాయి. దీంతో జోలికట్టి భుజాలపై మోసుకొచ్చే కష్టాలు గిరిజనులకు తప్పాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాలతో జిల్లాలో ఐటీడీఏ, వైద్యారోగ్యశాఖ అధికారులు ఎనిమిది బైక్‌ అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. 2019 నుంచి ఈ వాహనాల ద్వారా విశేష సేవలు అందుతున్నాయి. (చదవండి: యువతి ఆత్మహత్య కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌..

ఐదు మండలాల పరిధిలో.. 
కేఆర్‌పురం ఐటీడీఏ పరిధిలో బుట్టాయగూడెం, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు, జీలుగుమిల్లి మండలాలు ఉన్నాయి. వీటిలో 152 గ్రామాలు, 405 శివారు గ్రామాలు ఉండగా సుమారు 1,20,000 వరకూ గిరిజన జనాభా ఉంది. దాదాపు 40 గ్రామాలకు ఇప్పటికీ సరైన రహదారి సదుపాయం లేదు. భౌగోళిక స్వరూపం దృష్ట్యా బస్సులు, 108, 104 వాహనాలు ప్రయాణించలేని పరిస్థితి. ఆయా గ్రామాల్లో గిరిజనులు అనారోగ్యాలపాలైతే జోలి కట్టి మోసుకుంటూ ఆస్పత్రికి తీసుకువచ్చేవారు.

చదవండి: రైతన్నకు తోడుగా 'ఏపీ ఆగ్రోస్‌'

ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి
ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గిరిజనుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. మారుమూల ప్రాంతాల్లో సేవలందిచేలా రాష్ట్రవ్యాప్తంగా బైక్‌ అంబులెన్స్‌లను ఏర్పాటుచేశారు. జిల్లాలో 40 గ్రామాలకు సే వలందించేలా ఎనిమిది వాహనాలను సమకూర్చగా.. మరో ఏడు వాహనాల కోసం వైద్యారోగ్యశాఖ అధికారులు ఇటీవల ప్రతిపాదనలు చేశారు. ఇవి త్వరలో రానున్నాయని సమాచారం.

రెండేళ్లు.. 11,255 కేసులు  
రెండేళ్ల నుంచి జిల్లాలో బైక్‌ అంబులెన్స్‌ల ద్వారా 11,255 అత్యవసర కేసులకు సేవలు అందించారు. 2019–20లో గర్భిణులు 824, జ్వర పీడితులు 3,012, పాయిజన్‌ కేసులు 160, ఆర్‌టీఏ 118, ఇతర కేసులు 1,020 మొత్తం 5,134 కేసులకు బైక్‌ అంబులెన్స్‌ల ద్వారా సేవలందించారు. 2020–21, 2021–22లో ఇప్పటివరకూ గర్భిణులు 558, ఆర్‌టీఏ 99, జ్వరపీడితులు 4,059, పాయిజన్‌ కేసులు 149, ఇతర కేసులు 956 మొత్తంగా 6,121 మందికి సేవలు అందించారు.

ప్రయోజనాలు ఎన్నో..
పరిమాణం, పనితీరు కారణంగా బైక్ అంబులెన్స్‌లు గిరిజన ప్రాంతాల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులను కాపాడేందుకు సాధారణ అంబులెన్స్‌ కంటే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి.
దీని ద్వారా ఎక్కువ మంది ప్రాణాలను రక్షించగలుగుతున్నారు. గర్భిణులను వేగంగా ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
కుక్కునూరు మండలంలో అమరవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలంలో కొయిదా, తొట్కూరుగొమ్ము, పోలవరం మండలంలో కొరుటూరు, మేడేపల్లి, బుట్టాయగూడెం మండలంలో అలివేరు, చింతపల్లి తదితర గ్రామాల్లో బైక్‌ అంబులెన్స్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని సేవలు అందించేలా..   
గిరిజన గ్రామాల్లో ప్రతిఒక్కరికీ మెరుగైన వైద్యసేవలు అందించే దిశగా కృషి చేస్తున్నాం. మారుమూల కొండ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో వైద్యసేవలు అందించేందుకు ప్రస్తుతం ఎనిమిది బైక్‌ అంబులెన్స్‌లు వినియోగిస్తున్నాం. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో మరో ఏడు బైక్‌ అంబులెన్స్‌లకు ప్రతిపాదనలు పంపించాం. వీటి ద్వారా గిరిజనులకు మరిన్ని సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.   
– తెల్లం బాలరాజు, ఎమ్మెల్యే, పోలవరం

అత్యవసర వైద్యం 
బైక్‌ అంబులెన్స్‌లలో అత్యవసర వైద్యానికి సంబంధించిన మెడికల్‌ కిట్‌ను అందుబాటులో ఉంచాం. అలాగే చిన్నపాటి ఆక్సిజన్‌ సిలిండర్‌ కూడా ఉంటుంది. సెలైన్‌ పెట్టే సౌకర్యం కూడా అంబులెన్స్‌లో ఉంది. అనారోగ్యం పాలైన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాథమిక వైద్యం అందించడంతో పాటు మెరుగైన వైద్యం కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశాం. బైక్‌ అంబులెన్స్‌ సేవలు మరింత విస్తరిస్తాం. 
– జి.మురళీకృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, కేఆర్‌పురం    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top