కమీషన్ల ‘వైద్యం’! | Big Scam in Medical and Health Department: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కమీషన్ల ‘వైద్యం’!

May 2 2026 5:16 AM | Updated on May 2 2026 5:16 AM

Big Scam in Medical and Health Department: Andhra Pradesh

వైద్య ఆరోగ్యశాఖలో రూ.40 కోట్ల ప్రాజెక్టులో గోల్‌మాల్‌

ఏబీడీఎంలో అనుభవం తప్పనిసరి అని బిడ్‌లు దాఖలుకు ముందు షరతు

ప్రీ–బిడ్‌లో పోటీ లేకుండా కట్టడి చేసిన ప్రభుత్వ పెద్దలు

అస్మదీయ కంపెనీతో బిడ్‌ వేయించి అక్రమంగా ఆమోదం

ఎల్‌ 1 కాకుండా క్యూసీబీఎస్‌ విధానంలో ఆర్‌ఎఫ్‌పీ రూపకల్పన

ఇవాల్యూయేషన్‌లో ఎక్కువ మార్కులు వేసి ప్రాజెక్టు కట్టబెట్టేందుకు సిద్ధం

సాక్షి, అమరావతి: ఆరోగ్య శాఖలో రూ.40 కోట్ల విలువైన ‘వైద్యం’ ప్రాజెక్టును దొడ్డిదారిలో అస్మదీయ కంపెనీకి కట్టబెట్టడానికి ప్రభుత్వ పెద్దలు పన్నిన కుట్ర బట్టబయలైంది. ఇతర కంపెనీలు బిడ్‌లు వేయకుండా పోటీని నియంత్రించడమే కాకుండా అర్హత లేని కంపెనీకి బిడ్‌ను అడ్డదారిలో ఆమోదించడం గమనార్హం. వైద్యశాఖ పరిధిలోని వివిధ డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌ను ఒకే గొడుగు కిందకు తేవడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ (ఏబీడీఎం) అమలులో ప్రత్యక్ష అనుభవం తప్పనిసరి అని రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‌పీ)లో నిబంధన విధించారు.

అయితే ఈ నిబంధనకు బదులుగా ప్రభుత్వ రంగంలో ఈ–గవర్నెన్స్‌/ఆరోగ్య శాఖ ప్రాజెక్ట్‌లలో అనుభవాన్ని అర్హతగా పరిగణించాలని పలు కంపెనీలు ప్రీ బిడ్‌ సమావేశంలో ప్రభుత్వాన్ని కోరాయి. ప్రభుత్వ/ఆరోగ్య శాఖలో అనుభవానికి టెక్నికల్‌ ఇవాల్యుయేషన్‌లో 5 మార్కులు కేటాయించాలని విజ్ఞప్తి చేశాయి. ఇందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ప్రభుత్వం పేర్కొనడంతో పలు కంపెనీలు బిడ్‌లు వేయకుండా టెండర్‌కు దూరంగా ఉండిపోయాయి.

దొడ్డిదారిన ఆమోదం..
ఏబీడీఎం నిబంధనను సవరించబోమని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో కేవలం నాలుగు కంపెనీలు మాత్రమే బిడ్‌లు దాఖలు చేశాయి. ఉద్యోగుల ముఖ హాజరు(ఎఫ్‌ఆర్‌ఎస్‌) సేవలు అందిస్తున్న ఓ కంపెనీ ప్రభుత్వ పెద్దలకు పెద్ద మొత్తంలో కమీషన్లు చెల్లించేలా డీల్‌ కుదుర్చుకుని బిడ్‌ వేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కంపెనీకి ఏబీడీఎం అమ­లులో కనీస అనుభవం కూడా లేకున్నా అక్రమంగా బిడ్‌ను ఆమోదించేశారు. ఏబీడీఎం నిబంధనను మినహాయించాలని ప్రీ–­బిడ్‌ మీటింగ్‌లో పలు సంస్థలు కోరితే ఒప్పుకోకుండా అర్హత లేని కంపెనీ బిడ్‌ను ప్రభు­త్వం ఆమోదించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇక స్కోర్‌లు మేనేజ్‌..!
‘వైద్యం’ ప్రాజెక్టు కింద తమకు నచ్చిన కంపెనీకి నిధులు దోచిపెట్టేందుకు ఎల్‌–1 విధానంలో కాకుండా ‘క్యూసీబీఎస్‌’ విధానంలో టెండర్‌ పిలిచారు. ఇప్పటికే అస్మదీయ కంపెనీ బిడ్‌ను ప్రభుత్వ పెద్దలు ఆమోదించారు. టెక్నికల్‌ ప్రజంటేషన్‌లో అస్మదీయ కంపెనీకి ఎక్కువ స్కోర్‌ వేసి కాంట్రాక్ట్‌ కట్టబెట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌కు పరిపాలన అనుమతులు కూడా లేవని వైద్య శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏబీడీఎంలో కనీస అనుభవం లేని కంపెనీకి ప్రాజెక్టు దక్కేలా డీల్‌ కుదిర్చిన ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు టెండర్‌ ప్రక్రియలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement