తల్లికి వందనం నగదు ఇవ్వం | Bank manager ruthlessness towards on woman | Sakshi
Sakshi News home page

తల్లికి వందనం నగదు ఇవ్వం

Jun 21 2025 5:26 AM | Updated on Jun 21 2025 5:26 AM

Bank manager ruthlessness towards on woman

మహిళను బయటకు పంపేసిన బ్యాంక్‌ మేనేజర్‌ 

బ్యాంకు ఎదుట పిల్లలతో బోరుమన్న తల్లి  

నిలదీయడంతో రూ.7వేలు ఇచ్చి పంపేసిన వైనం  

కలువాయి(సైదాపురం): తల్లికి వందనం కింద జమయిన సొమ్మును డ్రా చేసుకునేందుకు వెళ్లిన మహిళను బ్యాంకు మేనేజర్‌ నిర్దాక్షిణ్యంగా నగదు ఇవ్వనంటూ బ్యాంకు సిబ్బంది ద్వారా బయటకు పంపేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరులో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కుల్లూరు ఎస్‌సీ కాలనీకి చెందిన నిప్పట్ల లక్ష్మికి నలుగురు సంతానం. వీరిలో ముగ్గురు పిల్లలు అంగన్‌వాడీకి పోతున్నారు. రెండో తరగతి చదువుతున్న కుమార్తెకు తల్లికి వందనం వర్తించింది.

ఈ మేరకు పథకం నగదు జమయిందంటూ  ఫోన్‌ సందేశం రావడంతో ఆనందించింది. డబ్బులను తీసుకునేందుకు ఆం«ధ్ర ప్రగతి బ్యాంకుకు వెళ్లింది. అయితే బ్యాంక్‌ మేనేజర్‌ వెంకట నారాయణ జోక్యం చేసుకుంటూ ‘‘మీ అత్త బ్యాంకు పొదుపు నగదు బాకీ ఉంది. నీకు తల్లికి వందనం డబ్బులు ఇవ్వను’’ అంటూ బ్యాంకు సిబ్బందితో ఆమెను బయటకు పంపేశారు. దీంతో లక్ష్మి బ్యాంకు ఎదుట బోరుమంది. అక్కడే ఉన్న కొందరు ఈ విషయమై బ్యాంకు మేనేజర్‌ను గట్టిగా ప్రశ్నించారు. దీంతో చివరికి లక్ష్మికి రూ.7వేలు ఇచ్చి పంపేశాడు.  

లక్ష్మి అత్త లోను కట్టలేదని రికవరీ చేశాం: బ్యాంక్‌ మేనేజర్‌  లక్ష్మి అత్త మరియమ్మ బ్యాంక్‌ ద్వారా స్వర్ణ హంస గ్రూప్‌ నుంచి రుణం తీసుకుని కట్టడం మానేసిందని బ్యాంక్‌ మేనేజర్‌ వెంకటనారాయణ తెలిపారు. మరియమ్మ కోడలు కాబట్టి లక్ష్మి నగదును రికవరీ చేశామన్నారు. తల్లికి వందనం నగదు నుంచి లక్ష్మికి రూ.7వేలు ఇచ్చామని, మిగతా నగదు  పొదుపు సంఘం రుణానికి జమ చేస్తామని మేనేజర్‌ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement