ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణం: అది సామాజిక ఆర్థిక నేరం

APSSDC Scam:It Is a Socio Economic Crime AP High Court - Sakshi

ఆర్థిక నేరాల్లో దర్యాప్తు దశలో ముందస్తు బెయిల్‌ తగదు

పిటిషనర్‌ మూడు షెల్‌ కంపెనీలను కొన్నారు

ఈ విషయాన్ని ఆయన భార్య కూడా నిర్ధారించారు

ఢిల్లీ చార్టెడ్‌ అకౌంటెంట్‌ విపిన్‌ శర్మకు ముందస్తు బెయిల్‌ నిరాకరణ

హైకోర్టు

సాక్షి, అమరావతి: ఆర్థిక నేరాల్లో ముందస్తు బెయిల్‌ ఇస్తే అది దర్యాప్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు దశలో ముందస్తు బెయిల్‌ మంజూరు వల్ల నిందితులను విచారించడం, కీలక ఆధారాల సేకరణ వంటి విషయాల్లో దర్యాప్తు సంస్థను నిరాశపరచడమే అవుతుందని చిదంబరం కేసులో సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందని గుర్తు చేసింది. ఏపీ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)లో జరిగిన రూ.371 కోట్ల కుంభకోణం సామాజిక–ఆర్థిక నేరమని తెలిపింది. ఈ కేసుకున్న తీవ్రత దృష్ట్యా ఢిల్లీకి చెందిన చార్టెడ్‌ అకౌంటెంట్, ఈ కుంభకోణంలో నిందితుడైన విపిన్‌ శర్మ ముందస్తు బెయిల్‌కు అర్హుడు కాదని తేల్చిచెప్పింది. ముందస్తు బెయిల్‌ కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి మంగళవారం తీర్పు వెలువరించారు.

ఇదీ కుంభకోణం..
2014–19 మధ్య కాలంలో చంద్రబాబు సీఎంగా ఉండగా రాష్ట్రంలో 40 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ఏర్పాటుకు సీమెన్స్, డిజైన్‌ టెక్‌ సంస్థలతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థలు 90 శాతం నిధులు, ప్రభుత్వం 10 శాతం సమకూర్చాలి. ఇందులో ప్రభుత్వం తన వాటా రూ.371 కోట్లను సీమెన్స్, డిజైన్‌ టెక్‌ సంస్థలకు ఇచ్చేసింది. ఆ తరువాత హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ సరఫరా పేరుతో నిధులను కొల్లగొట్టేందుకు పలు షెల్‌ కంపెనీలను సృష్టించారు. వాటిద్వారా రూ.వందల కోట్లను దారి మళ్లించారు. దీనిపై ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు గత ఏడాది డిసెంబర్‌ 9న కేసు నమోదు చేశారు. విపిన్‌ శర్మతోపాటు పలువురు అధికారులు, కంపెనీల ప్రతినిధులను నిందితులుగా చేర్చారు.

పిటిషనర్‌ది న్యాయపూరిత కుట్ర: సీఐడీ
ఈ కేసులో తనను అరెస్ట్‌ చేయకుండా ముందస్తు బెయిల్‌ కోరుతూ విపిన్‌ శర్మ దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి విచారణ జరిపారు. శర్మ తరఫు న్యాయవాది ఏసీఎస్‌ బోస్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ చార్టెడ్‌ అకౌంటెంట్‌ అని, పలువురు క్లయింట్లకు సేవలందిస్తుంటారని తెలిపారు. ఈ కుంభకోణంతో పిటిషనర్‌కు సంబంధం లేదన్నారు. సీఐడీ తరఫు న్యాయవాది టీఎంకే చైతన్య వాదనలు వినిపిస్తూ, పిటిషనర్‌ నియంత్రణలో ఉన్న కొన్ని షెల్‌ కంపెనీల ద్వారా తప్పుడు ఇన్వాయిస్‌లు ఇచ్చారని తెలిపారు. ఈ షెల్‌ కంపెనీల ద్వారా సులభంగా డబ్బు సంపాదించడమే పిటిషనర్‌ లక్ష్యమన్నారు. వాటి ద్వారా రూ.8.5 కోట్లు పొంది, వాటిని తిరిగి వివిధ కంపెనీలకు మళ్లించారని తెలిపారు.

మిగిలిన నిందితులతో కలిసి పిటిషనర్‌ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారన్నారు. ఈ కుంభకోణంలో కీలక విషయాలు ఆయనకు తెలుసునని, అందువల్ల ఆయన్ని కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని వివరించారు. సీఐడీ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. పిటిషనర్‌ మూడు షెల్‌ కంపెనీలను కొన్నారని, ఈ విషయాన్ని ఆయన భార్య కూడా నిర్ధారించారని న్యాయమూర్తి తెలిపారు. రెండు కంపెనీల్లో ఆమె కూడా డైరెక్టర్‌గా ఉన్నారని చెప్పారు. వాస్తవానికి పిటిషనర్‌ దర్యాప్తు అధికారి ముందు విచారణకు హాజరు కావాల్సి ఉన్నా, హాజరు కాలేదన్నారు. కేసు తీవ్రత దృష్ట్యా పిటిషనర్‌ ముందస్తు బెయిల్‌కు అర్హుడు కాదని తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top