విజయవాడ: తమ డిమాండ్లపై అధికారులతో ఆర్టీసీ జేఏసీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. నగరంలోని ఆర్టీసీ హౌస్‌లో ఈరోజు(బుధవారం, జూలై 8వ తేదీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) లతో జేఏసీ నేతలు చర్చించారు. ఎలక్ట్రిక్ బస్సుల కోసం మూసేసిన విద్యాధరపురం, గుంటూరు 2, నెల్లూరు-2 మంగళం డిపోలను తక్షణమే పునః ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ ద్వారానే కొని నిర్వహించాలన్నారు. విద్యుత్ బస్సుల పేరుతో ఒక్క డిపోను కూడా ఖాళీ చేయకూడదనే డిమాండ్ వినిపించారు. ప్రస్తుతం ఉన్న బస్సులు , సిబ్బందిని బదిలీలు చేయకూడదని, భవిష్యత్ లో పిలవబోయే 1450 ఎలక్ట్రికల్ బస్సుల టెండర్లు రద్దు చేయాలని చర్చల్లో జేఏసీ నేతలు కోరారు. 11 డిమాండ్లను పరిష్కరించే దిశగా ఉంటేనే చర్చలకు పెట్టాలని జేఏసీ నేతలు తేల్చిచెప్పారు. దీనిపై ఎటువంటి స్పష్టత లేకపోవడంతో మరోసారి జరిగిన చర్చలు సైతం అసంతృప్తిగానే ముగిశాయి.
దాంతో రేపట్నుంచి ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు ఇవ్వడానికి ఆర్టీసీ జేఏసీ సిద్ధమైంది. దీనిలో భాగంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను జేఏసీ నేతలు కలవనున్నారు. మొన్న(సోమవారం, జూలై 6వ తేదీన) అధికారులతో ఆధికారులతో జేఏసీ నేతలు జరిపిన చర్చలు అసంతృప్తిగా ముగియగా, మరొకసారి జేఏసీకి ఎటువంటి స్పష్టమైన హామీ రాలేదు.


