ప్రత్యామ్నాయ మార్గాల్లో విద్యుత్‌ బిల్లులు చెల్లించండి

APCPDCL Says Pay electricity bills in alternative ways - Sakshi

వినియోగదారులకు ఏపీసీపీడీసీఎల్‌ విజ్ఞప్తి 

సాక్షి, అమరావతి: స్మార్ట్‌ ఫోన్‌తో క్షణాల్లో నెలవారీ విద్యుత్‌ బిల్లులు చెల్లించే వెసులుబాటు కల్పించిన ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్‌)లో ఆ సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో ‘‘ఏపీసీపీడీసీఎల్‌ కన్జ్యూమర్‌ మొబైల్‌ యాప్, పేటీయం, టీఏ వాలెట్, ఏపీ ఆన్‌లైన్‌’’ ద్వారా విద్యుత్‌ బిల్లులు చెల్లించాలని వినియోగదారులకు ఏపీసీపీడీసీఎల్‌ విజ్ఞప్తి చేసింది. కాగా, యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్ఫేస్‌ (యూపీఐ) ద్వారా విద్యుత్‌ బిల్లులను కట్టించుకుని డిస్కంకు అందజేసే ‘బిల్‌ డెస్క్‌’ కంపెనీ ఇచ్చిన బ్యాంక్‌ గ్యారంటీ (బీజీ) గడువు తీరిపోవడంతో మరలా కొత్త బీజీ ఇవ్వాల్సిందిగా సెంట్రల్‌ డిస్కం కోరింది.

బిల్‌ డెస్క్‌ నుంచి బీజీ అందడంలో జాప్యం కారణంగా బిల్లులు వసూలు చేసేందుకు ఆ కంపెనీకి డిస్కం అనుమతినివ్వలేదు. దీంతో కొద్ది రోజులుగా పలు యూపీఐ యాప్‌ల ద్వారా బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని పలువురు ‘సాక్షి’ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై డిస్కం సీఎండీ జె.పద్మాజనార్ధనరెడ్డిని వివరణ కోరగా..బిల్లుల చెల్లింపుల్లో సమస్య తలెత్తిన మాట వాస్తవమేనని, దీనివల్ల ఈ నెల తమకు రావాల్సిన ఆదాయంలో 60% ఆగిపోయిందని చెప్పారు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top