
ఏడాదిన్నరగా రూ.2,500 కోట్లకు పైగా బకాయిలు
ప్రభుత్వం చెల్లించకపోవడంతో నెట్‌వర్క్ ఆస్పత్రుల సమ్మెబాట.. సోమవారం నుంచి ఉచిత ఓపీ నిలిపివేత
ఆరోగ్యశ్రీ సీఈవోకి లేఖరాసిన ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్
అనధికారికంగా కొన్ని నెలలుగా ఐపీ సేవలు ఆపేసిన వైనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మళ్లీ ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వ వైఖరితో విసిగిపోయిన నెట్‌వర్క్ ఆస్పత్రులు మరోసారి సమ్మెబాట పట్టాయి. బకాయిలు చెల్లించమని ఎన్నిసార్లు ప్రాధేయపడినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సోమవారం నుంచి ఆరోగ్యశ్రీ కింద ఉచిత ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలను నిలిపేశాయి. సేవల్ని నిలిపేసినట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశ).. ఆరోగ్యశ్రీ సీఈవో దినేష్‌కుమార్‌కు లేఖ రాసింది. ప్రభుత్వం రూ.వేలకోట్ల బకాయిలు పెట్టడంతో ఆస్పత్రుల నిర్వహణ కూడా కష్టంగా మారిందని, ఈ పరిస్థితుల్లో ఉచిత ఓపీ, ఇన్వెస్టిగేషన్ సేవలను అందించలేమని ఆ లేఖలో స్పష్టం చేశారు.
రూ.2,500 కోట్లకు పైగా బకాయిల విడుదల కోసం ఒకటిన్నర సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నామని తెలిపారు. తీవ్రమైన ఆcక సంక్షోభంలో ఉన్నప్పటికీ నిధులు విడుదలవుతాయనే ఆశతో సేవలు నెట్టుకొచ్చామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి వివిధ స్థాయిల్లో విజ్ఞప్తులు చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సోమవారం నుంచే ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఉచిత ఓపీ సేవలను ఆపేసినట్లు తెలిపారు.
పదే పదే సమ్మెబాట
చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో నెట్‌వర్క్ ఆస్పత్రులు పదేపదే సమ్మెబాట పడుతున్నాయి. ఆరోగ్యశ్రీని నిర్థిర్యం చేసి బీమా విధానం ప్రవేశపెట్టడం కోసం ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపులు, పథకం అమలుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో గతేడాదిలో ఒకసారి, ఈ ఏడాదిలో ఇప్పటికే రెండుసార్లు ఆస్పత్రులు సమ్మెలోకి వెళ్లాయి. ఏప్రిల్ నెలలో సమ్మెలోకి వెళ్లిన సమయంలో సీఎం చంద్రబాబు ఆస్పత్రుల యాజమాన్యాలతో భేటీ అయి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయినా బకాయిలు క్లియర్ అవ్వలేదు.
దీంతో ఈ ఏడాదిలో మూడోసారి ఆస్పత్రులు సమ్మెబాట పట్టాయి. వాస్తవానికి గతేడాది నుంచే చాలా ఆస్పత్రులు అనధికారికంగా ఐపీ సేవలను కూడా ఆపేశాయి. పేద, మధ్యతరగతి ప్రజలు ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్సల కోసం వెళితే ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని, దీంతో ఉచిత సేవలు అందించబోమని చెప్పేస్తున్నాయి. రూ.200 కోట్లకుపైగా బిల్లులు నిలిచిపోవడంతో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్)ను నెట్‌వర్క్ ఆస్పత్రులు పూర్తిగా ఆపేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ క్రమంలో అనారోగ్యం బారినపడిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబసభ్యులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అప్పులు చేసి చికిత్స చేయించుకుంటే, మెడికల్ రీయింబర్స్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని గగ్గోలు పెడుతున్నారు.