ఊరూరూ వెళ్తుంది.. వ్యవసాయ పాఠాలు చెబుతుంది

AP Govt has come up with a new idea to provide technical assistance to Farmers - Sakshi

అన్నదాతలకు సలహాలందించేందుకు సిద్ధమైన అగ్రికల్చర్‌ నాలెడ్జ్‌ ఆన్‌ వీల్స్‌ 

సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాట్లు.. వర్చువల్‌ అవగాహన కల్పించే సాఫ్ట్‌వేర్‌

సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు

సాక్షి, విశాఖపట్నం: అన్నదాతలకు సాంకేతిక సాయం చేసేందుకు ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. పెట్టుబడులు పెరిగి.. దిగుబడులు తగ్గి డీలాపడుతున్న రైతులకు సాగు ఖర్చుల్ని తగ్గించే ఆధునిక విధానాలపై అవగాహన కల్పించేందుకు నడిచే వ్యవసాయ గ్రంథాలయంలా రహదారులపైకి వచ్చింది ‘అగ్రికల్చర్‌ నాలెడ్జ్‌ ఆన్‌ వీల్స్‌’. తక్కువ ఖర్చుతో.. లాభాలు పండించే సేంద్రియ సేద్యంపై సలహాలు అందించేందుకూ సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీ ఎస్‌ఎస్‌డీపీ) ఆధ్వర్యంలో ఈ సాంకేతిక వాహనాన్ని సిద్ధం చేశారు. ఫ్రెంచ్‌ దేశానికి చెందిన డసాల్ట్‌ సిస్టమ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ సంస్థ సహకారంతో ఈ వాహనం పల్లెల్లో పరుగులు పెట్టనుంది. ఇందులో అత్యాధునిక సాంకేతికతను అమర్చారు. రైతులకు సలహాలు అందించేందుకు ఒక ట్రైనర్, టెక్నికల్‌ సపోర్ట్‌ పర్సన్‌ ఉంటారు. రైతులకు సులభంగా అర్థమయ్యే రీతిలో వారి సందేహాల్ని నివృత్తి చేసేందుకు వర్చువల్‌ టెక్నాలజీని వినియోగించారు. త్రీడీ విజువల్స్‌ చూపిస్తూ.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పండించే పంటలకు సంబంధించిన సమగ్ర సమాచార వీడియోలను ఇందులో నిక్షిప్తం చేశారు.

ఎలాంటి సందేహాలైనా నివృత్తి చేసేలా..
ఈ వాహనంలో వ్యవసాయానికి సంబంధించిన ఎలాంటి సందేహాలనైనా నివృత్తి చేసుకోవచ్చు. ఏదైనా పంటను ఏ నేలలో నాటాలి.. ఏయే నేలల్లో ఏ పంటలు ఎలా పెరుగుతాయి.. ఏ మొక్కల్ని ఎంత లోతులో నాటాలి.,  ఏఏ ఎరువులు, ఎంత మోతాదులో వాడాలి.. ఎక్కువ ఎరువులు వేస్తే వచ్చే నష్టాలు.. మొక్కకి మొక్కకి ఎంత దూరం ఉండాలి.. ఎంత దూరంలో నాటితే.. ఎంత దిగుబడి వస్తుంది.. ఇలా ప్రతి ఒక్క సందేహానికీ ఈ వాహనంలో సమాధానం దొరుకుతుంది. అది కూడా డిజిటల్‌ వర్చువల్‌ సిస్టమ్‌తో పాటు త్రీడీ విజువల్స్‌తో రైతులకు అవగాహన కల్పిస్తారు. దీంతోపాటు నీటి పరీక్షలు, భూసార పరీక్షలు చేసే సౌకర్యం కూడా ఇందులో ఉంది. అంతేకాకుండా తక్కువ ఖర్చుతో సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ఎలా అనుసరించాలనే విషయాల్ని ఈ వాహనం ద్వారా సమగ్రంగా రైతులకు వివరించనున్నారు. సేంద్రియ ఎరువుల్ని ఎలా తయారు చేసుకోవాలి, పంటలు ఎలా పండించాలనే విషయాలపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తారు.

13 జిల్లాల్లోని రైతుల వద్దకు..
సెంచూరియన్‌ యూనివర్సిటీ భాగస్వామ్యంతో దీన్ని రూపొందించాం. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అనుసరించడంపై రైతులకు, వ్యవసాయ విద్యార్థులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ వాహనాన్ని ప్రభుత్వం రూపొందించింది. కాలానుగుణంగా వ్యవసాయంలో వచ్చే మార్పులను, కొత్త విధానాలను తెలుసుకోవచ్చు. 13 జిల్లాల్లోని అన్ని ప్రాంతాలకు ఈ బస్సును పంపిస్తాం. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతు చెంతకు తీసుకెళ్లడంతోపాటు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించడం, శిక్షణ అందించడమే ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యం.
– చల్లా మధుసూదనరెడ్డి, ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top