మరింత పారదర్శకత..  జవాబుదారీతనం

AP Govt has brought more features in YSR APP - Sakshi

వైఎస్సార్‌ యాప్‌లో మరిన్ని ఫీచర్లు

ప్రతి సేవను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిందే

మరింత సమర్థంగా ఆర్బీకేలు

సాక్షి, అమరావతి: సాగు సేవలన్నీ రైతు ముంగిటకు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ రైతుభరోసా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) అందుతున్న సేవల్లో మరింత పారదర్శకతను, సిబ్బందిలో మరింత జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన వైఎస్సార్‌ యాప్‌లో మరిన్ని ఫీచర్లు తీసుకొచ్చింది. రాష్ట్రంలోని 660 మండలాల్లో 10,641 ఆర్‌బీకేలున్నాయి. వీటికి అనుసంధానంగా 65 హబ్‌లు, 13 జిల్లా రిసోర్స్‌ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఆర్‌బీకేల కోసం ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ కూడా ఏర్పాటు చేశారు. గతేడాది మే 30 నుంచి అందుబాటులోకి వచ్చిన ఆర్‌బీకేల ద్వారా వ్యవసాయ, ఉద్యాన, పట్టు, మత్స్య, పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్‌లు సేవలందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7,850 విత్తన, 12 వేల ఎరువులు, 1.21 లక్షల పురుగుల మందుల డీలర్‌షాపులను ఈ కేంద్రాలకు అనుసంధానించారు. 

వైఎస్సార్‌ యాప్‌లో సమగ్ర వివరాలు 
విత్తనం నుంచి విక్రయం వరకు ప్రతిదీ నమోదు, రియల్‌ టైం ఫలితాలు రాబట్టడం వైఎస్సార్‌ యాప్‌ ముఖ్య ఉద్దేశం. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల వివరాలను ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ద్వారా సిబ్బంది తాము పనిచేసే ఆర్‌బీకే వివరాలను రిజిస్టర్‌ చేసిన తర్వాత అసెట్‌ ట్రాకర్‌లో ఆర్‌బీకే భవనం, ఆస్తులు, ఆధునిక సాంకేతిక పరికరాలు, ఇతర సామగ్రి వివరాలను డిజిటల్‌ స్టాక్‌ రిజిస్టరులో నమోదు చేయాలి. పరికరాల వినియోగంలో సమస్యలు ఎదురైతే తక్షణం పరిష్కరించేలా ఏర్పాటు చేశారు. ఈ క్రాప్‌ కింద నమోదు చేసిన పంటల వివరాలు, డాక్టర్‌ వైఎస్సార్‌ పొలంబడి, పంట కోత ప్రయోగాలు, క్షేత్రస్థాయి ప్రదర్శనలు, విత్తన ఉత్పత్తి క్షేత్రాల సందర్శన, భూసార పరీక్షల కోసం మట్టి నమూనాల సేకరణ, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం, సేంద్రియ ఉత్పత్తుల కోసం రైతులను సిద్ధం చేయడం, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ వంటి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఈ యాప్‌లో నమోదు చేస్తారు. సేవల్లో పారదర్శకత, సిబ్బందిలో జవాబుదారీతనాన్ని తీసుకురావాలన్న సంకల్పంతో ఈ యాప్‌లో మరిన్ని ఫీచర్లు జోడిస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ చెప్పారు. 

జవాబుదారీతనం కోసం జియోఫెన్స్‌
ఈ యాప్‌లో కొత్తగా తీసుకొచ్చిన జియోఫెన్స్‌ ద్వారా సిబ్బందిలో జవాబుదారీతనం తీసుకురానున్నారు. ప్రతిరోజు ఆర్‌బీకేకి ఐదు కిలోమీటర్ల పరిధిలో రైతులకు అందించిన సాగుసేవలు, అమలు చేసిన కార్యక్రమాలపై సమగ్ర విశ్లేషణ, చిత్రాలు అప్‌లోడ్‌ చేయాలి. ఇలా చేయడం ద్వారా ఆర్‌బీకే పనితీరుపై అంచనా వేసి గ్రేడింగ్‌ ఇస్తారు. తద్వారా ప్రతి విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ పనితీరుకు రాష్ట్రస్థాయిలో స్కోరింగ్‌ ఇస్తారు. ఆర్‌బీకేల్లో సేవలు, సిబ్బంది పనితీరుపై ‘చాలా బాగుంది, బాగుంది, ఫర్వాలేదు, బాగాలేదు’ అనే నాలుగంశాలపై ఎప్పటికప్పుడు ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటారు. పంట ఆరోగ్యం, ఉత్పాదకాల లభ్యత, రైతులకు శిక్షణ ఇతర అవసరాల కోసం కూడా అభిప్రాయాలు సేకరిస్తారు. తదనుగుణంగా సేవలను మరింత మెరుగుపర్చే దిశగా చర్యలు చేపడతారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top