దొనకొండలో సోలార్‌ 'వెలుగులు'

AP Govt All set for thousand watt mega plant - Sakshi

1,000 మెగా వాట్ల ప్లాంట్‌ ఏర్పాటుకు రంగం సిద్ధం 

దాదాపు 10,000 మందికి ఉపాధి

దొనకొండ: రైతులకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు ప్రకాశం జిల్లా దొనకొండలో 1,000 మెగా వాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రెవెన్యూ సిబ్బంది సుమారు 5,000 ఎకరాల భూమిని సర్వేచేసి నివేదిక తయారుచేశారు. మండలంలోని రుద్రసముద్రం, భూమనపల్లి, మంగినపూడి ప్రాంతాల్లోని పలు సర్వే నంబర్లకు సంబంధించిన భూమిని గుర్తించారు. రూ.4,000 కోట్లతో ఈ ప్రాజెక్టు ఏడాదిలోనే పూర్తి చేసి మరో ఏడాది నాటికి విద్యుదుత్పత్తి చేయనున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్టు పూర్తయితే 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. 

నేరుగా రైతుల అకౌంట్లలోకి నగదు
సోలార్‌ ప్రాజెక్టుకు అవసరమైన 5,000 ఎకరాల ప్రభుత్వ భూమి మొత్తం ఒకే చోట లేనందున ప్రభుత్వం రైతుల నుంచి 2,000 ఎకరాల దాకా లీజుకు తీసుకోవాల్సి ఉంది. అలా 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకుని ఎకరాకు రూ.25,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. అలాగే రెండేళ్లకోసారి ఐదు శాతం అధికంగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో కలెక్టర్‌ పోల భాస్కర్‌తో కలసి నెట్‌ క్యాప్‌ బృందం ఈ భూములను పరిశీలించింది.

నివేదిక తయారు చేశాం..  
సర్వేయర్లు, వీఆర్వోలు రుద్రసముద్రం, భూమనపల్లి, మంగినపూడి గ్రామాల్లోని పొలాలను సర్వే చేసి ప్రభుత్వ, అసైన్‌మెంట్, పట్టా భూములను గుర్తించారు. నివేదిక పూర్తి చేశాం. ప్రభుత్వం అడిగిన వెంటనే అందజేసేందుకు రెవెన్యూ శాఖ సిద్ధంగా ఉంది.  
– తహసీల్దార్‌ కాలే వెంకటేశ్వరరావు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top