రాష్ట్రంలో డ్రోన్ సర్వీసులపై సేవా రుసుము
2.50 శాతం నుంచి 5 శాతం వరకు విధింపు
డ్రోన్ సర్వీసులకు నోడల్ ఏజెన్సీగా ఏపీ డ్రోన్ కార్పొరేషన్
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని డ్రోన్ సేవలపై సేవా రుసుములను విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ఏపీ డ్రోన్ కార్పొరేషన్(ఏపీడీసీ)ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. వివిధ సేవలకు సర్వీసు చార్జీలను 2.5 శాతం నుంచి 5 శాతంగా నిర్ధారించారు. రూ.50 లక్షలలోపు డ్రోన్ సేవలపై 5 శాతం, రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకు 3.75 శాతం, ఆ పైన మొత్తానికి 2.50 శాతం సర్వీసు చార్జీగా నిర్ణయించారు.
ఇక నుంచి రాష్ట్రంలో అందించే ప్రతీ డ్రోన్‌సేవలు ఏరియల్ సర్వే, మ్యాపింగ్, లాజిస్టిక్స్, వ్యవసాయ అనుబంధ సేవలు, మౌలిక వసతుల నిర్వహణ, విపత్తుల నిర్వహణ, పరిశోధన, ప్రజాసేవతో పాటు డ్రోన్ పైలెట్ శిక్షణ వరకు అన్ని సేవలను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుందని రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు గురువారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వివిధ ప్రభుత్వ విభాగాలు వినియోగించుకునే డ్రోన్ సేవలను ఏపీడీసీ ద్వారానే తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సంబంధిత డిపార్ట్‌మెంట్లు, ఏజెన్సీల నుంచి ముందస్తు రుసుములు తీసుకోవడానికి ఏపీడీసీకి అనుమతించారు.


