మనది టీం వర్క్‌: సీఎం జగన్‌

AP CM YS Jagan Review with officials on Government schemes Execution - Sakshi

వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సమావేశంలో సీఎం జగన్‌

మీ అందరి సహకారంతో ముందుకు విప్లవాత్మకమైన నిర్ణయాలు, మార్పులు 

సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ నుంచి ‘దిశ’వరకూ ఎన్నో ఉన్నాయి

అనవసర వ్యయాన్ని నియంత్రించాం

విద్యుత్‌ కొనుగోళ్లలో డబ్బు ఆదా 

కేంద్రం కూడా దీన్ని ప్రశంసించింది

జ్యుడీషియల్‌ ప్రివ్యూ ద్వారా టెండర్లలో అవినీతిని రూపుమాపాం

అవినీతికి ఆస్కారం లేకుండా రూ.90 వేల కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశాం

మూడో వంతు సమయం గడిచింది.. ఇప్పుడు రిలాక్స్‌ కావాలనుకోవద్దు

శాఖల మధ్య సమన్వయం పెరగాలి.. 

గ్రామ సచివాలయాల నుంచి అందే వినతులపై వెంటనే స్పందించాలి

ఇలాంటి సమావేశం నిర్వహించినందుకు సీఎస్‌కు అభినందనలు 

సాక్షి, అమరావతి: ‘క్రికెట్‌లో కెప్టెన్‌ ఒక్కడి వల్లే గెలుపు సాధ్యం కాదు. మొత్తం టీమ్‌ సమష్టిగా కృషి చేస్తేనే విజయం సాధ్యం. నాకు మీలాంటి టీమ్‌ ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గత 20 నెలలుగా మీతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది’అని వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులనుద్దేశించి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు, వివిధ కార్యక్రమాల అమలుకు సంబంధించి బుధవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. ఇప్పటి వరకు చేసిన పనులు, చేరుకోవాల్సిన లక్ష్యాలపై అధికార యంత్రాంగానికి మార్గ నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు అజేయ కల్లం, నీలం సాహ్ని, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం ప్రసంగంలో ముఖ్యాంశాలివీ..

రిలాక్స్‌ అయితే వెనకబడతాం
పరిపాలనలో 20 నెలలు.. అంటే దాదాపు మూడో వంతు సమయం గడిచిపోయింది. క్రికెట్‌లో మాదిరిగా ఇప్పుడు మిడిల్‌ ఓవర్ల కాలం వచ్చింది. సహజంగా ఈ సమయంలో బ్రేక్‌ తీసుకోవాలనుకుంటారు. ఇప్పుడు రిలాక్స్‌ అయితే వెనుకబడిపోతాం. మనం మళ్లీ దృష్టిని కేంద్రీకరించుకోవాలి. శాఖల మధ్య సమన్వయం పెంచుకోవాలి. చేసిన పనులను సమీక్షించుకోవాలి. లోపాలను సవరించుకోవాలి. లక్ష్య సాధన కోసం కలసి కట్టుగా పనిచేయాలి. అప్పుడే మరింత ముందుకు వెళ్లగలుగుతాం.

మన సమర్థతకు నిదర్శనం..
నిజం చెప్పాలంటే... అలాంటి ఆలోచనలు (వివిధ కార్యక్రమాలు, పథకాలను ప్రస్తావిస్తూ) చేయడమే ఒక మహత్తర పని. ఎందుకంటే ఏనాడూ, ఎక్కడా అలాంటి ఆలోచన ఎవరూ చేయలేదు. కానీ మన రాష్ట్రంలో కేవలం 20 నెలల వ్యవధిలోనే అన్నింటినీ సాకారం చేసి చూపాం. అది ఈ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది. అది మన అధికారుల సమర్థత, అంకితభావానికి ప్రతీకగా నిలుస్తోంది. అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో, గట్టి సంకల్పంతో చేసి చూపించింది.

ఉగాది రోజు వలంటీర్లకు సత్కారం
ఏటా ఉగాది పర్వదినం రోజు వలంటీర్లకు సత్కారం, అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తే వారికి ఎంతో ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలులో అవినీతి, వివక్ష, ఆశ్రిత పక్షపాతానికి పూర్తిగా ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లు అవుతుంది. వలంటీర్లు మహోన్నత సేవలందిస్తున్నారన్న భావన అందరిలో కలిగించినట్లు అవుతుంది. సచివాలయాలు, వలంటీర్ల మధ్య పూర్తి సమన్వయం ఉంటే ప్రభుత్వ పథకాలు మరింత వేగంగా, సమర్థంగా ప్రజలకు అందుతాయి.

సమష్టి కృషితోనే సాధ్యం..
మీలో ప్రతి ఒక్కరూ ఎంతో నిష్ణాతులు, సమర్థులు. సమష్టి కృషి వల్లే రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తేగలిగాం. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ నుంచి దిశ చట్టం దాకా చెప్పుకుంటూ పోతే జాబితాలో ఎన్నో ఉన్నాయి. విద్యుత్‌ కొనుగోళ్లలో వ్యయ నియంత్రణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్రం కూడా ప్రశంసించింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలు ఈ రంగంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయి. అవి మిగిలిన రాష్ట్రాల దృష్టిని కూడా ఆకర్షించాయి. 

పాలనలో నిబద్ధతకు ప్రతిరూపం..
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, మార్పులు అంతటితోనే ఆగిపోలేదు. కాంట్రాక్టు పనుల్లో అవినీతి నిర్మూలన కోసం టెండర్ల జ్యుడీషియల్‌ ప్రివ్యూ చేపట్టాం. రివర్స్‌ టెండరింగ్‌ విధానం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ పాలనలో నిబద్ధతకు ప్రతిరూపంలా నిల్చింది. ఇంగ్లిష్‌ మీడియంలో బోధన, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్స్, గ్రామ, వార్డు సచివాలయాలు, గత వందేళ్లలో ఏనాడు జరగని భూముల సమగ్ర రీసర్వే లాంటి కార్యక్రమాలను చేపట్టాం. 
సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ను అభినందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

నేరుగా నగదు బదిలీ..
వీటన్నింటికి మించి వివిధ పథకాల లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ (డీబీటీ) విధానం తెచ్చాం. దళారీలు, అవినీతికి ఎక్కడా తావులేకుండా కంప్యూటర్‌లో బటన్‌ నొక్కడం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నాం. ఆ విధంగా దాదాపు రూ.90 వేల కోట్లు ఇచ్చాం. వివక్ష, అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో ఆ మొత్తం జమ చేశాం.

దేశంలో ఎక్కడా లేని విధంగా..
నాడు–నేడుతో విద్య వైద్య రంగాలలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాం. 30.92 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టాం. రాష్ట్ర చరిత్రలో.. బహుశా దేశ చరిత్రలోనే ఐదేళ్లలో ఈ స్థాయిలో ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఎన్నడూ జరిగి ఉండకపోవచ్చు. కేవలం ఇళ్ల స్థలాల పంపిణీ మాత్రమే కాకుండా గృహ నిర్మాణాలను ప్రారంభించాం. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) పథకాన్ని మన రాష్ట్రం సమర్థవంతంగా వినియోగించుకుంటోంది. 

చెప్పిన ప్రతి మాటకు కట్టుబడ్డాం..
ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్ట పాలు చేసిన ఎందరో నాయకులను నేను చూశా. వందల హామీలతో, వందల పేజీలతో రూపొందించి ఎన్నికల తర్వాత వాటిని పట్టించుకునే వారే కాదు. మేనిఫెస్టోను కనీసం మళ్లీ చూసేవారు కూడా కాదు. అలాంటి పరిస్థితుల్లో మేం నవరత్నాలతో మేనిఫెస్టోను తెచ్చాం. చదవడానికి చాలా సులభంగా ఉండడమే కాకుండా నిత్యం కళ్ల ముందు కనిపించేలా, కర్తవ్యాన్ని గుర్తు చేసేలా కేవలం రెండు పేజీలతోనే మేనిఫెస్టో ప్రకటించాం. దాన్ని ప్రతి శాఖ కార్యదర్శికి, ప్రతి విభాగాధిపతికి, ప్రతి కలెక్టర్‌కు అందజేశాం. చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి పని చేశాం. కార్యక్రమాలు నిర్వహించాం. మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 95 శాతం వరకు అమలు చేశాం, చేస్తున్నాం.

ఒక్కొక్కటీ చక్కదిద్దుకుంటూ..
నేను అధికారం చేపట్టిన తర్వాత జరిగిన తొలి సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ ఒక మాట చెప్పారు. దాదాపు రూ.60 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు ఉన్నాయని, వాటిల్లో రూ.21 వేల కోట్లు కేవలం విద్యుత్‌ బిల్లుల బకాయిలు కాగా మిగిలిన రూ.39 వేల కోట్ల బిల్లులు వివిధ శాఖలకు సంబంధించినవి. ఎన్నడూ లేని విధంగా రూ.వేల కోట్ల బకాయిలున్నాయి. కేంద్రంతో పాటు పొరుగు రాష్ట్రాలతో కూడా ఏమాత్రం సయోధ్య లేని పరిస్థితి ఉంది. మేం అధికారం చేపట్టినప్పుడు ఉన్న దుస్థితి అది. ఆ పరిస్థితి నుంచి అన్నీ చక్కదిద్దుకుంటూ ఇంత దూరం వచ్చామని గర్వంగా చెప్పగలుగుతా.

గ్రామాలకే పాలన..
గతంతో పోలిస్తే పరిపాలనలో ఎన్నో మార్పులు తెచ్చాం. మండల స్థాయి నుంచి పరిపాలనను గ్రామ స్థాయికి చేరువ చేశాం. గతంలో ప్రతిదీ మండల స్థాయిలో జరగడం వల్ల అన్నీ ఆలస్యమయ్యేవి. అవినీతి కొనసాగేది. ఇప్పుడు గ్రామ స్థాయిలో పరిపాలన అందుతోంది. ఒక్కో గ్రామంలో సగటున 700 ఇళ్లు ఉన్నాయనుకుంటే దాదాపు 10 మంది అధికారులు పని చేస్తున్నారు. ఇలా ఒక పరిధిలోనే సేవలందించడం వల్ల ఏ అధికారీ లంచం ఆశించే వీలు లేదు. 

కార్యదర్శులు, విభాగాధిపతులు చొరవ చూపాలి..
గ్రామస్థాయికి పరిపాలనను చేరవేసేందుకు మనం తెచ్చిన సచివాలయాల వ్యవస్థను ప్రతి కార్యదర్శి, ప్రతి విభాగాధిపతి తమదిగా భావించాలి. లేదంటే శాఖల మధ్య సమన్వయం కొరవడి సేవలు సక్రమంగా అందవు. గ్రామాల నుంచి అందే విజ్ఞప్తులు వెంటనే కార్యరూపం దాల్చాలి. గ్రామస్తులు ప్రస్తావించే సమస్యలు పరిష్కారం కావాలి. అలా జరగకపోతే ప్రజలకు ప్రభుత్వంపైనా, కార్యదర్శులపైనా నమ్మకం, విశ్వాసం పోతుంది. అందువల్ల గ్రామాల నుంచి వస్తున్న వినతులపై అధికార యంత్రాంగం నుంచి పూర్తిస్థాయిలో స్పందన ఉండాలి. ఏ స్థాయిలో ఉన్నాయనే విషయాన్ని కార్యదర్శులు ఎప్పటికప్పుడు సమీక్షించి పరిష్కారంపై దృష్టి పెట్టాలి. అప్పుడు కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు మరింత చురుగ్గా వ్యవహరిస్తారు. తద్వారా ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయి. అలాంటి చొరవ కార్యదర్శులు, విభాగాధిపతులకు ఎంతో ముఖ్యం.

సీఎస్‌కు అభినందనలు...
ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అభినందిస్తున్నా. ఇలాంటి సమావేశాలు తరచూ జరగాలి. తద్వారా శాఖల సమన్వయం పెరుగుతుంది. పలు అంశాలను నేనే స్వయంగా పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోగలుగుతా. ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి ఆ శాఖ కార్యదర్శికి తగిన విధంగా నిర్దేశించగలుగుతాం. ఇవన్నీ ఒకవైపు కాగా మరోవైపు ఇలాంటి సమావేశాల వల్ల మన ముందున్న పనులు, లక్ష్యాలపై దృష్టి పెట్టే వీలుంటుంది. ఎక్కడైనా సమాచార లోపం ఉంటే అధిగమించవచ్చు. ఇక్కడ వివిధ శాఖలకు చెందిన ఎంతోమంది అనుభవజ్ఞులైన అధికారులున్నారు. మీ శాఖకు సంబంధించిన అంశం కాకపోయినా ఫలానా శాఖలో ఇలాంటి మార్పు చేస్తే మరింత మెరుగైన పాలన అందుతుందని భావిస్తే ఏమాత్రం సంకోచించకుండా చెప్పండి. నిస్సందేహంగా సలహాలు అందజేయండి. ఒక మంచి ఆలోచనను స్ఫూర్తి, నిబద్ధతతో అమలు చేస్తేనే సత్ఫలితాలు వస్తాయి. వాటి అమలులో ప్రభుత్వం సంకోచించదు. 

ఉగాదికి వలంటీర్లకు అవార్డులు, రివార్డులు..
కొందరు వలంటీర్లు వేతనాల పెంపు కోరుతూ రోడ్డెక్కిన విషయం నా దృష్టికి వచ్చింది. అది చూసి చాలా బాధ కలిగింది. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలను మనం ఎందుకు ఏర్పాటు చేశాం? ప్రజలకు మెరుగైన సేవలందించడం కోసమే కదా? వలంటీర్‌ అంటేనే స్వచ్ఛందంగా పని చేసే వారని అర్ధం. కానీ దానర్థం మార్చేసి ప్రభుత్వం నుంచి ఇంకా ఆశించడం మొత్తం వ్యవస్థనే నీరుగారుస్తుంది. కాబట్టి మరో మార్గంలో వలంటీర్లను ప్రోత్సహిద్దాం. ఆ ప్రక్రియలో నాకు ఇవాళే ఒక ఆలోచన వచ్చింది. ఉగాది పండగ రోజు నుంచి ప్రతి జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో వలంటీర్లకు సత్కారం, సేవారత్న, సేవామిత్ర లాంటి అవార్డులు ప్రదానం చేయడం వల్ల వారి సేవలను గుర్తించి ప్రోత్సహించినట్లు అవుతుంది. వచ్చే ఉగాది రోజు ఈ కార్యక్రమం ప్రారంభించాలి. ఉదాహరణకు కడపలో పది నియోజకవర్గాలున్నాయి. అంటే అది 10 రోజుల కార్యక్రమం. తూర్పు గోదావరి జిల్లాలో 19 రోజులు, గుంటూరు జిల్లాలో 17 రోజుల పాటు వలంటీర్ల సత్కార కార్యక్రమం కొనసాగుతుంది. కలెక్టర్, ఎస్పీ, సచివాలయాల బాధ్యతలు నిర్వర్తిస్తున్న జాయింట్‌ కలెక్టర్, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. వలంటీర్లకు రివార్డుతో కూడిన అవార్డులు ఇవ్వాలి. తద్వారా వారు తమ బాధ్యతలను ఒక ఉద్యోగంగా భావించకుండా సేవా ధృక్పథంతో పని చేస్తారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top