చెవిటి, మూగ, వైకల్య రహిత రాష్ట్రంగా ఏపీ | AP CM YS Jagan Review Meeting Koklear Implant | Sakshi
Sakshi News home page

చెవిటి, మూగ, వైకల్య రహిత రాష్ట్రంగా ఏపీ

Feb 16 2021 3:29 PM | Updated on Feb 16 2021 7:09 PM

AP CM YS Jagan Review Meeting Koklear Implant - Sakshi

సాక్షి, తాడేపల్లి : చెవిటి, మూగ వైకల్య రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కంటి వెలుగు తరహాలో కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్లు చేయాలని సూచించారు. బాధితుల్లో ఇలాంటి లోపాలను ముందుగా గుర్తించి వారికి వీలైనంత త్వరగా ఆపరేషన్లు చేయాలన్నారు. ప్రజాసంకల్ప యాత్ర సమయంలో కనీసం 100 మంది పిల్లలు తన వద్దకు వచ్చారని, వారందరికీ ఆపరేషన్లు చేయించామని సీఎం ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇలాంటి వైకల్యంతో బాధపడేవారికి అండగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాక్లియర్‌ ఇంప్లాంట్, డెఫ్‌ ఫ్రీ ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టుపై మంగళవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా చెవిటి, మూగ వైకల్యం నివారించడానికి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో అమలు చేస్తున్న విధానాలపై అధికారులతో చర్చించారు.

ఏపీకే ఆ ఘనత
అలాగే పాఠశాల విద్యార్థులకు కూడా శబ్ధగ్రహణ పరీక్షలపై సీఎం చర్చించారు. ఇలాంటి కార్యక్రమాలతో వినికిడి లోపాన్ని ముందుగానే గుర్తించి తగిన విధంగా వైద్యం చేయించే అవకాశం ఉంటుందని సీఎం భావించారు. కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్లను తొలిసారి ప్రారంభించిన ఘనత ఏపీకి దక్కుతుందన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలను మరింత ఆధునికంగా నిర్వహించడంపై సమావేశంలో చర్చించారు. ఎంఆర్‌ఐ కంపాటిబిలిటీతో ఆధునిక పరిజ్ఞానం సహాయంతో ఆపరేషన్లు చేయడంపై కూడా సమీక్షించారు. స్క్రీనింగ్‌ లో గుర్తించిన వారికి పూర్తిస్థాయి వైద్యం, ఆపరేషన్లు చేయంచడంపై సమగ్ర కార్యాచరణ ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

సమగ్ర కార్యాచరణ తయారు చేయాలి..
అప్పుడే పుట్టిన శిశువులతో పాటు, చిన్నారులకు, స్కూలు విద్యార్థులకు స్క్రీనింగ్‌ నిర్వహించాలన్నారు. వీటికి అవసరమైన పరికరాలు, వాటి నిర్వహణా విధానం, అలాగే వినికిడి, మూగ లాంటి లోపాలు గుర్తించిన వారికి కంటి వెలుగు తరహాలోనే సర్జరీలు చేయించాలని ఆదేశాలు జారీచేశారు. సర్జరీలు చేయాల్సిన అవసరంలేని వారికి అందించాల్సిన పరికరాలపైనా ఆలోచన చేసి, వీటన్నింటిపై సమగ్ర కార్యాచరణ తయారు చేయాలని సూచించారు. ఆస్పత్రుల్లో అప్పుడే పుట్టిన శిశువులకు, విలేజ్‌ క్లినిక్స్‌లో చిన్నారులకు, కంటివెలుగు తరహాలో పాఠశాలల్లో చిన్నారులకు, వినికిడి సమస్య ఉందా? లేదా? అన్నదానిపై పరీక్షలు నిర్వహించడంపై చర్యలు తీసుకోవాలన్నారు. 

ఈ సందర్భంగా శిశువులకు 1వ నెల, 3వనెల, 6వ నెలల్లో పరీక్షలు చేయించాల్సి ఉంటుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన తర్వాత లోపాలు లేకపోతే ఆ పిల్లలను సర్టిఫై చేయాలని సీఎం తెలిపారు. చెవిటి, మూగ లోపాలను ముందుగానే గుర్తించడానికి నిర్వహించే పరీక్షలపై సమగ్ర ప్రణాళిక తయారుచేయాలని ఆదేశించారు. కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీ చేసే పరిస్థితి ప్రభుత్వాసుపత్రుల్లో ఉండాలన్నారు. ప్రతి బోధనాసుపత్రిలో అలాంటి సర్జరీలు చేసే సదుపాయాలు ఉండాలని సూచించారు.  అవ్వాతాతలు కూడా వినికిడి సమస్యతో బాధపడుతున్నారని, వారికికూడా పరికరాలు అందించేలా కార్యాచరణ ఉండాలన్నారు.

ఇలా ప్రతిదశలోనూ కూడా ఎస్‌ఓపీలను తయారుచేయాలని ఆదేశించారు. కోవిడ్‌ కారణంగా నిలిచిపోయిన కంటివెలుగు ఆపరేషన్లను పూర్తిచేయాలి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ మల్లిఖార్జున, సొసైటీ టు ఎయిడ్‌ ద హియరింగ్‌ ఇంపెయిర్డ్‌ (సాహి) సెక్రటరీ డాక్టర్‌ ఈ సి వినయ్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పట్టణాలు, నగరాల్లో.. త్వరలో సొంతిల్లు

Advertisement
 
Advertisement
Advertisement