విశాఖ సీట్ల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా మరో అడుగు ముందుకు!
ఆస్తుల నగదీకరణ పేరుతో ప్లాంట్ ఆస్తుల విక్రయం
మద్దిలపాలెం, గాజువాకలో 459 ప్లాట్ల విక్రయానికి ఎన్‌ఎల్‌ఎంసీ షెడ్యూల్
రూ.858 కోట్ల రిజర్వ్ ధరతో ఈ–ఆక్షన్ నోటిఫికేషన్
అక్టోబర్ 12, 16వ తేదీల్లో వేలం వేయనున్నట్లు ప్రకటన
అత్యంత విలువైన ఆస్తుల విక్రయంతో ‘ఉక్కు నగరం’ ఉనికిపై
ఉద్యోగులు, కార్మికుల్లో తీవ్ర ఆందోళన
నిన్న ప్లాంట్ నుంచి సీఐఎస్‌ఎఫ్ బలగాల ఉపసంహరణ
నేడు ఖరీదైన మిగులు భూముల వేలానికి నోటిఫికేషన్
విశాఖ ఉక్కుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు సర్కారు
సాక్షి, విశాఖపట్నం, సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు నినాదంతో ఆవిర్భవించిన స్టీల్ ప్లాంట్‌ని కనుమరుగు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా మొన్న.. ప్లాంట్ నుంచి సీఐఎస్‌ఎఫ్ బలగాల ఉప సంహరణ ప్రక్రియ మొదలుపెట్టిన యాజమాన్యం.. తాజాగా రూ.వందల కోట్ల విలువ చేసే ప్లాంట్ మిగులు భూముల వేలానికి తెరతీసింది. హెచ్‌బీ కాలనీ, గాజువాక ఆటోనగర్ ప్రాంతాల్లో ఉన్న 459 ప్లాట్ల విక్రయానికి రూ.858.68 కోట్ల రిజర్వ్ ధరతో నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్‌ఎల్‌ఎంసీ) మంగళవారం ఈ–ఆక్షన్ నోటిఫికేషన్ విడుదల చేయడం ఉద్యోగ, కార్మిక సంఘాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
నిధుల సమీకరణ, అసెట్ మానిటైజేషన్ పేరుతో జరుగుతున్న ఈ వేలం ప్రక్రియ వాస్తవానికి ప్లాంట్ ఆస్తులను ముక్కలు ముక్కలుగా చేసి ప్రైవేట్‌కు అప్పగించే వ్యూహంలో భాగమేనన్న అనుమానాలు బలపడుతున్నాయి. మూడు దశాబ్దాలకు పైగా తెలుగువారి ఆత్మ గౌరవానికి, పోరాటాలకు ప్రతీకగా నిలిచిన విశాఖ ఉక్కు ఆస్తులను బేరం పెట్టడం ముంచుకొస్తున్న ప్రైవేటీకరణ తుపానుకు బలమైన సంకేతమని భావిస్తున్నారు.
ఇన్నాళ్లూ ప్రైవేటీకరణ జరగనివ్వబోమంటూ అబద్ధాలు వల్లెవేస్తూ మోసం చేస్తూ వచ్చిన చంద్రబాబు సర్కారు మరో కుట్రపూరిత నిర్ణయానికి కొమ్ము కాస్తోందని, విశాఖ ఉక్కుకు వెన్నుపోటు పొడిచిందని ఉద్యోగ, కార్మిక వర్గాలు మండిపడుతున్నాయి. భూముల వేలం ప్రక్రియను తక్షణమే నిలిపి వేయాలని, సంస్థకు సొంత గనులు కేటాయించాలని, సెయిల్‌లో విలీనం చేసి ప్లాంట్‌ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాయి.
వేలం ఆన్‌లైన్ రిజిస్ట్రేషషన్‌కు ప్రకటన..
తాజాగా ఎన్‌ఎల్‌ఎంసీ మొత్తం 459 ప్లాట్లను ఈ–వేలం వేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా నగర నడి»ొడ్డున ఉన్న సీతమ్మధార పరిధిలోని హెచ్‌బీ కాలనీలో రూ.838.93 కోట్ల రిజర్వ్ ధరతో 87,949.77 చ.గజాల విస్తీర్ణంలో ఉన్న 456 ప్లాట్లు, పారిశ్రామికంగా అత్యంత కీలకమైన గాజువాక ఆటోనగర్‌లోని బ్లాక్– 2లోని 2,728 చ.గజాలు, బ్లాక్–3లోని 2894.44 చ.గజాల్లో ఉన్న రూ.19.75 కోట్లు విలువైన ప్లాట్లను వేలంలో చేర్చారు.
అక్టోబర్ 12వతేదీన 243 ప్లాట్లకు, 16వతేదీన 216 ప్లాట్లకు సంబంధించిన వేలం విక్రయం జరగనుంది. వేలంలో పాల్గొనేవారు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషషన్ చేసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈ) మిగులు ఆస్తుల నగదీకరణలో భాగంగా 2022 జూన్‌లో ఆర్థిక శాఖ పరిధిలో ఏర్పాటైన ఎన్‌ఎల్‌ఎంసీ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. సీపీఎస్‌ఈల వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో సహాయపడటం దీని ముఖ్య ఉద్దేశం.
ప్యాకేజీలతో మభ్యపుచ్చి నిర్వీర్యం చేసే కుట్ర
ఆర్‌ఐఎన్‌ఎల్ ఆ«దీనంలో ఉన్న సుమారు 19 వేల ఎకరాలకుపైగా భూముల్లో అత్యంత విలువైన వాణిజ్య స్థలాలను ముందుగా అమ్మకానికి పెట్టి సంస్థను క్రమంగా నిర్వీర్యం చేసే కుట్ర మొదలైందని ఉద్యోగ, కార్మిక సంఘాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్యాకేజీల పేరుతో మభ్యపుచ్చి ఎన్‌ఎల్‌ఎంసీ ద్వారా భూముల విక్రయానికి తెర తీశారని మండిపడుతున్నారు.
నాడు గట్టిగా అడ్డుకున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం
ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. 2021 జనవరిలో స్టీల్‌ప్లాంట్‌లో వంద శాతం వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపగా నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దీన్ని గట్టిగా వ్యతిరేకించి అడ్డుకుంది. దీనిపై కార్మికులు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడంతో అడుగులు ముందుకు పడలేదు.
అంతేకాకుండా ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత ప్రభుత్వం జీవీఎంసీ కౌన్సిల్‌లో, అసెంబ్లీలో తీర్మానాలు ప్రవేశ పెట్టింది. దీంతో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రైవేటీకరణ ప్రక్రియకు అడ్డుకట్ట పడింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రైవేటీకరణ అడుగులు వేగంగా పడ్డాయి. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2025 జనవరిలో కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించింది. దీన్ని రుణాల చెల్లింపులు, పాత బకాయిల కోసం వినియోగించడంతో ప్లాంట్ అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడలేదు.
సొంత గనులు కేటాయించి ఉంటే..
కర్మాగారానికి సొంత గనులు కేటాయించకపోవడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిందన్నది ఎవరూ కాదనలేని సత్యం. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం స్టీల్‌ప్లాంట్‌పై మొసలి కన్నీళ్లు కార్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తీసుకున్న చర్యలు శూన్యం. వైజాగ్ స్టీల్‌కు సొంతగనులు ఇవ్వకుండా.. ఓ ప్రైవేట్ సంస్థకు కేటాయించేలా తన పరపతి వినియోగించారు. ముడిసరుకు కొనుగోలు భారం మోయలేక, మూలధనం కొరతతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీన్ని సాకుగా చూపిస్తూ ప్లాంట్‌కు చెందిన విలువైన స్థలాలను మిగులు, వృథా ఆస్తుల పేరుతో విక్రయించడం వ్యూహాత్మక కుట్రలో భాగమేనని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.


