తిరునగరికి మణిహారం

Another Sincerity In The Spiritual City Tirupati - Sakshi

ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లుతున్న తిరుపతి నగరాన్ని అధికారులు స్మార్ట్‌సిటీగా పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో నగర రూపురేఖలు మార్చేలా పక్కా ప్రణాళికలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు. తిరుపతిలోని వినాయకసాగర్‌ ఆధునీకరణతో సరికొత్త హంగులతో సందర్శన కేంద్రం అందుబాటులోకి రానుంది. కళ్లు జిగేల్‌మనిపించే అత్యాధునిక విద్యుత్‌ వెలుగులు, పచ్చదనం పరవశించే గార్డెన్‌లు, చుట్టూ నీటి అలల మధ్య అందమైన ఐర్లాండ్, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓపెన్‌జిమ్, యోగా సెంటర్‌లు, ఖరీదైన పూల మొక్కలతో గ్లో గార్డెన్, సాగర్‌లో చక్కర్లు కొట్టే బోటింగ్, ఘుమఘుమలాడే వంటకాలతో ప్రత్యేక రెస్టారెంట్, పిల్లలను ఆకట్టుకునే బొమ్మలతో వినాయకసాగర్‌ కొత్త రూపును సంతరించుకోనుంది. 2022 ఏప్రిల్‌ నాటికి లేక్‌ వ్యూను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు శరవేగంగా ఆధునీకరణ పనులు సాగుతున్నాయి.
– సాక్షి ప్రతినిధి, తిరుపతి

ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా భాసిల్లుతున్న తిరుపతిలో సరైన విహార స్థలం లేకపోవడం నగర వాసుల్ని వేధించే అంశం. రోజుకు లక్షలాది మంది యాత్రికులు వచ్చే తిరుపతిలో పర్యాటక స్థలాలు లేకపోవడం వల్ల శ్రీవారి దర్శనానంతరం భక్తులు మరో ప్రత్యామ్నాయం లేక నేరుగా తిరుగు ప్రయాణమవుతున్నారు. యాత్రికులు తిరుపతిలో ఒకటిరెండు రోజులు పర్యటించే అవకాశం లేకపోవడం వల్ల వ్యాపార, వాణిజ్య పరంగా తీవ్ర నష్టమని గుర్తించారు. అలానే సెలవు రోజుల్లో స్థానికులు కుటుంబ సమేతంగా కొంతసేపు గడిపే సరైన సందర్శనా స్థలాలు లేకపోవడం శాపంగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్‌ గిరీష 2020 జూలై 4వ తేదీన వినాయకసాగర్‌ ట్యాంక్‌బండ్‌ ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు. తిరుపతి నగర ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని వినాయకసాగర్‌ను అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు శరవేగంగా చర్యలు చేపట్టారు. 

అత్యాధునిక డిజైన్లతో 
వినాయకసాగర్‌ను ప్రత్యేక సందర్శనా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు దేశంలోని పలు లేక్‌వ్యూ డిజైన్లను పరిశీలించి అందులో అత్యుత్తమ్మ డిజైన్లను ఎంపిక చేశారు. వాటికి తుదిమెరుగులు దిద్ది మరింత మార్పులతో అభివృద్ధి పనులు చేపట్టారు. మొత్తం 60 ఎకరాల విస్తీర్ణంలో వివిధ ఆకృతులతో, సౌకర్యాలతో ట్యాంక్‌బండ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. వినాయకసాగర్‌ ప్రాముఖ్యతను చాటేలా ముఖ ద్వారం వద్ద భారీ వినాయక ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు. కట్ట పొడవునా కిడ్స్‌పార్కు, ఓపెన్‌ గ్యాలరీలు, యోగాసెంటర్, లాన్, గ్రీనరీ, గ్లో గార్డెన్‌ను వేర్వేరుగా అభివృద్ధి చేస్తున్నారు. సాయంత్రం వేళ ఆహ్లాదాన్ని పెంచే లా ఆధునిక హంగులతో కూడిన విద్యుత్‌ వెలుగులు వెదజిమ్మేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  

ప్రత్యేక ఆకర్షణగా ఐలాండ్‌ 
వినాయకసాగర్‌లో ఐలాండ్‌ను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దుతున్నారు. 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఐలాండ్‌ కొత్త లోకంలో సంచరిస్తున్న అనుభూతిని కలిగించేలా ఉండబోతోంది. ఇక్కడే బర్త్‌డే వంటి పార్టీలను జరుపుకునేందుకు అద్దెకు ఇవ్వనున్నారు. ఎల్‌ఈడీ భారీ స్క్రీన్, మ్యూజికల్‌ ఫౌంటెన్‌ ఏర్పాటు చేస్తున్నారు. 
బోటింగ్‌ పాయింట్‌ సాగర్‌లో పడమట వైపు తక్కువ ఎత్తులో నీరు ఉన్న ప్రదేశంలో పది బోట్లు విహరించేలా కౌంటర్‌ను నిర్మిస్తున్నారు. కుటుంబ సమేతంగా బోటింగ్‌లో వెళ్లి సేద తీరేలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు. స్విమ్మింగ్‌ఫూల్, మూడు అంతస్తుల రెస్టారెంట్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు.  

వాకింగ్‌ ట్రాక్‌ వినాయకసాగర్‌ కట్టపై 2.5 కి.మీల పొడవుతో వాకింగ్, సైక్లింగ్‌ ట్రాక్‌లను వేర్వేరుగా నిర్మిస్తున్నారు. వాకింగ్‌ ట్రాక్‌ నిర్మాణంలో పలు జాగ్రత్తలు తీసుకున్నారు.  నిపుణుల సలహా మేరకు వాకింగ్‌ట్రాక్‌ను తీర్చిదిద్దుతున్నారు. ఒకసారి 60 మందికి యోగాను నేర్పించేలా ఓపెన్‌ప్లాట్‌ఫామ్‌ సిద్ధం చేస్తున్నారు. అత్యవసరమైతే మరో గేటు అందుబాటులో ఉండేలా నిర్మిస్తున్నారు. పిల్లల ప్లే గ్రౌండ్‌లో రబ్బర్‌ ప్లోరింగ్‌ నిర్మిస్తున్నారు.  

నిమజ్జనానికి 
వినాయక నిమజ్జనానికి ప్రత్యేకంగా ఒకకొలను తీర్చిదిద్దుతున్నారు. ఐదు అడుగుల లోపు ఉన్న వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ఆ«ధునిక సదుపాయాలతో కొలను తీర్చిదిద్దుతున్నారు. నిమజ్జనాన్ని తిలకించేందుకు అవసరమైన గ్యాలరీని నిర్మిస్తున్నారు. 200 మంది ఒకేసారి సాగర్‌ వ్యూ పాయింట్‌ను కట్ట మధ్యలో ఉండేలా శరవేగంగా నిర్మాణాలు సాగుతున్నాయి.

తిరుపతికి ప్రత్యేక ఆకర్షణ 
వినాయకసాగర్‌ తిరుపతి నగరానికి తలమానికంగా నిలిచేలా తీర్చిదిద్దుతున్న స్మార్ట్‌ సిటీ నిధులతో అభివృద్ధి చేస్తున్న ఈ లేక్‌వ్యూ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. స్థానికులు, యాత్రికులు రోజంతా ఒకేచోట గడిపేంత వ్యవస్థను ఏర్పాటు  చేస్తున్నాం. పిల్లల ప్రత్యేక ఆటవిడుపు కేంద్రాలు, బోటింగ్, స్విమ్మింగ్, ఐలాండ్‌ వంటివి కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఏప్రిల్‌ నాటికి సందర్శకులను అనుమతించేలా శరవేగంగా పనులు చేపట్టాం. 
80 శాతం పనులు పూర్తయ్యాయి. 
– పీఎస్‌ గిరీష, కమిషనర్, తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌   

సాగర్‌ విస్తీర్ణం- 60 ఎకరాలు
సాగర్‌ అభివృద్ధికి చేస్తున్న ఖర్చు- రూ. 21.26 కోట్లు

ఐలాండ్‌ ఏర్పాటుకు ఖర్చు - రూ.89 లక్షలు 
స్విమ్మింగ్‌ఫూల్, రెస్టారెంట్‌కు  రూ.4 కోట్లు 
మొత్తం ఖర్చు   26.15 కోట్లు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top