రూ.412 కోట్లతో ఉప్పుటేరు ఆధునికీకరణ

Andhra Pradesh Govt taken step forward in conservation of Kolleru Lake - Sakshi

మూడు చోట్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ కమ్‌ బ్రిడ్జిల నిర్మాణం

పెదలంక మేజర్‌ డ్రెయిన్‌పై రూ.40 కోట్లతో అవుట్‌ఫాల్‌ స్లూయిజ్, డబుల్‌ లేన్‌ బ్రిడ్జి

పరిపాలన ఉత్తర్వులు జారీ చేసిన జలవనరుల శాఖ

కొల్లేరు సరస్సు పరిరక్షణలో ముందడుగు

సాక్షి, అమరావతి: కొల్లేరు సరస్సు పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. సరస్సు నుంచి మురుగునీటిని సముద్రంలో కలిపే ఉప్పుటేరు ఆధునికీకరణ, మూడు ప్రాంతాల్లో క్రాస్‌ రెగ్యులేటర్‌ కమ్‌ బ్రిడ్జి కమ్‌ లాక్‌లను నిర్మించేందుకు రూ.412 కోట్లతో గ్రీన్‌ íసిగ్నల్‌ ఇచ్చింది. దీంతోపాటు కొల్లేరులో కలిసే పెదలంక మేజర్‌ డ్రెయిన్‌పై అవుట్‌ఫాల్‌ స్లూయిజ్, డబుల్‌ లేన్‌ బ్రిడ్జి నిర్మాణానికి రూ.40 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని వల్ల కొల్లేరును పరిరక్షించుకోవడంతోపాటు ప్రజా రవాణాను మెరుగుపర్చాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.

► పశ్చిమగోదావరి జిల్లాలో ఆకివీడు మండలం దుంపగడప గ్రామం వద్ద ఉప్పుటేరుపై (10.56 కి.మీ. వద్ద) రెగ్యులేటర్‌ నిర్మాణానికి రూ.87 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
► పశ్చిమగోదావరి జిల్లాలో మొగల్తూరు మండలం పడతడిక వద్ద ఉప్పుటేరుపై (1.4 కి.మీ. వద్ద) రెగ్యులేటర్‌ కమ్‌ బ్రిడ్జి కమ్‌ లాక్‌ నిర్మాణానికి రూ.136.60 కోట్లను కేటాయించింది.
► పశ్చిమగోదావరి జిల్లాలో మొగల్తూరు మండలం మొల్లపర్రు వద్ద ఉప్పుటేరుపై (57.95 కి.మీ. వద్ద) రెగ్యులేటర్‌ కమ్‌ బ్రిడ్జి కమ్‌ లాక్‌ నిర్మాణానికి రూ.188.40 కోట్లను మంజూరు చేసింది.
► కృష్ణా జిల్లాలో కృత్తివెన్ను మండలం నిడమర్రు వద్ద పెదలంక మేజర్‌ డ్రెయిన్‌పై (3.25 కి.మీ. వద్ద) అవుట్‌ఫాల్‌ స్లూయిజ్, డబుల్‌ లేన్‌ బ్రిడ్జి నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు చేసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top