స్కూళ్లు, కాలేజీల ఫీజుల ఖరారు | Andhra Pradesh Govt Finalized Private schools and colleges fees | Sakshi
Sakshi News home page

స్కూళ్లు, కాలేజీల ఫీజుల ఖరారు

Aug 25 2021 3:43 AM | Updated on Aug 25 2021 7:14 AM

Andhra Pradesh Govt Finalized Private schools and colleges fees - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ప్రైవేటు స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలకు సంవత్సర ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ వివరాలతో మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఫీజులు 2021–22, 2022–23, 2023–24 విద్యాసంవత్సరాలకు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.  ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు లాభాపేక్ష లేకుండా సేవాదృక్పథంతో విద్యాసంస్థలను నడపాలని ప్రభుత్వ నిబంధనలున్నా ఫీజులపై స్పష్టమైన ఆదేశాలు లేవు. గతంలో ప్రైవేటు విద్యాసంస్థలపై జీవో నంబరు 1 విడుదల చేసినా దాన్ని పట్టించుకునేవారే లేరు. దీంతో రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల దోపిడీ ఇష్టానుసారం సాగింది. ముఖ్యంగా ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలు భారీగా ఫీజు వసూలు చేశాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ప్రైవేటు కార్పొరేట్‌ విద్యాసంస్థలు మరింతగా దోపిడీకి దిగాయి. లక్షల్లో ఫీజు వసూలు చేస్తూ తల్లిదండ్రులను పీల్చిపిప్పిచేశాయి. ఈ పరిస్థితిని మార్చడంతోపాటు పాఠశాల విద్యారంగంలో ప్రమాణాలు పెంచేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి చైర్మన్‌గా పలువురు విద్యారంగ నిపుణులతో పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఏర్పాటు చేశారు.

ఈ కమిషన్‌ గత ఏడాదిలోనే ఫీజులపై నోటిఫికేషన్‌ జారీచేసినా న్యాయవివాదంతో అమలు కాలేదు. వాటిని పరిష్కరించుకుని ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ఫీజులను నిర్ణయిస్తూ ప్రభుత్వానికి కొద్దిరోజుల కిందట సిఫార్సులు అందించింది. వీటి ఆధారంగా ప్రభుత్వం మంగళవారం జీవో 53, 54లను విడుదల చేసింది. పంచాయతీలు, మునిసిపాలిటీలు, నగరాల వారీగా ఫీజులను నిర్ణయించింది. ట్యూషన్, ప్రాస్పెక్టస్, రిజిస్ట్రేషన్, అడ్మిషన్, ఎగ్జామినేషన్‌ ఫీ, ల్యాబొరేటరీ ఫీ, స్పోర్ట్సు, కంప్యూటర్‌ ల్యాబొరేటరీ, లైబ్రరీ, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీ, స్టూడెంట్‌ వెల్ఫేర్, స్టూడెంట్‌ హెల్త్‌ కేర్, స్టడీ టూర్‌ తదితర ఫీజులన్నీ ఇందులో కలిపి ఉంటాయని స్పష్టం చేసింది. ఈ ఫీజులను ఏడాదిలో మూడు సమాన వాయిదాల్లో వసూలు చేయాలని పేర్కొంది. విద్యార్థుల రవాణా కోసం బస్సులు ఏర్పాటు చేసి ఉంటే రవాణా చార్జీల కింద కిలోమీటరుకు రూ.1.20 చొప్పున వసూలు చేయాలని తెలిపింది. హాస్టళ్ల ఫీజు నిర్దేశించింది. 


కాలేజీల యజమానులు, తల్లిదండ్రుల హర్షం
ఈ చరిత్రాత్మక జీవోలపట్ల ప్రైవేటు కాలేజీల యజమానులు, ఉద్యోగులు, తల్లిదండ్రులు, ఇతర నిపుణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్‌ కబంధహస్తాల్లో నలిగిపోతున్న తల్లిదండ్రులు ఈ జీవోలతో ఊపిరి పీల్చుకోగలుగుతారని, కార్పొరేట్‌ దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. దశాబ్దాల తరబడి ఇలాంటి ఫీజుల నిర్ణయం కోసం పోరాడుతున్నామని, ఇన్నాళ్లకు ఇది సాకారమైందని ప్రైవేటు జూనియర్‌ కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు కనుమర్ల గుండారెడ్డి చెప్పారు. ప్రైవేటు ఇంటర్మీడియట్‌ కాలేజీలకు ఫీజులు ఖరారు చేయడం ఆనందదాయకమని రాష్ట్ర ఎయిడెడ్‌ ఇంటర్‌ కాలేజీల ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు త్రివిక్రమ్‌ పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement