‘నాడు–నేడు’తో స్కూళ్లలో అద్భుత అభివృద్ధి

Amazing Development In Schools With Nadu Nedu Scheme - Sakshi

ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సభ్యులు

గుంటూరులోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల సందర్శన

గుంటూరు ఎడ్యుకేషన్‌: ‘మన బడి నాడు–నేడు’ పథకం ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సభ్యులు ప్రొఫెసర్‌ వి.నారాయణరెడ్డి, సీఏవీ ప్రసాద్, బి.ఈశ్వరయ్య పేర్కొన్నారు. గుంటూరు నగరంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను వారు శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కమిషన్‌ సభ్యులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 15 వేల ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు మొదటి దశ కింద ప్రభుత్వం అభివృద్ధి చేసిందని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క విషయంలోనూ రాజీ పడకుండా నిధులు కేటాయిస్తోందన్నారు. మొదటి దశ అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తయ్యాయని.. రెండు, మూడు దశల్లో మరో 30 వేల పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నేలా ప్రభుత్వం తీర్చిదిద్దనుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను ఈ స్థాయిలో అభివృద్ధి చేయడం గతంలో ఏ ప్రభుత్వ పాలనలోనూ చూడలేదన్నారు. పాఠ్యాంశాల రూపకల్పనలో సైతం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందన్నారు. కమిషన్‌ సభ్యులతో పాటు ఆర్జేడీ కె.రవీంద్రనాథ్‌రెడ్డి, డీఈవో గంగా భవాని తదితరులున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top