దివ్యాంగ కోటాలో ఎంబీబీఎస్‌ సీట్ల కేటాయింపు | Allotment of MBBS seats in Handicapped Reservation Quota: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

దివ్యాంగ కోటాలో ఎంబీబీఎస్‌ సీట్ల కేటాయింపు

Oct 7 2024 5:13 AM | Updated on Oct 7 2024 5:13 AM

 Allotment of MBBS seats in Handicapped Reservation Quota: Andhra Pradesh

సాక్షి, అమరావతి: ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లోని కన్వీనర్‌ సీట్లలో దివ్యాంగ కోటాకు కేటాయించిన 121 ఎంబీబీఎస్‌ సీట్లు మిగిలిపోయాయి. ఈ విభాగంలో మొత్తం 182 సీట్లు ఉండగా 61 మంది మాత్రమే అర్హులైన విద్యార్థులున్నారు. వీరందరికీ ఆదివారం హెల్త్‌ వర్సిటీ సీట్లు కేటాయించింది. విద్యార్థులు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాలి. ఎంబీబీఎస్‌ తరగతులు ఈ నెల 14 నుంచి ప్రారంభం అవుతాయి. మిగిలిపోయిన 121 సీట్లను ఆర్‌ఓఆర్‌ ఆధారంగా సాధారణ విద్యార్థులకు కేటాయిస్తారు.  

ఆలస్య రుసుము లేకుండానే.. 
2024–25 విద్యా సంవత్సరానికి మెడికల్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆలస్య రుసుము లేకుండా సోమవారం రాత్రి 9 గంట­ల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చని హెల్త్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ రాధికారెడ్డి తెలిపారు. శుక్రవారంతో దరఖాస్తుల గడువు ముగియగా, శని, ఆది, సోమవారాల్లో ఆలస్య రుసు­­ముతో దరఖాస్తుకు తొలుత అవకాశం కల్పించారు. దరఖాస్తు రుసుము కన్నా ఆలస్య రుసుముతో విధించిన పెనాల్టీ అధికంగా ఉందని అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్త­మవడంతో ఆలస్య రుసుమును మినహాయించారు. ఆదివారం మధ్యాహ్నం వరకూ 8,645 మంది దరఖాస్తు చేసుకున్నారు. కౌన్సిలింగ్‌ ప్రక్రియ  ఎన్‌ఎంసీ షెడ్యూల్‌కు అనుగుణంగా నిర్వహిస్తామన్నారు. గతంలో లాగానే కౌన్సిలింగ్‌ ప్రారంభానికి ముందు సీట్‌ మ్యాట్రిక్స్‌ ను ప్రకటిస్తామన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement