
ఇంజినీరింగ్ కళాశాలల్లో బోధన నాణ్యతకు ఏఐసీఈటీ చర్యలు
గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడినవెయ్యి కళాశాలలపై దృష్టి
ఆవిష్కరణలు, ఉపాధి కల్పన విద్యనూ మెరుగుపర్చేలా ప్రణాళిక
5 లక్షల మందికిపైగా విద్యార్థులు, 10వేల మందికిపైగా అధ్యాపకులకు మేలు
ఆంధ్రప్రదేశ్ నుంచి 41 కళాశాలలకు జాబితాలో చోటు
మూడు దశల్లో ‘ప్రాజెక్ట్ ఫర్ అడ్వాన్సింగ్ క్రిటికల్ థింకింగ్ ఇండస్ట్రీ కనెక్ట్ అండ్ ఎంప్లాయిబిలిటీ’(ప్రాక్టీస్) అమలు
2028 నాటికి ఆయా సంస్థల్లో ఉపాధి రేటును రెట్టింపు చేయడమే లక్ష్యం
సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా సాంకేతిక విద్యా కళాశాలల్లో బోధన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన కళాశాలలను ఎంపిక చేసి బోధన నాణ్యత, నూతన ఆవిష్కరణలు, ఉపాధి కల్పనతో కూడిన కరిక్యులమ్‌లను ప్రోత్సహించనుంది. దీనికోసం ఏఐసీటీఈకి అనుబంధంగా ఉన్న సాంకేతిక విద్య కళాశాలల్లో సుమారు 1000 కళాశాలలను ఎంపిక చేసింది.
5లక్షల మంది విద్యార్థులకు, 10వేల మంది అధ్యాపకులకు కొత్త సాంకేతిక ఒరవడులపై సమగ్రంగా పట్టుసాధించేలా తర్ఫీదు ఇవ్వనుంది. ఏఐసీటీఈ ప్రత్యేకంగా సెంటర్‌ఫర్ రీసెర్చ్ ఇన్‌స్కీమ్స్ అండ్ పాలసీస్, పాలసీ థింక్ ట్యాంక్, ప్రాజెక్ట్ ఆధారిత ఇంజనీరింగ్ విద్యను ప్రోత్సహించే ఐఐటీ మద్రాస్, లీప్, భారతీయ కళాశాలల్లో స్టెమ్ విద్యపై పని చేస్తున్న యూఎస్ ఆధారిత లాభాపేక్షలేని సంస్థ మేకర్ భవన్ ఫౌండేషన్ల ఉమ్మడి సహకారంతో ప్రణాళిక రూపొందించింది. దీనికి ‘ప్రాజెక్ట్ ఫర్ అడ్వాన్సింగ్ క్రిటికల్ థింకింగ్ ఇండస్ట్రీ కనెక్ట్ అండ్ ఎంప్లాయిబిలిటీ’(ప్రాక్టీస్)గా నామకరణం చేసింది.
ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యం
రూ.23.31 కోట్లతో ప్రాక్టీస్ కార్యక్రమాన్ని చేపడుతోంది. దీనికి ఏఐసీటీఈతోపాటు ప్రాక్టీస్ ప్రాజెక్టులోని అన్ని భాగస్వామ్య సంస్థల ఆరి్థక సహకారంతో కార్యక్రమాలు నిర్వహించనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని కనీసం 85 శాతం ఇంజనీరింగ్ సంస్థలు ప్రస్తుత సాంకేతిక యుగానికి దూరంగా పాఠ్యాంశాలను అందిస్తూ, పరిశ్రమలతో బలహీన సంబంధాల వల్ల ఉపాధిదాయక అంతరం ఎక్కువగా ఉన్నట్టు తేలింది.
ఇలాంటి కళాశాలల్లో నూతన బోధన విధానం, అధ్యాపక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం, కొత్త ఆవిష్కరణ ప్రోత్సాహం, పరిశ్రమ అనుసంధాన విద్య, సుప్రసిద్ధ విద్యావేత్తల మార్గనిర్దేశకత్వంలో సాంకేతిక విద్య రూపురేఖలను మార్చే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ పథకం ద్వారా 2028 నాటికి 1000 కళాశాలల్లో సగటు ఉపాధి రేటును రెట్టింపు చేయడమే ప్రధానాంశంగా పేర్కొంటోంది. విద్యార్థుల పనితీరు, ఉపాధి కల్పన పరంగా ప్రస్తుతం అట్టడుగున ఉన్న వెయ్యికి పైగా కళాశాలలు అప్‌గ్రేడ్ చేయడం ప్రాథమికంగా చేపట్టనుంది.
మొదటి దశలో 500 కళాశాలల్లో..!
ఈ ప్రాజెక్టును మూడు దశల్లో అమలు చేయనుంది. మొదటి దశలో 200, రెండో దశలో 300, మూడో దశలో 500 కళాశాలలపైగా దృష్టి సారించనుంది. ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 500లకు పైగా కళాశాలల జాబితా సిద్ధం చేసింది. అత్యధికంగా తమిళనాడులో 128, కేరళలో 60 కళాశాలలున్నాయి. హరియాణలో 43, ఆంధ్రప్రదేశ్‌లో 41, తెలంగాణలో 36, పంజాబ్‌లో 33, ఉత్తరప్రదేశ్‌లో 31, మహారాష్ట్రలో 29, గుజరాత్‌లో 25, కర్ణాటకలో 17, ఒడిశాలో 16, ఉత్తరాఖండ్‌లో 11, పశ్చిమబెంగాల్‌లో 11 ఉన్నాయి.
ఇటీవల అధ్యాయనాల్లో దేశంలోని యువతలో సగం మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారు. కృత్రిమ మేధ, డేటాసైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో లోటు ఎక్కువగా ఉంది. సంప్రదాయ, పాత అధ్యయన పద్ధతులతో గ్రాడ్యుయేట్లకు తగినంత వృత్తిపర నైపుణ్యాలు దక్కట్లేదు. ఇంటర్న్íÙప్ అవకాశాలు పరిమితం అయిపోయాయి. 20–25 శాతం సాంకేతిక సంస్థలు మాత్రమే పరిశ్రమ సంబంధాల్లో పురోగతిలో ఉన్నాయి.
అధ్యాపకులకు అద్భుత శిక్షణ..
ప్రాక్టీస్ కార్యక్రమం ద్వారా 10వేల మంది అధ్యాపకులకు ఇంటర్ డిసిప్లినరీ, ప్రాక్టీస్ బేస్డ్ బోధనా పద్ధతుల్లో శిక్షణ ఇవ్వనుంది. ఐఐటీ మద్రాస్ సరి్టఫికేషన్‌తో 50 మెంటర్ సంస్థలు 950 మెంటీ కళాశాలల నుంచి అధ్యాపకులకు ఐదు రోజుల ఇమ్మర్సివ్ సెషన్ల ద్వారా శిక్షణ ఇస్తూ మెంటర్–మెంటీ మోడల్‌ను ప్రవేశపెడుతోంది. ముఖ్యంగా అత్యల్ప పనితీరులో ఉన్న కళాశాలలకు టాప్–50 సంస్థలతో కలిసి సహకారాన్ని అందించనుంది. అదనంగా, ఐఐటీ జమ్మూలో 10 రోజుల రెసిడెన్షియల్ ఇన్నోవేషన్ ఫ్యాకల్టీ ప్రోగ్రామ్ డిజైన్ థింకింగ్, ప్రోటోటైపింగ్, ఐపీ ఫైలింగ్, ఇన్నోవేషన్ మెంటరింగ్ వంటి రంగాలపై దృష్టి సారిస్తుంది.
ఇది అధ్యాపకులు తమ బోధనలో సృజనాత్మకత, పరిశ్రమ ఔచిత్యాన్ని పొందుపరచడంల సహకరిస్తుంది. విద్యార్థుల విషయంలో ప్రతి కళాశాల నుంచి 200 మంది విద్యార్థులకు (50 మంది చొప్పున నాలుగు బ్యాచ్‌లలో) నాలుగు రోజుల ఇంటెన్సివ్ బూట్ క్యాంప్‌లు నిర్వహించనుంది. ఇవి వాస్తవ ప్రపంచ ఇంజనీరింగ్ సవాళ్లతో కూడిన అనుభవాన్ని అందిస్తాయి. మరో 8 వారాల ప్రాజెక్ట్ ఆధారిత కార్యక్రమాలు సాంకేతిక, సాఫ్ట్ స్కిల్స్‌లో బలోపేతం చేస్తూ వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో విద్యార్థులను ప్రోత్సహిస్తుంది. 8 వారాల డీప్–డైవ్, టెక్నాలజీ ఆధారిత ప్రాజెక్టులను సైతం అందిస్తుంది.