పొలమే పర్యాటక స్థలం

Agri Tourism Development in Andhra Pradesh - Sakshi

అనంతపురం జిల్లా హంపాపురంలో ‘ఆదరణ’ పేరుతో అగ్రి టూరిజం

ఇతర జిల్లాల్లోనూ ప్రోత్సహించేందుకు సర్కారు ఏర్పాట్లు

సాక్షి, అమరావతి: వ్యవసాయం పర్యాటక సొబగులను అద్దుకోనుంది. సాగు క్షేత్రమే సందర్శనీయ స్థలంగా మారనుంది. వ్యవసాయాన్ని ప్రోత్స హించడంతో పాటు రైతులకు అదనపు ఆదాయ వనరుగా అగ్రి టూరిజం అభివృద్ధి చెందుతోంది. దేశంలోని ఆర్థిక వనరులను నగరాల నుంచి గ్రామాలకు పంపిణీ చేయడంలో కీలక భూమిక పోషిస్తోంది. దేశంలో ఇప్పటికే పలుచోట్ల సందర్శకులు పొలం గట్లపై నడిచేలా.. పొలం దున్నేలా.. పంట కోస్తూ ప్రకృతి ఒడిలో సేదతీరేలా వ్యవసాయ క్షేత్రాలు రూపుదిద్దుకున్నాయి. వ్యవసాయ విజ్ఞానాన్ని, వినోదాన్ని పర్యాటకులకు ఒకేచోట అందిస్తున్నాయి.

‘గెస్ట్‌–హోస్ట్‌’ ప్రాతిపదికన
దేశంలో అగ్రి టూరిజం గెస్ట్‌–హోస్ట్‌ ప్రాతిపదికన కొనసాగుతోంది. ఈ విధానంలో పొలం యజమానులే పర్యాటకులకు వ్యవసాయ క్షేత్రంలో భోజన వసతి కల్పిస్తారు. వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే సందర్శకులు రైతుల దైనందిన కార్యకలాపాల్లో పాలుపంచుకోవచ్చు. స్వయంగా సాగు విధానాలు తెలుసుకోవచ్చు. పొలం గట్లపై భోజనం చేస్తూ ఆహ్లాదాన్ని పొందొచ్చు. తద్వారా పర్యాటకులు స్థానిక ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, పండుగలు, ప్రకృతి పరిశీలన చేయడంతోపాటు చేపల వేట వంటి వ్యవసాయ ఆధారిత, అనుబంధ రంగాల్లోనూ ప్రావీణ్యం సంపాదించొచ్చు. 

ప్రకృతి ఒడిలో ‘ఆదరణ’
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపా పురం గ్రామంలో ‘ఆదరణ’ పేరుతో అగ్రి టూరిజం సెంటర్‌ నడుస్తోంది. అక్కడ పూర్తిగా ప్రకృతి వ్యవ సాయం చేస్తున్నారు. ఇక్కడే నేచురల్‌ ఫార్మింగ్‌కు సంబంధించి పాలిటెక్నిక్‌ కళాశాల కూడా ఉంది. ప్రత్యేక ప్యాకేజీతో పర్యాటకులు, పాఠశాల విద్యార్థులకు సంపూర్ణ వ్యవసాయ విధానాల్లో భాగస్వామ్యం కల్పిస్తున్నారు. ఎడ్లబండి నడపటం, మేకల పెంపకం, జీవామృతాల తయారీ, తిరగలి పిండి విసరడం, రోకలి దంచడం, వెన్న చిలకడం వంటి వ్యవసాయ, గ్రామీణ పనులతోపాటు గ్రామీణ క్రీడలతో ఆహ్లాదాన్ని పంచుతున్నారు. 

అగ్రి టూరిజాన్ని విస్తరిస్తాం..
రాష్ట్రంలో అగ్రి టూరిజాన్ని ప్రోత్సహించేందు కు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే పాడేరు ప్రాంతాల్లో ఇలాంటి విధానమే ఉంది. త్వరలో జంగారెడ్డిగూడెం ప్రాంతంలో వ్యవసాయ పర్యాటకాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నాం. 
–  ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి

సాగు అనుభూతి
పట్టణాల్లోని ప్రజలు, ఉద్యోగులు వారాంతాల్లో వినోదాన్ని, ఆహ్లాదాన్ని కోరుకుంటున్నారు. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని అగ్రి టూరిజం విధానాన్ని అభివృద్ధి చేస్తున్నాం. వీకెండ్‌ వ్యవసాయం చేయాలనుకునే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు ఇది కచ్చితంగా నచ్చుతుంది. 
– వరప్రసాద్‌రెడ్డి, చైర్మన్, ఏపీ టీడీసీ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top