ఇక కల్తీ పాలకు చెక్‌!

Adulteration in milk and milk products can be detected immediately - Sakshi

పులివెందులలో అత్యాధునిక స్టేట్‌–సెంట్రల్‌ ల్యాబ్‌

రూ.11కోట్లతో ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

పాలు, పాలఉత్పత్తుల్లో కల్తీని వెంటనే గుర్తించవచ్చు 

యాంటి బయోటిక్‌ అవశేషాలనూ కనిపెట్టవచ్చు

సాక్షి, అమరావతి: రోజుకు ఒక గ్లాసు పాలు తాగితే మనిషి శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అయితే, ప్రస్తుతం మార్కెట్‌లో తెల్లనివన్నీ పాలు అని నమ్మే పరిస్థితి లేదు. ఈ తరుణంలో వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన పాలను అందించాలనే లక్ష్యంతో సహకార పాల డెయిరీల్లో అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకువస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.

పులివెందులలోని ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ఆన్‌ లైవ్‌స్టాక్‌ (ఏపీ కార్ల్‌)లో రూ.11కోట్లతో స్టేట్‌–సెంట్రల్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేస్తోంది. ఈ ల్యాబ్‌ ద్వారా పాలు, పాల ఉత్పత్తుల్లో విషపూరిత రసాయనాలను గుర్తించి, నివారణకు చర్యలు చేపట్టనుంది.

నాణ్యత ఇలా... 
గేదె పాలల్లో 5.5 శాతం కొవ్వు, 8.7 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌ (ఘన పదార్థాలు), ఆవు పాలల్లో 3.2 శాతం కొవ్వు, 8.3 శాతం ఎస్‌ఎన్‌ఎఫ్‌ ఉంటే మంచి పోషక విలువలు ఉన్న పాలుగా పరిగణిస్తారు. ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే పాలల్లో స్వచ్ఛత ప్రశ్నార్థకంగా మారింది. రంగు, రుచి, చిక్కదనం కోల్పోకుండా ఉండేందుకు పాలల్లో వివిధ రకాల రసాయనాలను కలిపి కల్తీకి పాల్పడుతున్నారు. నాసిరకం దాణా వల్ల పాలు, పాల ఉత్పత్తుల్లో ప్రమాదకరస్థాయిలో విషపూరిత రసాయనాలు ఉంటున్నాయని పలు పరిశోధనల్లో గుర్తించారు.

కొందరు ఏకంగా ప్రమాదకర రసాయనాలతో కృత్రిమ పాలను తయారు చేస్తున్న విషయం పలుమార్లు వెలుగులోకి వచ్చింది. ఇటువంటి నాసిరకం, కల్తీ, నకిలీ పాల వల్ల వి­విధ రకాల క్యాన్సర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాలల్లో నాణ్యతను గుర్తించేందుకు రాజమహేంద్రవరం, జి.కొత్తపల్లి, ఒంగోలు, మదనపల్లి, పులివెందు­ల, అనంతపురం సహకార పాల డెయిరీల్లో అ­త్యా«దునిక పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా ఏపీ కార్ల్‌లో దేశంలోనే అతి పెద్ద స్టేట్, సెంట్రల్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తోంది.

మూడు నెలల్లో అందుబాటులోకి... 
ఏపీ కార్ల్‌లో ఇప్పటికే ల్యాబ్‌ ఏర్పాటు ప్రక్రియ పూర్తి కాగా, నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ కాలిబ్రేషన్‌ ల్యాబొరేటరీస్‌ నుంచి ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర పరిధిలోని శాంపిల్స్‌ను పరీక్షించేందుకు కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు పంపాల్సి వచ్చేది. ఒక్కో శాంపిల్‌కు రూ.2,500 నుంచి రూ.30వేల వరకు ఖర్చయ్యేది. పులివెందులలోని ల్యాబ్‌ అందుబాటులోకి వస్తే తక్కువ ఖర్చుతో ఏడాదికి 500 నుంచి 1,000 వరకు పరీక్షలు చేయవచ్చు.

ఈ ల్యాబ్‌లో ఎలక్ట్రానిక్‌ మిల్క్‌ ఎనలైజర్, బ్యాక్టీరియా, సోమాటిక్‌ సెల్‌ ఎనరైజర్, ఎఫ్‌టీఐఆర్‌ సాంకేతికత ఆధారిత పాల విశ్లేషణ పరికరం, ట్రిపుల్‌ ట్యాడ్రపుల్‌ మాస్‌ డిటెక్టర్‌తో ఎస్‌సీఎంఎస్, ఎఫ్‌ఐడీతో జీసీ ఎంఎస్, సోడియం పొటాషియం ఎనలైజర్, మెలమైన్‌ టెస్టింగ్‌ స్ట్రిప్, మఫిల్‌ ఫర్నేస్, ఆటో క్లాప్, డబుల్‌ డిస్టిలేషన్‌ యూనిట్, గెర్బర్‌ సెంట్రిప్యూజ్, అడల్టరెంట్‌ డిటెక్షన్‌ టెస్టింగ్‌ కిట్‌ వంటి పరికరాలు అందుబాటులో ఉంటాయి. సుమారు 15 మంది నిపుణులైన సిబ్బందిని నియమిస్తున్నారు. మూడు నెలల్లో ఈ ల్యాబ్‌ అందుబాటులోకి రానుంది.

రసాయన అవశేషాలను గుర్తించవచ్చు 
స్టేట్‌ సెంట్రల్‌ ల్యాబ్‌ సేవలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని పాల సహకార సంఘాలు, పాడి రైతులు, వాటా­దారులకు ఎంతో మేలు కలుగుతుంది. ఎగుమతులను పెంపొందించేందుకు వీలుగా పాలు, పాల ఉత్పత్తుల్లో పురుగుమందుల అవశేషాలు, యాంటీ బయోటిక్, పశువైద్య అవశేషాలు, భారీ లోహాలు, మైకో టాక్సిన్‌లు, వ్యాధి కారకాలను గుర్తించవచ్చు. భౌతిక, రసాయన, జీవ నాణ్యతను విశ్లేషించి ధ్రువీకరణ పత్రాలు పొందవచ్చు. కల్తీలకు పూర్తిగా చెక్‌ పెట్టవచ్చు.
– అహ్మద్‌ బాబు, ఎండీ, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కో–ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top