
10మంది అరెస్టు, మరో ఇద్దరి కోసం గాలింపు.. బొలేరో, రెండు బైక్‌లు, మూడు ఫోన్‌లు స్వాధీనం
గంజాయి విలువ రూ.44లక్షలు
సూళ్లూరుపేటలో 10 కిలోలు స్వాదీనం
అనకాపల్లి/సూళ్లూరుపేట: రాష్ట్రంలోని రెండు వేర్వేరు జిల్లాల్లో 850 కిలోల గంజాయిను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. పదిమందిని అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిపోలీస్ స్టేషన్ పరిధి వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒడిశా నుంచి కర్ణాటకకు బొలేరో వాహనంలో తరలిస్తున్న 840 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నక్కపల్లి పోలీస్‌స్టేషన్ సీఐ కె.కుమారస్వామి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీచేస్తుండగా, ఒక బొలెరో వాహనంలో 20 బ్యాగుల్లో 840 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.
దాని విలువ రూ.42 లక్షలు ఉంటుందన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం మామిడిపాలేనికి చెందిన సుక్రీ అర్జున్, డేగలపాలేనికి చెందిన వంతల సురేశ్, పెద్దపేటకు చెందిన కొదమ నాగరాజు, పాంగి అర్జునరావు కలిసి ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా అటవీప్రాంతాల్లో గంజాయి కొనుగోలుచేసి «డౌనూరు చెక్ పోస్ట్ వద్ద పోలీసులను తప్పించుకుని నర్సీపట్నం తీసుకొచ్చారని తెలిపారు.
అక్కడ నుంచి కర్ణాటకకు తరలించేందుకు పెద్దపేటకు చెందిన పాంగి అర్జునరావు, చింతపల్లికి చెందిన వంతల సురేశ్, రోలుగుంటకు చెందిన కైసర్ల దివాకర్, నక్కపల్లికి చెందిన యలమంచిలి రమణ సిద్ధమవుతుండగా పట్టుకున్నట్టు తెలిపారు. సుక్రీ అర్జున, కొదమ నాగరాజులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు.
సూళ్లూరుపేటలో ఆరుగురు అరెస్ట్
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు చేస్తున్న ఆరుగురిని బుధవారం పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 10 కిలోల గంజాయి, నాలుగు సెల్‌ఫోన్లు, బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్‌ను స్వాదీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా సీఐ మురళీకృష్ణ మాట్లాడుతూ షార్‌కు వెళ్లే మార్గంలోని చెంగాళమ్మ లేఅవుట్‌కు చెందిన కంపా చంద్రకాంత్ (28), విజయవాడ ఆర్‌ఆర్ పేటకు చెందిన అంకాల భరత్ కౌశల్ అలియాస్ కౌశిక్ (28), తడమండలం వెండ్లూరుపాడుకు చెందిన బూరగ తేజ (23), సూళ్లూరుకు చెందిన మొండెం శైలేష్ (21), తడమండలం అనపగుంటకు చెందిన పరింగి నరేంద్ర (30), సూళ్లూరు నాగరాజపురానికి చెందిన వేనాటి శ్రీ (20)ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. గంజాయి విలువ రూ.2 లక్షలు ఉంటుందన్నారు.