గ్రామీణులకు గృహ యోగం

జిల్లాకు 5,341 ఇళ్లు మంజూరు
ఫేజ్–2 కింద గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యం
10 నుంచి 17 వరకు ఊరూరా ప్రారంభోత్సవాలు
ఏర్పాట్లలో తలమునకలైన గృహ నిర్మాణ శాఖ అధికారులు
గ్రామీణ ప్రాంత ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం అమలులో భాగంగా రెండో విడతలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 10 నుంచి 17 వరకు ఊరూరా ప్రారంభోత్సవ కార్యక్రమాలు వేడుకగా నిర్వహించాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో యంత్రాంగం తలమునకలైంది.
అనంతపురం సిటీ/ శ్రీకంఠం సర్కిల్: నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో ఫేజ్–2 కింద జిల్లాకు 5,341 ఇళ్లు మంజూరయ్యాయని గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారి రాజశేఖర్ తెలిపారు. 24 మండలాల్లో వీటిని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 10 నుంచి ఇళ్ల నిర్మాణాలను పండుగ వాతావరణంలో మొదలుపెట్టేలా ప్రణాళిక రూపొందించారు.
తొలి విడతలో నగర, పట్టణ వాసులకు..
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ‘నవరత్నాలు’ అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తొలి విడతగా నగర పాలక సంస్థ సహా మున్సిపాలిటీలు, అహుడా పరిధిలోని మండలాల్లో ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఫేజ్–2 కింద గ్రామీణ ప్రాంత వాసులకు మాత్రమే అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పట్టాల రిజిస్ట్రేషన్, జాబ్‌కార్డుల లింక్, మ్యాపింగ్, ట్యాగింగ్ వంటి ప్రక్రియలన్నీ యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి.
అట్టహాసంగా కార్యక్రమాలు
కలెక్టర్ ఆదేశాల మేరకు నియోజకవర్గాల వారీగా ఫేజ్–2 ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించనున్నట్లు గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారి రాజశేఖర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏయే నియోజకవర్గాల్లోఎక్కడెక్కడ కార్యక్రమాలు నిర్వహించాలనే అంశానికి సంబంధించి ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. ఆయా నియోకజవర్గాల ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.
నియోజకవర్గాల వారీగా ఇళ్ల మంజూరు ఇలా..
ఫేజ్–2 కింద ఐదు నియోజకవర్గాల్లోని 24 మండలాల్లో ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టనున్నారు. నియోజకవర్గాల వారీగా మంజూరైన ఇళ్లను పరిశీలిస్తే..
గడువులోపు ఇళ్ల నిర్మాణాలు
జిల్లాలో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు రెండో దశ ఇళ్ల నిర్మాణ ప్రారంభోత్సవ వేడుకలు ఈ నెల పది నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ వీసీ హాలులో ఇళ్ల నిర్మాణాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వేసవిలో వ్యవసాయ పనులు ఉండవు కనుక ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకు వస్తారన్నారు. అధికారులు వారి సహకారంతో గడువులోపు ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఓటీఎస్ విషయంలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు సమన్వయంతో పని చేయాలన్నారు. నియోజక వర్గాల వారీగా ఎమ్మెల్యేల పర్యటనల నేపథ్యంలో అవసరమై ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ రాజశేఖర్, ఆన్‌సెట్ సీఈఓ కేశవనాయుడు, జెడ్పీ సీఈఓ భాస్కరరెడ్డి పాల్గొన్నారు.