అనంతపురం సిటీ: పదహారేళ్లు నిండకనే బిడ్డకు జన్మనిచ్చింది ఓ బాలిక. విశ్వసనీయ సమాచారం మేరకు.. యాడికి మండలానికి చెందిన బాలిక (16) పదో తరగతి వరకు చదివింది. కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో చేర్పించినా చదువు మానేసి, డ్రాపవుట్‌గా మిగిలిపోయింది. అమ్మానాన్న కూలీ పనులకు వెళ్తే, తను ఇంటి పట్టున ఉండేది. అమ్మమ్మ ఊరైన కర్నూలు జిల్లా మద్దికెరకు తరచూ వెళ్లొచ్చేది. ఈ క్రమంలో మద్దికెరకు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ దగ్గరవడంతో బాలిక గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోమంటే ఉద్యోగం వచ్చాక చేసుకుంటానంటూ రాజా దాటవేస్తూ వచ్చాడు. విషయం తెలిసినా 9 నెలలు నిండే వరకు కుటుంబ సభ్యులు కూడా గోప్యత పాటిస్తూ వచ్చారు.
బుధవారం స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీ వద్దకు బాలికను తీసుకెళ్లి ఐదు నెలల గర్భిణి అని చెప్పారు. గర్భవిచ్ఛిత్తికి మాత్రలు కావాలని అడిగిన వెంటనే అతను రాసిచ్చేశాడు. వాటిని ఇంటికి తీసుకెళ్లి మింగిన కాసేపటికి విపరీతమైన రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు భయపడిపోయారు. వెంటనే గ్రామ ఆశా వర్కర్ దృష్టికి తీసుకెళ్తే ఆమె మందలించి గుత్తిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. బాలిక పరిస్థితి చూసిన అక్కడి వైద్యులు అడ్మిట్‌కు నిరాకరించడంతో పాటు వెంటనే అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించాలని చెప్పడంతో బాలికను ఇక్కడికి తీసుకొచ్చి బుధవారం సాయంత్రం ఆస్పత్రిలో చేర్చారు. బాలిక అర్ధరాత్రి ఒంటిగంట తరువాత సాధారణ కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ హేమలత తెలిపారు.
రంగంలోకి అధికారులు
విషయం తెలిసిన వెంటనే ఐసీడీఎస్ ఇన్‌చార్జ్ పీడీ అరుణకుమారి, మిషన్ వాత్సల్య–మిషన్ శక్తి జిల్లా కో–ఆర్డినేటర్ బీఎన్ శ్రీదేవి, డీసీపీఓ మంజునాథ్, సఖి మేనేజర్ శాంతామణి, చైల్డ్‌లైన్ జిల్లా కో–ఆర్డినేటర్ కృష్ణమాచారి రంగంలోకి దిగారు. పోలీసులతో కలసి సర్వజనాస్పత్రికి చేరుకుని బాలికతో మాట్లాడారు. వివరాలు చెప్పేందుకు బాలిక అంగీకరించకపోవడంతో ఆమె తల్లిదండ్రులను సఖి సెంటర్‌కు పిలిపించి విచారించారు. మాయమాటలతో లొంగదీసుకొని, బాలికను తల్లిని చేసిన మద్దికెరకు చెందిన రాజాపై పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది.


