నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్–సుఖీభవ సొమ్ము
అనంతపురం అగ్రికల్చర్: పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ కింద ప్రస్తుత 2026–27కు సంబంధించి మొదటి విడతగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిసాయం కింద శనివారం సొమ్ము విడుదల చేయనున్నట్లు వ్యవసాయశాఖ జేడీ సాలురెడ్డి తెలిపారు. పీఎం కిసాన్ కింద 2,542,269 మంది రైతులకు రూ.2 వేల ప్రకారం రూ.50.85 కోట్లు, అలాగే సుఖీభవ కింద 2,75,642 మంది రైతులకు రూ.5 వేల ప్రకారం 137.82 కోట్ల్లు అందజేయనున్నారు. ఒక్కొక్కరికి రూ.7 వేల ప్రకారం రూ.188.67 కోట్లు విడుదల కానున్నట్లు తెలిపారు. కౌలు రైతులు, దేవదాయ, అటవీభూమి సాగుదారులకు కిసాన్–సుఖీభవ సొమ్ము అందే పరిస్థితి లేదు.
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాశాఖలోనే కీలక పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఉన్నవారికే రెండు, మూడు బాధ్యతలు అప్పగించడం విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభమైన అత్యంత కీలక సమయంలో మొత్తం ‘ఇన్‌చార్జ్ పాలన’లో నడుస్తుండటంపై ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముగ్గురి పని ఒక్కరికే
జిల్లాలో డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ పోస్టులు పూర్తిస్థాయి అధికారులతో కాకుండా ఇన్‌చార్జ్‌లతో నడుస్తున్నాయి. డీఈఓగా కొనసాగుతున్న శ్రీనివాసరావు ఒకేసారి డీఈఓ, అనంతపురం డిప్యూటీ డీఈఓ, విడపనకల్లు ఎంఈఓ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు కణేకల్లు ఎంఈఓ కృష్ణయ్య గుత్తి డిప్యూటీ డీఈఓ బాధ్యతలను కూడా చూస్తున్నారు. ఒకే అధికారి రెండు నుంచి మూడు బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుండటంతో ఏ పోస్టుకూ పూర్తిస్థాయిలో న్యాయం చేయలేని పరిస్థితి నెలకొంది.
కాగితాలపైనే పర్యవేక్షణ
పెద్దపప్పూరు, డి.హీరేహాళ్, గుమ్మఘట్ట, కుందుర్పి, బెళుగుప్ప, బొమ్మనహాళ్, కంబదూరు, రాయదుర్గం వంటి మండలాల్లో పూర్తిస్థాయి ఎంఈఓలు లేరు. యాడికి, గుమ్మఘట్ట, రాయదుర్గం మండలాల్లో ఎంఈఓ–2 పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. మండల విద్యా పరిపాలన, పాఠశాలల పర్యవేక్షణ, ఉపాధ్యాయుల జీతాల బిల్లులు, ప్రభుత్వ పథకాల అమలు వంటి బాధ్యతలు అన్నీ ఇన్‌చార్జ్‌ల భుజాలపై పడటంతో వ్యవస్థ స్తబ్దుగా మారింది.
స్కూల్ అసిస్టెంట్లే ఎంఈఓలు
బెళుగుప్ప, డి.హీరేహాళ్, గుమ్మఘట్ట, కంబదూరు, కుందుర్పి మండలాల్లో స్కూల్ అసిస్టెంట్లనే ఇన్‌చార్జ్ ఎంఈఓలుగా నియమించారు. దీంతో వారు పనిచేస్తున్న పాఠశాలల్లో ఆయా సబ్జెక్టల బోధనపై తీవ్ర ప్రభావం పడుతోంది. వారి స్థానాల్లో ప్రత్యామ్నాయ ఉపాధ్యాయులు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది.
హెచ్‌ఎంలపై రెట్టింపు భారం
కొన్ని మండలాల్లో ప్రధానోపాధ్యాయులే ఇన్‌చార్జ్ ఎంఈఓలుగా పనిచేస్తున్నారు. ఒకవైపు తమ పాఠశాల నిర్వహణ, మరోవైపు మండలంలోని అన్ని పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తోంది. రెండు వేర్వేరు వ్యవస్థలను ఒకేసారి పర్యవేక్షించడం ఆచరణలో అసాధ్యమని విద్యా శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
అడ్మిషన్లు, కిట్లు, పథకాల అమలుపై ప్రభావం
విద్యా సంవత్సరం ప్రారంభ దశలో అడ్మిషన్లు, పాఠ్యపుస్తకాలు, విద్యా కిట్లు, విద్యార్థుల హాజరు, మౌలిక వసతుల పరిశీలన వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కానీ ఖాళీ పోస్టులు, అదనపు బాధ్యతల కారణంగా ఈ కార్యక్రమాల అమలులో జాప్యం చోటుచేసుకుంటోందని సమాచారం.
‘ఆంధ్ర మోడల్’నా..
‘ఫెయిల్యూర్ మోడల్’నా?
విద్యారంగంలో సంస్కరణలు, నాణ్యమైన విద్య అంటూ ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ‘ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్’ అని గొప్పులు చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ‘ఫెయిల్యూర్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్’ అన్న చందంగా తయారైందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాలో కీలక పోస్టులన్నీ ఖాళీ
ఇన్‌చార్జ్‌ల అధీనంలో డీఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులు
8 మండలాల్లో లేని ఎంఈఓలు
మరో 3 మండలాల్లో ఎంఈఓ–2 పోస్టుల ఖాళీ
పర్యవేక్షణ లేక పరిపాలన గందరగోళం


