● ఒకచోట స్టే బోర్డుల తొలగింపు
● మరోచోట జేసీబీలతో నిర్మాణాల ధ్వంసం
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలంలోని రెండు కోర్టు వివాద భూముల్లో అక్రమ ప్రవేశం ఉద్రిక్తతలకు దారితీసింది. ఒకచోట హైకోర్టు స్టే ఉన్న భూమిలోకి ప్రవేశించి నోటీసు బోర్డులు తొలగించగా, మరోచోట జేసీబీలతో నిర్మాణాలను ధ్వంసం చేశారు. బాధితుల కథనం మేరకు.. అనంతపురం పట్టణంలోని 106–1 సర్వే నంబరు భూమిని గుర్తించి పిటిషనర్ శ్రావణ్ కుమార్‌కు అప్పగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే అధికారులు ఏమాత్రమూ సంబంధం లేని అనంతపురం రూరల్ మండలం పాపంపేట గ్రామం 106–1 సర్వే నంబరులోని 60 సెంట్ల భూమిని చూపించారని పట్నం శివప్రసాద్, మరికొందరు 2025 మార్చిలో కోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ భూమిలోకి ఎవ్వరూ ప్రవేశించరాదని స్టేకు సంబంధించిన నోటీసు బోర్డులను అక్కడ ఏర్పాటు చేశారు. అయితే సోమవారం సాయంత్రం శ్రావణ్‌కుమార్ అనే వ్యక్తి కొంతమంది కూలీలతో అక్కడికి వెళ్లి స్టే బోర్డులను తొలగించాడు. 2021, 2023లోని సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉటంకిస్తూ ‘ఎస్‌వీఆర్ ఇన్‌ఫ్రా అండ్ జీఎల్‌ఎన్ శ్రావణ్ కుమార్’ పేరిట కొత్త బోర్డులు ఏర్పాటు చేసి, చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి ప్రయత్నించాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న బాధితులు, స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడికి వచ్చిన కూలీలు వెనుదిరిగారు. అనంతరం పట్నం శివప్రసాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ‘ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కారం’ అని ఆరోపించారు. ఈ ఘటనపై ఇన్‌చార్జ్ సీఐ కరుణాకర్‌ను వివరణ కోరగా... ‘రెండు వర్గాలూ తమ ఆధారాలతో రావాలని చెప్పాం. అప్పటివరకు ఎవరూ భూమిలోకి వెళ్లొద్దని హెచ్చరించాం’ అని తెలిపారు.
కోళ్లఫారం భూమిలో ఘర్షణ
అనంతపురం రూరల్ మండలం కురుగుంట కోళ్లఫారం ప్రాంతంలో మరో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. 129–2బీ, 128–1, 127 సర్వే నంబర్లలో ఉన్న ఈ భూమి దశాబ్దాలుగా కోర్టు వివాదంలో ఉంది. 1983 సంవత్సరంలో 40 మంది ఎస్సీ కుటుంబాలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కోళ్లఫారాలు, నివాసాల కోసం ఈ భూమిని కేటాయించినట్లు స్థానిక దళిత కుటుంబాలు చెబుతున్నాయి. అయితే అంతకుముందే ఈ భూమి ఆదిఆంధ్ర ఓబులేసు అనే వ్యక్తికి ప్రభుత్వం కేటాయించిందని, ఆయన నుంచి మరో వ్యక్తి కొనుగోలు చేశాడని సమాచారం. తర్వాత ఆ భూమిని ప్రభుత్వం రద్దు చేసి.. తమకు కేటాయించిందని దళితులు వాదిస్తున్నారు. ఓబులేసు నుంచి భూమి కొనుగోలు చేసిన వ్యక్తి మనవడు రమేష్ కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇంకా తుది తీర్పు వెలువడలేదు. ఈ నేపథ్యంలో సోమవారం రమేష్ కొంతమందిని వెంటబెట్టుకుని జేసీబీలతో కోళ్లఫారం ప్రాంతంలోకి వెళ్లి నిర్మాణాలను తొలగించేందుకు ప్రయత్నించాడు. దీంతో కాలనీవాసులు ఒక్కసారిగా తిరగబడ్డారు. మాటామాటా పెరిగి పరస్పర దాడులకు దారి తీసింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. ఇరువర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నాయి. ఘటనపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జ్ సీఐ కరుణాకర్ తెలిపారు. కాగా కోర్టు స్టేలు, పెండింగ్ కేసులు ఉన్నప్పటికీ భూముల్లోకి ప్రవేశించి చర్యలకు దిగడం ఎలా సాధ్యమైందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
సీఐ కరుణాకర్‌తో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
పాపంపేట 106–1 సర్వే నంబరులోని స్థలంలో కోర్టు స్టే బోర్డులు తొలగించి, కొత్త బోర్డు ఏర్పాటు చేసిన దృశ్యం


