మండే ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి | - | Sakshi
Sakshi News home page

మండే ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి

May 19 2026 2:10 AM | Updated on May 19 2026 2:10 AM

వరుణ కటాక్షం కోసం ఎదురుచూపులు

అనంతపురం అగ్రికల్చర్‌: ‘మండే’ ఎండలు భయపెడుతున్నాయి. రెండు నెలలుగా గరిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతుండటంతో జనం సతమతమవుతున్నారు. జిల్లా అంతటా 41 నుంచి 43 డిగ్రీల మధ్య సూరీడు సెగలు కక్కుతుండటంతో జనానికి ముచ్చెమటలు పడుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ‘అనంత’ అగ్నిగుండంలా మండుతోంది. వేసవి అంటే ఎలా ఉంటుంది... వైశాఖ మాసం ఎండలు ఎలా ఉంటాయి... రోహిణీ కార్తె అంటే ఏమిటనేది ఈసారి జిల్లా వాసులకు అర్థమయ్యేలా సూరీడు ఓ స్థాయిలో ప్రతాపం చూపిస్తున్నాడు. గతంలో వారం రోజులు ఎండలు దంచికొడితే మధ్య మధ్యలో వరుణుడు అలా కాస్తంత చల్లబరిచే పరిస్థితి ఉండేది. ఈసారి వరుణుడు జాడ కనిపించడం లేదు. అక్కడక్కడా నాలుగైదు మండలాల్లో వర్షం కురిసినా జిల్లా అంతటా నమోదు కాలేదు. రెండు నెలలుగా ఉక్కపోత, వడగాల్పులతో ఇబ్బంది పడుతున్న జిల్లా వాసులు వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడప్పుడు ఇదిగో అదిగో అంటూ మేఘాలు ఊరిస్తున్నా చినుకు రాలడం లేదు. అసలే ‘ఎల్‌–నినో’ అంటూ హెచ్చరిస్తున్న నేపథ్యంలో వర్షాలు గతితప్పేలా ముందుగానే సంకేతాలు ఇస్తున్నాయి. వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నా... సూరీడు ధాటికి చినుకుల సవ్వడి కనిపించడం లేదు. సుదీర్ఘకాలం పాటు వేసవి కొనసాగుతుండటంతో జనంతో పాటు జంతుజాలం, పశుపక్షాదులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితు లు నెలకొన్నాయి. భూగర్భజలాలు అడుగంటిపోతుండటంతో తాగునీటితో పాటు పండ్లతోటలకు సాగునీటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

నీటి కోసం నిరసన

ఎమ్మెల్యే పరిటాల సునీత ఎదుట నిరసన తెలిపిన మహిళలు

ఖాళీబిందెలను లాక్కున్న అనుచరులు

ఆత్మకూరు: తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. ఈ క్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు ఆత్మకూరులో మహిళల నుంచి నిరసన సెగ తాకింది. శ్రీసత్యసాయి తాగునీటి పథకం కార్మికులు వేతనాల కోసం జిల్లా వ్యాప్తంగా సమ్మెలోకి వెళ్లారు. రెండు వారాలైనా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లూ చేయలేదు. దీంతో తాగునీటి కోసం కష్టాలు పెరిగిపోయాయి. ఎమ్మెల్యే పరిటాల సునీత సోమవారం ఆత్మకూరుకు వస్తున్నట్లు తెలియడంతో స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనుచరులు బిందెలు లాక్కుని, వారికి సర్దిచెప్పి.. ఆందోళన చేయకుండా చూడాలనుకున్నారు. అప్పటికి మిన్నకుండిపోయిన మహిళలు.. ఎమ్మెల్యే వచ్చినప్పుడు రెండు చోట్ల కాన్వాయ్‌ను ఆపి తాగునీటి ఇబ్బందులపై నిరసన తెలిపి.. సమస్యను ఏకరువు పెట్టారు. అనంతరం ఎమ్మెల్యే స్పందిస్తూ సమస్య పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement