అనంతపురం అగ్రికల్చర్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల హక్కులు కాలరాస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 322 ప్రతులను పీఏసీఎస్ ఉద్యోగులు సోమవారం దహనం చేశారు. జిల్లా వ్యాప్తంగా పీఏసీఎస్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా పీఏసీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులు, అసోసియేట్ ప్రెసిడెంట్ పి.హనుమంతరెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాసులు, కోశాధికారి ఎం.హనుమంతరెడ్డి తదితరులు మాట్లాడారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత ఫిబ్రవరిలో రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున సమ్మె చేపట్టామన్నారు. ఆ సమయంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కంటితుడుపుగా జీఓ 322 విడుదల చేసి అన్యాయం చేశారని మండిపడ్డారు. ఈ జీఓతో ఉద్యోగులకు న్యాయం జరిగే సూచనలు కనిపించడం లేదన్నారు. తమకు న్యాయం జరిగేలా మరో జీఓ విడుదల చేసే వరకూ వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
వైఎస్సార్‌సీపీ నేతల అరెస్ట్
యల్లనూరు: మండల కేంద్రంలోని తేరు వద్ద ఈ ఏడాది జనవరి 1న చోటు చేసుకున్న ఘర్షణకు సంబంధించి వైఎస్సార్‌సీపీ నేత, యల్లనూరు జెడ్పీటీసీ సభ్యుడు భోగాతి ప్రతాపరెడ్డి, జాఫర్, హాజీవలి, దొడ్లో ఓబులేసు, పెద్దిరెడ్డి, బాబు, సూర్య ప్రకాష్‌రెడ్డి తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు. వివరాలను సోమవారం వెల్లడించారు. నిందితులను న్యాయ స్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి
గుత్తి రూరల్: మండలంలోని బసినేపల్లి గ్రామ శివారున పొలంలో గుర్తు తెలియని వ్యక్తి (45) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సోమవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికుల సమాచారంతో సీఐ రామారావు, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. రైతు కొండేటి మల్లికార్జున పొలంలో కంపచెట్ల మధ్య పడి ఉన్న మృతదేహాన్ని వెలికి తీసి, స్థానిక ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతదేహం పడి ఉన్న ప్రదేశం పక్కనే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు 93460 10582, 93469 17082 కు సమాచారం ఇవ్వాలని కోరారు.
కాపర్ అపహరించే క్రమంలో...
మృతుడు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని కాపర్, ఆయిల్ అపహరించి తక్కువ ధరకు విక్రయిస్తూ జల్సా చేసుకునేవాడనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేశారు. మృతుడితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఆదివారం రాత్రి నుంచి సోమవారం వేకువజాము వరకూ బసినేపల్లి శివారులోని విద్యుత్ స్తంభాల పరిశ్రమ వద్ద తచ్చాడుతుండగా తాము చూసినట్లు పలువురు పేర్కొన్నారు. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు పరిశ్రమలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తే వెంటనే సెక్యూరిటీ సిబ్బంది గమనించి అక్కడి నుంచి పంపేశారన్నారు. ఈ క్రమంలోనే రైతు కొండేటి మల్లికార్జున పొలం వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసే క్రమంలో కరెంట్ షాక్‌కు గురై మృతి చెంది ఉంటాడని, ఈ ఘటనతో మిగిలిన ఇద్దరూ అక్కడి నుంచి ఉడాయించి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేశారు.
బొలెరో ఢీ.. విద్యార్థులకు గాయాలు
ములకలచెరువు: బొలెరో ఢీకొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... తిరుపతిలో చదువుకుంటున్న అనంతపురానికి చెందిన భాను ప్రకాష్, నంద్యాలకు చెందిన ఉదయ్ కిరణ్ ఆదివారం సెలవు కావడంతో అనంతపురానికి వెళ్లారు. సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన వారు... ములకలచెరువు మండలం వేపూరి కోట వద్దకు చేరుకోగానే వేగంగా దూసుకొచ్చిన బొలెరో ఢీ కొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానికులు 108లో చికిత్స కోసం వెంటనే మదనపల్లిలోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం భాను ప్రకాష్‌ను తిరుపతిలోని రుయాకు వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై ములకలచెరువు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


