అనంతపురం టౌన్: నూతన పింఛన్ల మంజూరును చంద్రబాబు ప్రభుత్వం అటకెక్కించింది. అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా కొత్త పింఛన్ల ఊసే లేదు. ఎప్పుడు మంజూరు చేస్తారో అఽధికారులకు సైతం స్పష్టత లేకపోవడంతో ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మంజూరు చేస్తామని ఆదేశాలు జారీ చేస్తే అర్హుల జాబితాను పంపుతాం... అంతవరకూ తామేమీ చేయలేమంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు చేతులెత్తేస్తున్నారు.
గతంలో అర్హతే ప్రామాణికంగా పింఛన్లు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా పింఛన్లు మంజూరు చేశారు. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉంటే ఎలాంటి కొర్రీలు లేకుండా పింఛన్లు మంజూరు చేశారు. 2019–24 మధ్య జిల్లా వ్యాప్తంగా 3.50 లక్షల మందికి పైగా పింఛన్లు అందుకునేవారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు వివిధ రకాల కారణాలు చూపి జిల్లాలో దాదాపు 75 వేల మందికి పైగా పింఛన్లు తొలగించారు. ప్రస్తుతం జిల్లాలో అన్ని రకాల పింఛన్లు 2.75 లక్షల మంది మాత్రమే ఉన్నారు. సామాజిక భద్రత పింఛన్ మొత్తాన్ని పెంచుతామంటూనే అర్హత ఉన్న వారి పింఛన్లను కట్ చేశారు. రీ వెరిఫికేషన్ పేరుతో జిల్లాలో 30 వేల మందికి పైగా దివ్యాంగుల పింఛన్లు తొలగించేశారు.
40 వేల మంది ఎదురుచూపు
జిల్లా వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. పింఛన్ల కోసం సచివాలయాల్లోనే 40 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లో సైతం దాదాపు 3 వేల మందికి పైగా అర్జీలు ఇచ్చారు. కొత్త పింఛన్ల మంజూరుపై చంద్రబాబు ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ప్రస్తుతం పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోతే స్పౌజ్ కోటాలో భార్యకు మాత్రమే పింఛన్ అందజేస్తున్నారు తప్పితే కొత్త పింఛన్లు మాత్రం మంజూరు చేయలేదు. పింఛన్‌కు కావాల్సిన అన్ని రకాల అర్హత ఉన్నా ఇవ్వకపోతే ఎలా అని అర్హులు ప్రశ్నిస్తున్నారు.
కొత్త పింఛన్లపై స్పష్టత లేదు
కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి జీఓలను విడుదల చేయలేదు. పింఛన్ల కోసం జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి పింఛన్ల మంజూరుపై స్పష్టత వస్తే లబ్ధిదారుల నివేదికలను ప్రభుత్వానికి పంపుతాం.
– శైలజ , పీడీ,
డీఆర్‌డీఏ
కొత్తవి ఇవ్వకపోగా వివిధ కారణాలతో 75 వేల పింఛన్ల రద్దు
జిల్లా వ్యాప్తంగా 40 వేల మందికి పైగా దరఖాస్తు
పింఛన్ల కోసం అధికారుల చుట్టూ అర్హుల ప్రదక్షిణ
అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం


