అనంతపురం అర్బన్: టీడీపీ అధినేత చంద్రబాబును మళ్లీ సీఎంను చేస్తేనే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయంటూ ఎన్నికల సమయంలో మభ్యపెట్టి అధికారం చేపట్టిన తర్వాత ఏ ఒక్క హామీనీ నెరవేర్చకుండా యువతను దగా చేశారంటూ ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్‌కుమార్ ధ్వజమెత్తారు. అనంతపురంలోని నీలం రాజశేఖరరెడ్డి భవన్‌లో శుక్రవారం జరిగిన ఏఐవైఎఫ్ నగర కమిటీ స్వరసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న ప్రభుత్వ పెద్దలు తగిన మూల్యం చెల్లించుకునేలా ఆందోళనలు, నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు శ్రీరాములు, లింగమయ్య, గాదిలింగప్ప, తదితరులు పాల్గొన్నారు.
నగర నూతన కమిటీ ఎన్నిక
ఏఐవైఎఫ్ నగర కమిటీ అధ్యక్షుడిగా ఆనంద్‌బాబు, రియాజ్‌ఖాన్, కార్యనిర్వాహక కార్యదర్శిగా బండారు తేజ, కోశాధికారిగా సి.రాంబాబును ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా బి.మన్సూర్, నాసిర్, నాగేష్, యువతేజ, ఉదయ, సహాయ కార్యద్శులుగా లిఖిల్, రాజశేఖర్, మన్సూర్, గణేష్‌తో పాటు మరో 19 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అలాగే బాలల సంఘం నగర అధ్యక్షుడిగా కె.సంతోష్, 67 మంది సమితి సభ్యులను ఎన్నుకున్నారు.
వీఆర్వో సస్పెన్షన్
తాడిపత్రి రూరల్: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సజ్జలదిన్నె వీఆర్వో రామకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఉత్తర్వులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఈ నెల 2న జారీ చేసినట్లు తహసీల్దార్ కార్యాలయ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఓ రైతుకు చెందిన భూమిని ఆన్‌లైన్‌లో ఎక్కించేందుకు గత నెల 29న వీఆర్వో రామకృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే.
చైన్ స్నాచర్ అరెస్ట్
శింగనమల(నార్పల): ఈ నెల 5న నార్పలలోని సుల్తాన్‌పేటలో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడిన బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డికి చెందిన రాయల తరేష్‌ని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు నార్పల పీఎస్ ఎస్‌ఐ సాగర్ తెలిపారు. వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. ఒంటరిగా వెళుతున్న మహిళలకు కత్తి చూపి బెదిరించి, వారి మెడలోని బంగారు గొలుసులను లాక్కొని ఉడాయించేవాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 5న సుల్తాన్‌పేటలో ఒంటరిగా వెళుతున్న నంద్యాల నరసమ్మ మెడలోని బంగారు గొలుసు లాక్కొని ఉడాయించాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పక్కా ఆధారాలతో శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని బంగారు గొలుసు, ద్విచక్ర వాహనం, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
హోంగార్డులపై వేటుకు
రంగం సిద్ధం
గుత్తి: స్థానిక పీఎస్ పరిధిలో పని చేస్తున్న ముగ్గురు హోంగార్డులపై వేటుకు పోలీసు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వారిని అనంతపురం హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ అయ్యాయి. వ్యభిచార నిర్వాహకులతో సన్నితంగా ఉంటూ అవినీతి, అక్రమాలు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారనే కారణంతో హెడ్ క్వార్టర్స్‌ను నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం.


