మొదటి హత్యను బయటపెట్టిన రెండో హత్య | - | Sakshi
Sakshi News home page

మొదటి హత్యను బయటపెట్టిన రెండో హత్య

May 9 2026 7:38 AM | Updated on May 9 2026 7:38 AM

దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన సంచలనాలు

రాప్తాడు రూరల్‌: ఓ హత్య కేసు దర్యాప్తులో అంతకు ముందు చేసిన హత్య బయటపడడంతో పోలీసులు అవాక్కయ్యారు. వివరాలను రాప్తాడు సీఐ వెంకటేశులు శుక్రవారం వెల్లడించారు. అనంతపురం రూరల్‌ మండలం సిండికేట్‌నగర్‌లో నివాసం ఉంటున్న రాధ (53), చెరుకూరి ఆదినారాయణ కొంతకాలంగా సహజీవనం సాగిస్తున్నారు. రాధ కుమారుడు సందీప్‌కుమార్‌ చౌదరి తన భార్యతో కలిసి బెంగళూరులో నివాసముంటున్నాడు. అలాగే కుమార్తె కూడా భర్తతో కలసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇటీవల రాధ, ఆదినారాయణ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో గత నెల 16న ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఆదినారాయణ టవల్‌ తీసుకుని రాధ మెడకు బిగించి హతమార్చాడు. అనంతరం ఆమె మొబైల్‌ తీసుకుని ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. మరుసటి రోజు బెంగళూరులో ఉన్న రాధ కోడలికి, హైదరాబాద్‌లో ఉంటున్న కుమార్తెకు ఫోన్‌ చేసి రాధ మృతి చెందినట్లుగా తెలపడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఆ సమయంలో కుమారుడు సందీప్‌కుమార్‌ చౌదరి ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి, ఆదినారాయణ కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం సిండికేట్‌ నగర్‌లో తచ్చాడుతుండగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

అసలు కథ వెలుగులోకి

ఆదినారాయణను విచారణ చేయడంతో సంచనాలు వెలుగు చూశాయి. వివాహేతర సంబంధం రాధ భర్త రవిచంద్రనాయుడు పసిగట్టి ఇద్దరినీ మందలించడంతో ఆదినారాయణ, రాధ ఇద్దరూ కలిసి 2025 మే 20న రాత్రి రవిచంద్రనాయుడిని హతమార్చారు. నిద్రలో ఉన్న సమయంలో ముఖంపై దిండు అదిమి ఊపిరాడకుండా చేసి చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. హత్య అనంతరం అనారోగ్యంతో మృతి చెందినట్లుగా పిల్లలను నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసేశారు. అప్పటి నుంచి రవిచంద్రనాయుడు హత్య ఉదంతం వెలుగు చూడలేదు. తాజా దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆదినారాయణపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. రూరల్‌ తహసీల్దార్‌, వైద్యులు, అసిస్టెంట్‌ సైంటిఫిక్‌ టీం సమక్షంలో శుక్రవారం రవిచంద్రనాయుడు మృతదేహాన్ని వెలికితీయించి పంచనామా నిర్వహించారు. ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం అస్థికలను సేకరించి ల్యాబ్‌కు పంపారు.

Advertisement
 
Advertisement
Advertisement