బొమ్మనహాళ్: జిల్లాలో వరి పంట కోతలు ప్రారంభమయ్యాయి. హెచ్చెల్సీ పరిధిలోని కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాలతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం రైతులకు శాపంగా మారింది.ఏ గ్రేడ్ వరి ధాన్యం క్వింటాల్ రూ.2,389, బీ గ్రేడ్ ధాన్యం క్వింటాల్ రూ.2,369 మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించి చేతులు దులుపుకోవడం గమనార్హం.
రంగంలోకి దళారులు
రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం చూపుతున్న అలసత్వాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న దళారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయదంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా తక్కువ ధరకు సేకరిస్తారంటూ మాయమాటలు చెబుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో క్వింటా రేటు కూడా తక్కువగా ఉందని, ఒక వేళ ఆ రేటుకే కొనుగోలు చేసినా డబ్బు ఎప్పుడో జమ చేస్తారని ప్రచారం సాగిస్తుండడంతో దిక్కుతోచని రైతులు వారికే ధాన్యాన్ని తెగనమ్ముకుంటున్నారు.
వ్యయం అధికం.. మిగిలేది శూన్యం
జిల్లా మొత్తంగా 26,100 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా.. అందులో కణేకల్లు, బొమ్మనహాళ్, గుమ్మఘట్ట, డి.హీరేహాళ్ మండలాల్లోనే 10,692 ఎకరాల్లో సాగైంది. అన్నదాతలు ఆరుగాలం చెమటోడ్చినా ఇటీవల పంటలో ఆశించిన దిగుబడి రావడం లేదు. సాధారణంగా ఎకరా పొలంలో నారు పోసినప్పటి నుంచి ధాన్యం ఇల్లు చేరే వరకూ రైతులకు రూ. 50,400 ఖర్చవుతోంది. ఈ క్రమంలో ఎకరాకు 40 నుంచి 50 బస్తాల ధాన్యం పండితే గిట్టుబాటవుతుంది. కానీ, 22 నుంచి 25 బస్తాలలోపే దిగుబడి ఉంటుండడంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదు. దీంతో పొలాల్లో పంట పెట్టడం కంటే బీడు పెట్టుకోవడమే మేలనే మాట రైతుల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు మద్దతు ధరను రూ. 2,500– రూ. 2,700కు పెంచి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
జిల్లాలో వరి పంట కోతలు ప్రారంభం
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని చంద్రబాబు ప్రభుత్వం
ఆర్భాటంగా మద్దతు ధర
ప్రకటించి చేతులెత్తేసిన వైనం
దళారుల పాలవుతున్న రైతు కష్టం


