సాక్షి టాస్క్‌ఫోర్స్: మండలంలోని సొల్లాపురం గ్రామంలో టీడీపీ నేత దౌర్జన్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. సొల్లాపురం నుంచి కౌకుంట్లకు వెళ్లే మార్గంలో పూర్వం ఉన్న రెండు బావులు పాడుబడి పోవడంతో 15ఏళ్ల క్రితం ఉపాధిహామీ పథకం కింద మట్టిని తరలించి పూడ్చేయడంతో సువిశాలమైన గ్రామ కంఠం అందుబాటులోకి వచ్చింది. ఈ స్థలాన్ని అక్కడే ఉన్న సీతారామాంజనేయస్వామి, వేంకటేశ్వరస్వామి ఆలయాల ఉత్సవాల సమయంలో, శుభకార్యాలు జరిగినప్పుడు స్థానికులు వంటలు వండి భోజనాలు చేసేందుకు వాడుకుంటున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక టీడీపీ నేత వెంకట్రామిరెడ్డి ఆ స్థలాన్ని కబ్జా చేసి, ఇంటి నిర్మాణ పనులు చేపట్టాడు. ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా జాగ్రత్త పడ్డాడు. గ్రామ సర్పంచ్‌గా వైఎస్సార్‌సీపీ నాయకుడు భాస్కరరెడ్డి సతీమణి మహేశ్వరీ పదవీకాలంలో పూర్తి అయ్యే వరకూ వేచి ఉండి, ఆ తర్వాత పక్కా ప్లాన్ ప్రకారం మేరకు పనులు చేపట్టాడు. అధికారులు ఇప్పటికై నా స్పందించి గ్రామ కంఠం భూమిని కాపాడి ప్రజావసరాలకు వినియోగపడేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కేఎఫ్‌ఆర్ వర్సిటీతో
జేఎన్‌టీయూ ఒప్పందం
అనంతపురం: అంతర్జాతీయ స్థాయి పోటీకి దీటుగా విద్యా ప్రమాణాలు పెంపుదల చేసేలా జర్మనీలోని కేఎఫ్‌ఆర్ యూనివర్సిటీతో జేఎన్‌టీయూ(ఏ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు రెండు వర్సిటీల ప్రతినిధులు అవగాహన ఒప్పంద పత్రాలను శుక్రవారం మార్చుకున్నారు. ఈ సందర్భంగా జేఎన్‌టీయూ వీసీ డాక్టర్ హెచ్.సుదర్శనరావు మాట్లాడుతూ.. ఉన్నత విద్యా రంగంలో అంతర్జాతీయ సహకారాల ప్రాముఖ్యత పెంపొందించేలా రెండు విశ్వవిద్యాలయాల మధ్య పరస్పర సహకారం అందిపుచ్చుకోనున్నట్లు తెలిపారు. జర్మనీలోని ఆ విశ్వవిద్యాలయ నాలెడ్జ్ ఫౌండేషన్ సీఈఓ డేనియల్ గీగిస్ వర్చువల్‌గా మాట్లాడుతూ.. జేఎన్‌టీయూ(ఏ)తో చేసుకున్న ఒప్పందం మేరకు ముందుకు సాగుతామని పేర్కొన్నారు. అలాగే, ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీతో అన్ని విధివిధానాలను ఖరారు చేస్తామని తెలిపారు. జర్మనీ వర్సిటీ ప్రతినిధులు రాజ్ వంగపండు, శ్యామ్ సుందర్, జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ఎస్. కృష్ణయ్య, డీఏపీ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, అడ్మిషన్లు – విదేశీ వ్యవహారాల డైరెక్టర్ ఎ.సురేష్‌బాబు, ప్రొఫెసర్ భానుమూర్తి , ఓఎస్డీటూ వీసీ ప్రొఫెసర్ ఓ.దేవన్న పాల్గొన్నారు.


