చేతిపంపులపై నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

చేతిపంపులపై నిర్లక్ష్యం

Apr 6 2026 7:36 AM | Updated on Apr 6 2026 7:36 AM

ఉరవకొండ: ఉమ్మడి అనంతపురం జిల్లాలో చేతి పంపుల నిర్వహణ అటకెక్కింది. పలు గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో 14 వేలకు పైగా చేతి పంపులు ఉన్నాయి. ఇందులో 9,200 చేతి పంపులు మరమ్మతుకు గురయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి మరింత తీవ్ర రూపం దాల్చింది. కొళాయిల ద్వారా నీటి సరఫరా కాకపోతే ఇక చేతిపంపులే దిక్కు. అయితే చాలా చోట్ల చేతిపంపులు మరమ్మతుకు నోచుకోక అలంకారప్రాయంగా మారాయి. దీంతో నీటి కోసం ప్రజలు ఎడ్ల బండ్లు, ద్విచక్ర వాహనాలపై వ్యవసాయ తోటలు, బోరుబావులు బోర్ల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

మెకానిక్‌ల కొరతతో...

అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల పరిధిలో 2,530 చేతి పంపులు ఉన్నాయి. ఇందులో 1064 మరమ్మతుకు నోచుకోకపోవడంతో నిరుపయోగంగా మారాయి. కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో సత్యసాయి శ్రీరామిరెడ్డి తాగునీటి పథకాల ద్వారా తాగునీరు సరఫరా అవుతుంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి తాగునీటి పథకంలో పనిచేసే కార్మికులకు సక్రమంగా జీతాలు చెల్లించకపోవడంతో వారు కుడా ఏక్షణంలోనైనా సమ్మె బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కార్మికులు సమ్మెలోకి వెళితే ఆయా గ్రామాల్లో తాగునీటి కటకట తప్పదు. దీన్ని దృష్టిలో ఉంచుకోని చేతిపంపులు మరమ్మతు చేయించాల్సి ఉంది. అనంతపురం జిల్లాలోనే 5 వేల వరకు చేతిపంపులు మూలన పడ్డాయి. ఇందుకు ప్రధాన కారణం చేతిపంపులు మరమ్మతు చేయాల్సిన మోకానిక్‌లు కొరత పట్టిపీడిస్తోంది. చాలా ప్రాంతాల్లో గత్యంతరం లేక గ్రామీణులే చందాలు వేసుకొని చేతి పంపులను మరమ్మతు చేయించుకుంటున్నారు.

అధికారులు దృష్టి సారిస్తేనే..

గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాలు లేని ప్రాంతాల్లో చేతిపంపులే దిక్కు. చాలా చోట్ల చిన్నపాటి మరమ్మతు చేస్తే నీరు సమృద్ధిగా వచ్చే పంపులు ఉన్నాయి. వాటిని అధికారులు మరమ్మతు చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటి వరకు తాగునీటి సమస్య అత్యధికంగా ఉన్న గ్రామాలు ఎన్నో గుర్తించడంలోనూ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు.

ఎండలు మండిపోతున్నాయి. జలాశయాలు, చెరువుల్లోనూ నీటి మట్టం రోజు రోజుకూ తగ్గుతోంది. దీంతో భూగర్భ జలాలు కూడా అడుగంటి పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని చేతి పంపుల మరమ్మతుపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో గ్రామాల్లో తాగునీటి ఎద్దడితో ప్రజలు అల్లాడిపోతున్నారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో

14 వేలకు పైగా చేతి పంపులు

నిరుపయోగంగా ఉన్న వాటి సంఖ్య 9,200

చేతి పంపుల మరమ్మతుపై

దృష్టి పెట్టని అధికారులు

పలు గ్రామాల్లో నీటి ఎద్దడితో

ప్రజల ఇబ్బందులు

మరమ్మతుకు చర్యలు

గ్రామాల్లో మరమ్మతుకు నోచుకోని చేతిపంపులను గుర్తించి, వాటికి వెంటనే మరమ్మతు చేయిస్తాం. చేతిపంపుల మరమ్మతు చేసే మోకానిక్‌ల కొరతను అధికమించి ప్రత్యేక నిధులు కేటాయించి దశల వారీగా మరమ్మతు పనులు చేయిస్తాం. గ్రామాల్లో చేతిపంపుల నిర్వహణ ఎంతో అవసరంగా మారింది. వేసవిని దృష్టిలో ఉంచుకోని చేతిపంపులు మరమ్మతు చేయిస్తే ప్రజలకు ఎంతో ఊరట కల్గుతుంది. – సురేష్‌,

ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌, అనంతపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement