● జడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ
అనంతపురం టౌన్: అణగారిన వర్గాల సమానత్వం కోసం కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్‌రామ్.. అలాంటి మహోన్నత వ్యక్తి అడుగు జాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైన ఉందని ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్‌రామ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ సుదీర్ఘకాలం పాటు ప్రజాప్రతినిధిగా దేశానికి సేవలను అందించారని కొనియాడారు. దేశ కార్మిక, రక్షణశాఖ మంత్రిగా పనిచేయడంతో పాటు దేశ ఉప ప్రధానిగా పని చేశారన్నారు. దళితులకు సమాన హక్కులను తీసుకురావడం కోసం ఉద్యమాలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరు పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. దళితుల హక్కుల కోసం పార్లమెంట్‌లో తన వాణి ఘనంగా వినిపించి రెండు కుండల వ్యవస్థను రూపుమాపిన మహోన్నత వ్యక్తి జగ్జీవన్‌రమ్ అన్నారు. మాజీ మేయర్ వసీంసలీం మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ ఆశయ సాధనకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతగానో కృషి చేశారన్నారు. అందులో భాగంగానే బడుగు బలహీన, అణగారిన వర్గాల ప్రజలకు చట్టసభల్లో స్థానం కల్పించారన్నారు. చంద్రాబు ప్రభుత్వంలో దళితులకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.


