అనంతపురం ఎడ్యుకేషన్: అనాథ, పేద విద్యార్థినులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న కేజీబీవీ టీచర్ల గౌరవాన్ని కాపాడాలని కేజీబీవీ టీచర్ల ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు కె.విజయగౌరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో కేజీబీవీ టీచర్ల సంఘం విస్త్రత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు శ్రీరేఖ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విజయగౌరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మనం సంఘటిత విద్యారంగంలో అసంఘటిత ఉద్యోగులుగా ఉన్నామన్నారు. అన్ని ప్రాంతాల్లో కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. వేతనాలు మిగుల్చుకోవడం ఒక భాగమైతే, హక్కులు, జీఓలు, చట్టాలు కాంట్రాక్టు విధానం అనే పేరుతో అమలు కాకుండా చేయడం మరో కుట్రన్నారు. పెరగాల్సిన వేతనాలు 2017 నుంచి నిలుపుదల చేశారన్నారు. మినిమం టైం స్కేలు అమలు చేస్తామని ఇచ్చిన జీఓలను అమలు చేయలేదన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం 352 కేజీబీవీల్లో పపనిచేస్తున్న 4,700 మందిని రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కేజీబీవీ టీచర్స్ అసోసియేషన్ నాయకులు అంపమ్మ, జ్యోతి, పార్వతి, దేవేంద్రమ్మ పాల్గొన్నారు. చివరగా అనంతపురం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షరాలుగా అంపమ్మ, ప్రధాన కార్యదర్శి జ్యోతి, 15 మంది కమిటీ సభ్యులను ఎంపిక చేశారు.


