7, 8న కౌలు రైతు సంఘం మహాసభలు | - | Sakshi
Sakshi News home page

7, 8న కౌలు రైతు సంఘం మహాసభలు

Apr 6 2026 7:36 AM | Updated on Apr 6 2026 7:36 AM

ఉరవకొండ రూరల్‌: ఉరవకొండలో ఈ నెల 7, 8 న ఏపీ కౌలురైతు సంఘం మూడో జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి బాలరంగయ్య తెలిపారు. ఆదివారం పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కౌలు రైతులకు ఇచ్చిన హామీలు, నూతన కౌలు చట్టం అమలు, అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు వర్తించేలా చంద్రబాబు ప్రభుత్వంపై ఈ మహాసభలలో ఒత్తిడి తెస్తామన్నారు. అలాగే అధికారులు కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వకుండా బ్యాంకుల చుట్టూ తిప్పుకోవడం దారుణమన్నారు. కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణ ఆధ్వర్యంలో జరిగే మహాసభల్లో కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పెద్దముష్టూరు వెంకటేష్‌, మండల నాయకుడు సుంకన్న పాల్గొన్నారు.

రాయలసీమ ద్రోహి చంద్రబాబు

తాడిపత్రిటౌన్‌: జలహారతి పేరుతో సీఎం చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్‌ చేస్తున్నారు తప్పితే రాయలసీమ రైతులకు ఆయన చేసిందేమి లేదని రాయలసీమ యునైటెడ్‌ ఫోరం అధ్యక్షుడు తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డి మండిపడ్డారు. తాడిపత్రి పట్టణంలోని యల్లనూర్‌రోడ్డులోని తన కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాడిపత్రి నియోజకవర్గంలోని చాగల్లు, పెండేకల్లు రిజర్వాయర్ల ద్వారా ఇప్పటివరకూ రైతులకు నీళ్లిచ్చిన దాఖలాలు లేవన్నారు. తాడిపత్రి బ్రాంచ్‌ కెనాల్‌కు నీళ్లు రావడం లేదని ఇక్కడి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చెబుతున్నా ఏనాడు చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను ఆపి చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా మిగిలారన్నారు. దాదాపు 80 శాతం పనులు పూర్తయిన లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను పూర్తి చేయకుండా ఎందుకు ఆపారో చెప్పాలని ప్రశ్నించారు. తుంగభద్ర సమాంతర కాలువ ఎందుకు నిర్మిచడం లేదని, అప్పర్‌ తుంగభద్రతో తుంగభద్ర డ్యాం ఎడారి మారే ప్రమాదం ఉందని ఉద్యమాలు చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలన్నారు. కనీసం మీరు శంకుస్థాపన చేసిన గుండ్రేవుల వంటి ప్రాజెక్ట్‌ను ఎందుకు నిర్మించడం లేదని, గోబ్యాక్‌ చంద్రబాబుంటూ ధ్వజమెత్తారు.

తండ్రి, కుమార్తె ఆచూకీ లభ్యం

బుక్కరాయసముద్రం: మండల పరిఽధిలోని కేకే అగ్రహారంలో ఓ బాలిక, ఆమె తండ్రి ఈ నెల 3న ఇంటి నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే వారికి ఆచూకీ లభించినట్లు బీకేఎస్‌ పోలీసులు తెలిపారు. కేకే అగ్రహారం గ్రామంలో బాలికను అదే గ్రామానికి చెందిన సురేష్‌ తీసుకెళ్లాడు. ఆవేదనకు గురైన బాలిక తండ్రి కూడా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా బీకేఎస్‌ సీఐ పుల్లయ్య కేసు నమోదు చేసుకొని రెండు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే బాలిక తండ్రి అనంతపురం నగరంలో ఉన్నట్లు గుర్తించారు. అలాగే బాలిక కూడా నగరంలోనే ఉన్నట్లు తేల్చారు. బాలికను బాలికా సంరక్షణ కేంద్రానికి తరలించారు. సురేష్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌

పోటీలకు ఎంపిక

రొద్దం: మండల పరిధిలోని తురకలాపట్నం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బి.చేతన్‌ జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల హెచ్‌ఎం వెంగప్ప, పీఈటీ రామకృష్ణ తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో పులివెందులలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో చేతన్‌ అద్భుత ప్రతిభ కనబరచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్‌ 15 నుంచి 20 వరకూ న్యూఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో చేతన్‌ పాల్గొంటాడని తెలిపారు. పోటీల్లో మన రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నట్లు వివరించారు. ఎంపికై న విద్యార్థి చేతన్‌ను పాఠశాల ఉపాధ్యాయు బృందం అభినందించింది. జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు.

బిల్‌ కలెక్టర్‌పై

టీడీపీ నాయకుల దాడి

గుమ్మఘట్ట: మండలంలోని మారెంపల్లి గ్రామంలో బిల్‌ కలెక్టర్‌ రమేష్‌పై గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఆంజనేయ, అతని కుమారుడు సురేష్‌ (ఫీల్డ్‌ అసిస్టెంట్‌) దాడి చేసి గాయపరిచారు. వివరాల్లోకి వెళిలే... మారెంపల్లికి చెందిన ఆంజనేయకు రెండు విద్యుత్‌ సర్వీసులు ఉన్నాయి. అయితే చిల్లర సమస్య తలెత్తడంతో రూ.30 అదనంగా డబ్బు తీసుకొని, వచ్చే నెల బిల్లు నుంచి రూ.30 మినహాయిస్తానని చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆంజనేయ, సురేష్‌ బిల్‌కలెక్టర్‌ రమేష్‌పై దాడిచేసి గాయపరిచారు. స్థాఽనికులు చికిత్స నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement