గుత్తి రూరల్: మండలంలోని ఊటకల్లు వద్ద శనివారం ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు బోల్తాపడింది. ఘటనలో ఓ విద్యార్థి గాయపడగా, మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు తెలిపిన మేరకు... గుత్తి ఆర్‌ఎస్‌లోని చంద్రప్రియ నగర్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుకుంటున్న కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని విద్యార్థుల కోసం యాజమాన్యం ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించింది. ఈ నేపథ్యంలో శనివారం తొలుత కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఉప్పరపల్లి, రొళ్లపాడు తండా తదితర గ్రామాల నుంచి పిల్లలను ఎక్కించుకుంటూ గుత్తి మండలం ఊటకల్లు విద్యార్థుల కోసం బస్సు బయలుదేరింది. ఊటకల్లు గ్రామ శివారుకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో రోడ్డుకు అడ్డుగా ఉన్న కుక్కలను గమనించగానే బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. రొళ్లపాడు తండాకు చెందిన జెనిధర్ (4వ తరగతి) గాయపడ్డాడు. మరో విద్యార్థితో పాటు డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. బస్సులో ఇరుకున్న మరో ఇద్దరు విద్యార్థులను డ్రైవర్ సాయంతో స్థానికులు వెలికి తీశారు. క్షతగాత్రులను గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


