కదం తొక్కిన కార్మిక, కర్షక లోకం
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కన్నెర్ర
● మోదీ, చంద్రబాబు తీరుపై మండిపాటు
అనంతపురం అర్బన్: కార్మిక, రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సత్తా చూపిస్తామని కార్మిక, రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం జిల్లావ్యాప్తంగా కార్మిక, రైతు సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతపురం నగరంలో ఏఐటీయూసీ, సీఐటీయూ, వైఎస్సార్‌టీయూ, ఐఎఫ్‌టీయూ, మునిసిపల్, ఎల్‌ఐసీ, బ్యాంక్, హమాలీ, రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక, రైతు కూలీ తదితర సంఘాల నాయకులు క్లాక్‌టవర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు మాస్క్‌లు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు.
వ్యతిరేక విధానాలపై మండిపాటు
టవర్‌క్లాక్ వద్ద సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్, మేయర్ సలీం, సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, రాష్ట్ర కార్యదర్శి జాఫర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌వీనాయుడు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, సీపీఎం నగర కార్యదర్శి రామిరెడ్డి, సీపీఐఎంఎల్ లిబరేషన్ కార్యదర్శి వేమన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ కార్మికుల హక్కులను కాలరాస్తోందని దుమ్మెత్తిపోశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకొచ్చి యాజమాన్యాలకు కార్మికులను బానిసలుగా మారుస్తోందని విమర్శించారు. లేబర్ కోడ్లు అమలైతే కార్మికులు చట్టపరమైన హక్కులన్నీ కోల్పోతారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక నిర్ణయాలకు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మద్దతునిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఎనిమిది గంటల పనివేళలను 12 గంటలకు మార్చడం కార్పొరేట్ యాజమాన్యాలకు కార్మికుల శ్రమను దోచిపెట్టడమేని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయని, పంటలకు మద్ధతు ధరలు కల్పించడం లేదని విమర్శించారు. ఇటీవల అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందం కార ణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి వీబీ జీ రామ్‌జీ పథకం తీసుకొచ్చి వ్యవసాయ కార్మికులకు తీరని అన్యాయం చేశారన్నారు. లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వాలే కొనుగోలు చేయాలని, వీబీ–జీ– రామ్‌జీ పథకాన్ని రద్దు చేసి ఉపాధి చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మిక, రైతు సంఘాల నాయకులు రాజేష్‌గౌడ్, రమణ, గోపాల్, వెంకటనారాయణ, నాగరాజు, ముత్తుజా, పద్మావతి, జయలక్ష్మి, లక్ష్మిదేవి, తదితరులు పాల్గొన్నారు.


