ఆలయాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు
● కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్
అనంతపురం అర్బన్: ‘బ్రహ్మోత్సవాలు, జాతరలు, పర్వదినాల్లో దేవాలయాల వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలి. పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, మునిసిపల్, పంచాయతీ శాఖలు సమన్వయంతో పనిచేయాలి’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. ఆలయాల వద్ద బారికేడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ పి.జగదీష్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా ఆలయాల వద్ద భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, ఇందుకు తగ్గట్టుగా భద్రత ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రధాన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని వర్గాలు, మతాల వారు మతసామరస్యంతో ఉండేలా చూడాలన్నారు. రంజాన్ వేడుకలు, క్రైస్తవ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేవదాయ, మైనారిటీ శాఖ అధికారులు, ఈఓలు, పోలీసులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. మసీదులు, ఆలయాలు ఇతర ముఖ్య ప్రాంతాల్లో సెక్యూరిటీ ఆడిట్ ఒక నెలలో పూర్తి చేసి సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ అధికారి మల్లికార్జున ప్రసాద్, మైనారిటీ సంక్షేమాధికారి రామసుబ్బారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
‘నకిలీ’ కేటుగాళ్ల అరెస్ట్
అనంతపురం సెంట్రల్: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇంటి కబ్జాకు యత్నించిన కేటుగాళ్లను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. నగరంలోని శారదానగర్‌లో సుసర్ల కనకదుర్గ, సుసర్ల శ్రీలక్ష్మికి ఇల్లు ఉంది. వీరు 2024 నవంబర్‌లో కాకినాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న నగరానికి చెందిన పాములపాటి అమర్నాథ్, పుట్టపర్తికి చెందిన ఆవుల సుబ్రహ్మణ్యం ఇంటిని కొట్టేయాలని పథకం రచించారు. హిందూపురానికి చెందిన బి.శకుంతలకు సుసర్ల కనకదుర్గ తన ఇంటిని రాసి ఇచ్చినట్లుగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు. అనంతరం పుట్టపర్తికి చెందిన శేఖర్‌కు అనంతపురం అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శకుంతల నుంచి జీపీఏ (జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) చేయించారు. ఈ తతంగమంతా అప్పటి అర్బన్ సబ్‌రిజిస్ట్రార్ రమణరావు కనుసన్నల్లో జరిగింది. తర్వాత సదరు జీపీఏ డాక్యుమెంట్ల ద్వారా నగరపాలకసంస్థ కార్యాలయంలో మ్యుటేషన్ చేయించారు. దీనిపై సుసర్ల కనకదుర్గ వారసుడైన సాయి మనోహర్ అనంతపురం వన్‌టౌన్ పోలీసులసు ఆశ్రయించాడు. ఎస్పీ జగదీష్ ఈ కేసును తీవ్రంగా పరిగణించడంతో డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో మహిళా పోలీసు స్టేషన్ సీఐ వెంకటేశులు సమగ్ర విచారణ జరిపారు. శకుంతల, శేఖర్, ఆవుల సుబ్రహ్మణ్యం, దయ్యాల ఉమాపతి, అమర్నాథ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా ఈనెల 25 వరకూ న్యాయమూర్తి రిమాండ్ విధించారు. నిందితుల్లో ఒకడైన పాములపాటి అమర్నాథ్‌పై ఇది వరకూ ఇలాంటివే నాలుగు కేసులు ఉన్నాయి. కేసులో మరికొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు వివరించారు.


