వీఆర్‌ఓలకు పదోన్నతి
అనంతపురం అర్బన్: రెవెన్యూశాఖలో గ్రేడ్–2 వీఆర్‌ఓలకు గ్రేడ్–1 వీఆర్‌ఓలుగా పదోన్నతి కల్పించారు. కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో 110 మందికి పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులను జిల్లా రెవెన్యూ అధికారి ఎ.మలోల గురువారం జారీ చేశారు. అనంతపురం జిల్లాలో 60 మంది గ్రేడ్–2 వీఆర్‌ఓలు, శ్రీ సత్యసాయి జిల్లాలో 50 మంది గ్రేడ్–2 వీఆర్‌ఓలకు గ్రేడ్–1 వీఆర్‌ఓలుగా పదోన్నతి లభించింది. గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ చేతుల మీదుగా పదోన్నతి ఉత్తర్వులను వీఆర్‌ఓలు అందుకున్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్‌ఓ మలోల, ఆర్డీఓలు కేశవనాయుడు, వసంతబాబు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దివాకర్‌రావు పాల్గొన్నారు.
వీఆర్‌ఏలకు లైన్‌క్లియర్..
వీఆర్‌ఓలకు గ్రేడ్–1 పదోన్నతి కల్పించడం ద్వారా గ్రేడ్–2 వీఆర్‌ఓలుగా పదోన్నతి పొందేందుకు డైరెక్టర్ రిక్రూట్ వీఆర్‌ఏ (గ్రామ రెవెన్యూ సహాయకులు)లకు లైన్ క్లియర్ అయ్యింది. గ్రేడ్–1 వీఆర్‌ఓ ఖాళీలు దాదాపు 140 వరకు ఉన్నాయి. ప్రభుత్వం నిబంధన ప్రకారం పదోన్నతి ద్వారా 30 శాతం మాత్రమే భర్తీ చేయాల్సి ఉంటుంది. వీఆర్‌ఏకు పదోన్నతి కల్పిచేందుకు అర్హత ఇంటర్మీడియేట్ లేక డిగ్రీ అనేదానిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది.
గత ప్రభుత్వంలో...
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మానవతాదృక్పథంతో వ్యవహరించి 2020లో వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద ఒకే దఫా 231 మందికి గ్రేడ్–2 వీఆర్‌ఓలుగా పదోన్నతి కల్పించింది. అదే తరహాలో ప్రస్తుతమూ వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద అర్హులందరికీ పదోన్నతి కల్పించాలని వీఆర్‌ఏలు కోరుతున్నారు. పదోన్నతి ద్వారా 30 శాతం కాకుండా 70 శాతం ఖాళీలు భర్తీ చేయాలని ఒక ఫైలు, వన్‌టైమ్ సెటిల్మెంట్‌కు సంబంధించిన ఫైలు సీసీఎల్‌ఏ వద్ద ఉందని చెబుతున్నారు. ఈ రెండింటిలో ఏది ఆమోదం పొందినా దాదాపు అర్హులైన వీఆర్‌ఏలందరికీ ప్రయోజనం చేకూరుతుందన్నారు. అలా కాకుండా 30 శాతం నిబంధన అమలు చేస్తే 140 ఖాళీల్లో 46 మంది వీఆర్‌ఓలకు మాత్రమే పదోన్నతి లభిస్తుందని చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో
110 మందికి అవకాశం


