భూముల రీ సర్వే పక్కాగా చేపట్టండి
కళ్యాణదుర్గం: భూముల రీ సర్వేని పక్కాగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆదేశించారు. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి వద్ద జరుగుతున్న భూముల సమగ్ర రీ సర్వే ప్రక్రియను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ల వారీగా రైతులకు ముందుస్తుగా సమాచారం ఇచ్చి సర్వే చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లకూ తావివ్వరాదని సిబ్బందికి సూచించారు. ఏవైనా అభ్యంతరాలుంటే వెంటనే పరిశీలించి క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపు సర్వే పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం పలు అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్వే ఆఫ్ డివిజినల్ ఇన్‌స్పెక్టర్ అంజలి, తహసీల్దార్ భాస్కర్, మండల సర్వేయర్ ప్రభాకర్, వీఆర్వో జవహర్ బాషా, రైతులు అంజనరెడ్డి, పాతూరప్ప, పలువురు రైతులు పాల్గొన్నారు.
కసాపురంలో నేడు టెండర్లు
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఏడాది పాటు నిర్వహించే వివిధ రకాల పనులకు ఈ నెల 11న బహిరంగ వేలంతో పాటు షీల్డు, ఈ–టెండర్‌లు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ మేడేపల్లి విజయరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు తలనీలాల సేకరణ, ఖాళీ ఆయిల్ డబ్బాలు, నెయ్యి, గోడంబి డబ్బాల సేకరణ, కొబ్బరి చిప్పలు, మొబైల్ ఫోన్ కౌంటర్, పార్కింగ్, టోల్‌గేట్, బెడ్‌షీట్స్, చాపలు అద్దెకు ఇచ్చే లైసెన్స్, తాత్కాలిక షెడ్డు వేసి హోటల్ నిర్వహణ, గోశాల ఎరువు సేకరణ, అగరు బత్తీలు, సంగంధ ద్రవ్యాలు అమ్ముటకు, బియ్యం– బేడల సేకరణ, భక్తుల లగేజీ భద్రపరుచుట తదితర వాటికి టెండర్లను నిర్వహించనున్నట్లు వివరించారు. ఆసక్తిగలవారు బుధవారం ఉదయం జరిగే బహిరంగ వేలం పాటతో పాటు షీల్డు, ఈ–టెండర్లలో పాల్గొనవలసిందిగా ఆయన సూచించారు.
బాల్యవివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
అనంతపురం అర్బన్: జిల్లాను బాల్యవివాహరహితంగా తీర్చిదిద్ధాలని కలెక్టర్ ఆనంద్ అన్నారు. ఐసీడీఎస్, జిల్లా బాలల పరిక్షణ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన బాల్య వివాహ విముక్త్ భారత్ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాల్యవివాహ విముక్తి రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బాల్యవివాహాలు చోటు చేసుకుంటున్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. మూడు నెలల పాటు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని, శిక్షలు ఏ విధంగా ఉంటాయనేదానిపై అవగాహన కల్పించాలని చెప్పారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ అరుణకుమారి, డీఆర్‌డీఏ పీడీ శైలజ, జిల్లా బాలల పరిరక్షణ అధికారి మంజునాథ్, ఓఏసీ శాంతమ్మ, ఉమా, నర్మద, ఆదినారాయణ, భానుజ, సమీర్, వసంతలక్ష్మి, కమలాక్షి, వెంకటర్, ఇర్ఫాన్, నిర్మల పాల్గొన్నారు.
ముగిసిన ‘ప్రాక్టికల్స్’
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన జిల్లా యంత్రాంగం, ఇంటర్ బోర్డు సిబ్బందికి పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, ఆర్‌ఐఓ వెంకటరమణనాయక్ కృతజ్ఞతలు తెలిపారు. చివరి రోజు ఉదయం విడత పరీక్షలకు జనరల్ విద్యార్థులు 522 మందికి గాను 518 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షలకు 403 మందికి గాను 398 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 286 మందికి గాను 269 మంది హాజరయ్యారు. ఆర్‌ఐఓ 2 కేంద్రాలు, జిల్లా వృత్తి విద్యా శాఖాధికారి గురువయ్యశెట్టి 2, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు 3, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు 5 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
భూముల రీ సర్వే పక్కాగా చేపట్టండి


