ఇంటర్నెట్‌ను బాధ్యతగా వినియోగించాలి
అనంతపురం అర్బన్: ఇంటర్నెట్, కృత్రిమ మేధస్సు (ఏఐ)ని దుర్వినియోగం చేయకుండా బాధ్యతాయుతంగా వినియోగించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సేఫర్ ఇంటర్నెట్ డే– 2026 పోస్టర్లను ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. సేఫర్ ఇంటర్నెట్ డేను ఏటా ఫిబ్రవరి రెండో మంగళవారం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారన్నారు. సైబర్ హైజిన్‌కు సంబంధించి ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించడం, సైబర్ ముప్పులు, వాటి నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమన్నారు. ఏఐ డీఫ్ ఫేక్‌లు, ఏఐ వాయిస్ మోసాలు వంటి సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎన్‌ఐసీ ఏడీఐఓ భారతి సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డీఆర్‌ఓ ఎ.మలోల, ఎన్‌ఐసీ ఏడీఐఓ టి.భారతి, ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ రమణారెడ్డి, ఈ–ఆఫీస్ అసోసియేట్ అనిల్ యాదవ్ పాల్గొన్నారు.


